Home » పిల్లల కోసం » రంగుల సీతాకోక చిలుకFacebook Twitter Google
రంగుల సీతాకోక చిలుక

రంగుల సీతాకోక చిలుక


అనగనగా ఓ చిట్టి సీతాకోక చిలుక ఉండేది. ఆ రోజుల్లో సీతాకోక చిలుకలకు రంగులుండేవి కాదు. అందుకనో, ఏమో, మరి దానికి చాలా ప్రశ్నలు ఉండేవి. అప్పట్లో ఎప్పుడో ఓసారి తను గూట్లో పడుకొని నిద్రపోయింది కదా, ఆ తర్వాత ఇట్లా రెక్కలతో నిద్రలేచింది. నిద్రలేచేసరికి చూస్తే చుట్టూతా ఎవ్వరూ లేరు. అయినా దానికి ఏమీ భయం వెయ్యలేదు! అది అట్లానే ఎగురుకుంటూ‌ పోయి, తనలాగే రంగుల్లేని ఓ పెద్ద సీతాకోక చిలుకని కలుసుకున్నది.

 

"నువ్వేనా, మా అమ్మవి?" అని అడిగింది దాన్ని. అది నవ్వింది. "నేను అప్పట్లో ఎప్పుడో గుడ్లు పెట్టాను. ఆ గుడ్లలోంచి చిన్నచిన్న పురుగులు వచ్చాయి. చిన్న పురుగులు బాగా ఆకులు అలములు తిని, పెద్దయ్యాయి. నేను చూస్తూండగానే అవన్నీ గూడు కట్టుకొని నిద్రపోయాయి. నాకు అంతవరకే తెలుసు" అన్నది.

"అయితే నువ్వేలే, మా అమ్మవి! నేను ఆ గూట్లోంచి ఇవాళ్ళే బయటికి వచ్చాను" అన్నది చిట్టి సీతాకోక చిలుక. "ఓహో! అవునా! బాగుంది బాగుంది. సరే, మరి నీకు ఇప్పుడు ఆకలి వేస్తోందా? పూలమీద వాలి, నీ తొండంతో మకరందాన్ని త్రాగు! కడుపు నిండుతుంది" చూపించింది అమ్మ, ఓ పువ్వు మీద వాలుతూ. కడుపునిండా మకరందం త్రాగాక సీతాకోక చిలుకకు హాయిగా అనిపించింది. కొంచెం కొంచెంగా నిద్ర కూడా వచ్చింది.

"వాతావరణం మారిపోయింది. వాన వస్తుందేమో! ఈ ఆకుల పొద క్రింది వైపున- ఇదిగో- పొడిగా ఉంది చూసావా? ఇక్కడ పడుకో, జాగ్రత్తగా. వానలో తడవకు! ప్రమాదం" జాగ్రత్తలు చెప్పింది పెద్ద సీతాకోక చిలుక. కొద్ది సేపటికి ఉరుములు, మెరుపులతోటి పెద్దవాన మొదలైంది. చిట్టి సీతాకోక చిలుక కదలకుండా అక్కడే కూర్చుని, వాన ముగిసే వరకూ చూసింది. పెద్ద సీతాకోక చిలుక దాని ప్రక్కనే వాలి, కలగంటున్నట్లు మాట్లాడింది: "చాలా పైకి వెళ్తే స్వర్గం అనే చోటు ఉంటుందట. స్వర్గానికి రాజు ఇంద్రుదు. ఆ రాజుకి మెరుపుల వర్షం అంటే చాలా ఇష్టమట.

అట్లా వర్షం వచ్చినప్పుడు ఆయన తన ధనస్సును ఈ భూమి మీదికి వదులుతాడు. నేను కూడా చూసాను- దానికి బలే రంగులు ఉంటాయి!" చెప్పింది. "ఆ రంగులన్నీ‌ మనకి ఉంటే?.. ఎంత బాగుంటుందో!" అనుకున్నది చిట్టి సీతాకోక చిలుక. కానీ ఆ మాటని అది పైకి అనలేదు. అంతలో వాన వెలిసింది. సన్నగా తుంపర మాత్రం పడుతున్నది. అంతలో ఆకాశం నిండా ఇంద్రధనస్సు విరిసింది.

పిల్ల సీతాకోక చిలుక ఇంక ఆగలేక పోయింది. చటుక్కున ఎగిరింది. పెద్ద సీతాకోకచిలుక వారిస్తున్నా వినకుండా ఎత్తుకు, ఇంకా ఎత్తుకు-చివరికి ఇంద్రధనస్సును చేరుకునేంత వరకూ- ఎగురుతూ పోయింది. ఇంద్రధనస్సును తడుముతూ, మురిసిపోతూ "ఇంద్ర-ధనస్సూ! ఇంద్రధనస్సూ! నువ్వింత అందమైనదానివని అనుకోలేదు. నాకు నీ రంగులు కొద్దిగా ఇవ్వరాదా? ప్లీజ్!" అని ప్రాథేయపడింది.

ఇంద్రధనస్సుకి దాని ప్రేమ, అమాయకత్వం చూసి బలే ముద్దొచ్చింది. "సరేలే! నామీద వాలి, బాగా పొర్లు. ఎన్ని రంగులు కావాలో అన్నీ తీసుకో!" అనేసింది. ఇంకేముంది, సీతాకోకచిలుక ఇంద్రధనస్సు మీద పొర్లింది; రంగులు రంగులుగా మారిపోయింది! ఆ వెంటనే వానజల్లుతో చుక్కల డిజైన్ కూడా వేయించుకున్నది! ఇక ఆనాటి నుండీ ప్రపంచంలో సీతాకోక చిలుకలన్నిటికీ రంగులు వచ్చేసాయి!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


పవన్, గణేష్ ఇద్దరూ ఒక రోజున వాళ్ళ ఊరి ప్రక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళి, దారి తప్పారు. అడవిలో అంతా తిరిగి అలసిపోయారు. ...
Dec 18, 2019
తీరిన కష్టం
Aug 8, 2019
నన్ను కాపాడిన పిల్లి
Aug 27, 2019
అంతరంగ ఆలోచన..!!
May 10, 2019
అనగనగా నాగసముద్రంలో గంగరాజు అనే నేతగాడు ఒకడు ఉండేవాడు.
Apr 29, 2019
"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
May 13, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని...
Feb 18, 2019
TeluguOne For Your Business
About TeluguOne