Facebook Twitter
అదే మొట్టమొదటి పుస్తకం

అదే మొట్టమొదటి పుస్తకం

 

 

Self Help అన్న పదం ఇప్పుడు చాలా తరచుగా వినిపిస్తోంది. ఈ పేరుతో వ్యక్తిత్వ వికాస పుస్తకాలు తెగ వచ్చిపడుతున్నాయి. ఇంతకీ ఈ Self Help అన్న పదం ఎలా వచ్చిందో, దాని రూపకర్త ఎవరో ఎప్పుడన్నా విన్నారా! శామ్యూల్‌ స్మైల్స్‌ అనే వ్యక్తి రాసిన ఒక పుస్తకం పేరే ఆ పదానికి నాందిగా మారిపోయింది. ప్రపంచాన్నే పూర్తిగా మార్చేసిన ఘనతను అందకొంది.

1859లో రెండు ప్రముఖమైన పుస్తకాలు విడుదల అయ్యాయి. మొదటిది డార్విన్ రాసిన Origin of the Species. ఈ పుస్తకంతో సృష్టి గురించి మనిషి ఆలోచనా తీరే మారిపోయింది. ఇక రెండవది శామ్యూల్‌ స్మైల్స్ రాసిన Self Help పుస్తకం. ఈ పుస్తకం రాయకముందు శామ్యూల్ ఒక చిన్నపాటి రచయిత మాత్రమే! కానీ ఈ పుస్తకంతో ఆయన రాత్రికి రాత్రే ఒక సెలబ్రెటీగా మారిపోయారు.

నిజానికి శామ్యూల్ తన పుస్తకంలో అనూహ్యమైన విషయాలు ఏమీ చెప్పలేదు. బుద్ధిగా కష్టపడాలి, జీవితానికి ఓ లక్ష్యం ఉండాలి, ఏది ఉన్నా లేకపోయినా మంచి వ్యక్తిత్వం ఉండాలి... లాంటి విషయాలే అందులో కనిపిస్తాయి. కానీ అప్పటివరకూ పెద్దల నుంచి వింటూ వస్తున్నా ఇలాంటి మాటలన్నీ ఒక పుస్తకంలో ఇమడ్చడంతో దానికి విలువ ఏర్పడింది. పైగా తను చెబుతున్న విషయాలని ఆసక్తికరంగా మార్చేందకు మంచి మంచి ఉదాహరణలను కూడా జోడించడంతో, ఆ పుస్తకం పాఠకులకు చేరువైపోయింది.

ఓపికగా ఉండటం, మనసుని నియంత్రించుకోవడం, ఏ పని చేసినా ఏకాగ్రతతో చేయడం... లాంటి లక్షణాలు విజయానికి దారితీస్తాయని అంటారు శామ్యూల్‌. అయితే కేవలం మంచిమాటలు చెప్పడమే కాదు- డబ్బుకి ఉన్న పరిమితులు, భగవంతుని పట్ల భక్తితో మెలగడం, కష్టాల నుంచి నేర్చుకోవడం.... లాంటి విషయాలు కూడా సెల్ఫ్‌- హెల్ప్‌ పుస్తకంలో కనిపిస్తాయి. We learn wisdom from failure much more than from success; Heaven helps those who help themselves... లాంటి వాక్యాల అడుగడుగునా పాఠకుడని ప్రోత్సహిస్తాయి.

శామ్యూల్‌ మంచి మాటల చెప్పడంతోనే ఊరుకోలేదు. మనలో కాంక్ష లేనిదే ఎలాంటి మార్పూ సాధ్యం కాదని హెచ్చరిస్తారు. అందుకే ఓ చోట.... ‘No laws, however stringent, can make the idle industrious, the thriftless provident, or the drunken sober’ అని అంటాడు. ఇలా బుజ్జగిస్తూ, హెచ్చరిస్తూ 13 అధ్యాయాలలో సాగే Self Help పుస్తకం కొన్ని తరాలను ప్రభావితం చేసింది. టొయోటా సంస్థను స్థాపించిన సకిచి టొయోడాలాంటి వ్యక్తులకు మార్గదర్శిగా నిలిచింది. అన్నింటికీ మించి ‘వ్యక్తిత్వ వికాసం’ అనే అంశం మీద వేల పుస్తకాలు రావడానికి కారణమైంది.

Self Help పుస్తకం తాలూకు పీడీఎఫ్‌ ఇంటర్నెట్‌లో ఉచితంగానే లభిస్తుంది. కావాలంటే ఓసారి చదివి చూడండి. ఈ పుస్తకం వచ్చి 150 ఏళ్లు గడుస్తున్నా, ఇందులోని విషయాలు ఇప్పటికీ అక్షర సత్యాలని మీకు కూడా అనిపిస్తుంది. కొండొకొచో మీ జీవితాలని కూడా ఎంతో కొంత ప్రభావితం చేస్తుంది.


- నిర్జర.