Facebook Twitter
స్నేహం విలువ

స్నేహం విలువ

 


అనగనగా ఒక అడవిలో ఒక కాకి, పావురం ఉండేవి. పావురమేమో నీలంగా ఆకాశం రంగులో మెరుస్తూ ఉండేది. కాకి మటుకు నల్లగా, వికారంగా ఉండేది. కాకికి పావురం అంటే చాలా ఇష్టం. "మనిద్దరం స్నేహితులం- సరేనా?" అనేది చాలాసార్లు, పావురం దగ్గరికొచ్చి. పావురానికి మటుకు అదంటే చులకన. 'ఎట్లా ఉంటుందో చూడు- కర్రిగా' అనుకునేది. కాకితో మాట్లాడకుండా మొహం తిప్పుకునేది. అయితే ఒకరోజున దుష్ట నక్క ఒకటి ఆ అడవిలోకి వచ్చింది. ఆ నక్క చాలా చెడ్డది.

 

ఆ రోజున పావురం చెట్టు కొమ్మ పైన కూర్చొని కునికిపాట్లు పడుతున్నది. ఆ సమయంలో చాటుమాటున నక్కుకుంటూ నక్క దాని దగ్గరికి రాబోయింది. అంతలోనే దాన్ని చూసిన కాకి 'కావ్ కావ్'మని అరిచింది గట్టిగా. దాని అరుపుకి పావురం చటుక్కున కళ్ళు తెరిచి చూసింది. ఆ సరికి నక్క దానికి చాలా దగ్గరికి వచ్చేసింది కూడా! అయితే వెంటనే పావురం గాల్లోకి ఎగిరింది- నక్కబారినుండి తప్పించుకున్నది. అంత జరిగినాక కూడా అది కాకిని చిన్నచూపు చూడటం మానలేదు. 'నల్ల కాకి!' అని అసహ్యించుకుంటూనే ఉంది.


మరునాటి రోజున కాకి పుట్టిన రోజు. ఆ రోజున అది తన తోటి పక్షులన్నిటినీ విందుకు పిల్చింది. అన్నీ వెళ్ళి వచ్చాయిగానీ, పావురం మటుకు వెళ్లలేదు. 'కర్రిదాని ఇంటికి నేను ఎందుకు వెళ్ళాలి?' అని ఊరికే ఉన్నది. అయితే ఆరోజు రాత్రికే దానికి జ్వరం మొదలైంది. తర్వాతి రోజున కాకి తనే దాన్ని పరామర్శించటానికి వచ్చింది. వస్తూ వస్తూ పావురానికి ఇష్టమని ఏవేవో వంటలు కూడా చేసి పట్టుకొచ్చింది. అయితే పావురానికి దాన్ని చూస్తే చికాకు వేసింది. "నీ ఆహారం నాకు అవసరం లేదు. నువ్వు దూరంగా ఉండు" అంది పావురం. ప్రేమగా పలకరించబోయిన కాకి దాని మాటలకు చిన్నబోయింది. 

 


అయితే సరిగ్గా అదే సమయంలో మళ్ళీ పావురాన్ని పట్టుకునేందుకు నిశ్శబ్దంగా చెట్టు ఎక్కుతున్నది నక్క. చిన్నబోయి తల వంచుకున్న పావురపు చూపు నక్క మీద పడింది. "కావ్! కావ్! నక్క వచ్చేసింది! ఎగురు! పారిపో!" అని అది పావురాన్ని ఉద్దేశించి అరిచి, అది పైకి ఎగిరి పోయింది. ఇంకొక్క క్షణం ఆలస్యమైనా పావురం నక్క చేతికి చిక్కి ఉండేది! చటుక్కున తేరుకొని, అతి కష్టం మీద అది కాస్తా ఎగిరిపోయింది. అట్లా కాకి మంచితనాన్ని గుర్తించిన పావురం సిగ్గు పడింది. "నన్ను క్షమించు కాకమ్మా!నిన్ను అంతగా అవమానించాను" అన్నది. "కాకి నవ్వి, మనం మనం స్నేహితులం కదా, స్నేహితుల మధ్య క్షమాపణలుండవు" అన్నది.

 


"ఈ నక్క పని పట్టాలి ఎవరైనా. ఎన్ని పిట్టలను చంపుతోందో ఇది" అని బాధ పడింది పావురం. "ఎవరో రమ్మంటే రారు- మనమే ఏదో ఒకటి చేద్దాం" అని, కాకి దానికొక పథకం చెప్పింది. వెంటనే అవి రెండూ కలిసి నక్క కంట పడకుండా తాము ఉండే చెట్టు చుట్టూతా ముళ్ల కంపలు తెచ్చి పరచాయి. తర్వాతి రోజున నక్క వచ్చింది మళ్ళీ, చెట్టు పైకి చూసుకుంటూ. అది అట్లా చెట్టు దగ్గరికి రాగానే దానికోసమే చూస్తున్న కాకి వేగంగా ఎగురుకుంటూ వచ్చి దాని కన్నును ఒకదాన్ని పొడిచి పోయింది. నక్క కుయ్యో మొర్రో మంటూ, ఒక్క కన్నుతోటే కోపంగా చెట్టును ఎక్కబోయింది. అంతలోనే కాకి, పావురం మళ్ళీ ఓసారి దానిపైకి దాడి చేసాయి. రెండో కన్నునూ పొడిచేసాయి. దాంతో నక్క కాస్తా పట్టుజారి ముళ్ల కంపలో పడి, లేచి, తోచిన దిక్కుకు ఉరికింది. నక్క బెడద తప్పినందుకు కాకి, పావురం ఎంతో సంతోషించాయి. పావురానికి స్నేహం విలువ అర్థమైంది.

 

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో