Home » పిల్లల కోసం » సరైన పాలకుడుFacebook Twitter Google
సరైన పాలకుడు

సరైన పాలకుడు

 

 

చాలా కాలంక్రితం దక్షిణాపథానికి విజయసింహుడు అనే చక్రవర్తి ఏలికగా ఉండేవాడు. ప్రజలకు ఎలాంటి లోటూ రానివ్వకుండా పరిపాలించేవాడు ఆయన.

వర్షాలు సమృద్ధిగా పడటం వల్ల రాజ్యం అంతా సిరి సంపదలతో సుభిక్షంగా ఉండేది. ఆయన ఏలుబడి క్రింద అనేక సామంత రాజ్యాలు ఉండేవి. ఎందరో రాజులు ఆయనకు లోబడి నడచుకునేవాళ్ళు.

ఒకరోజు విజయసింహునికి ఒక ఆలోచన వచ్చింది: "మనకు ఇంతమంది సామంతులున్నారు- అయినా వాళ్ళకు ఒకరంటే ఒకరికి సరిపోవట్లేదు.

పొరపొచ్చాలు రావటానికి ప్రథాన కారణం, వాళ్ళకు ఒకరి గురించి ఒకరికి తెలియక పోవటం. అందువల్ల మనం త్వరలో ఒక విందును ఏర్పాటు చేసి, వాళ్లందరినీ ఆహ్వానిద్దాం! వాళ్లంతా ఒకరితో ఒకరు కలిసి చర్చించుకునే సందర్భాన్ని కల్పిద్దాం. అట్లా చేస్తే వాళ్లందరి మధ్య సయోధ్య కుదురుతుంది; ఒకరికొకరు మిత్రులౌతారు. అదే సందర్భంలో వాళ్ళు ఏ విధంగా పరిపాలిస్తున్నారో వాళ్ల నోటి ద్వారానే విందాం! గొప్పగా పరిపాలిస్తున్న రాజ్యాధినేతలను గౌరవిస్తూ, ప్రోత్సాహక బహుమతులు ఇద్దాం!" అని.

వెంటనే మహామంత్రి వివిధ రాజ్యాధీశులందరికీ పేరు పేరునా ఆహ్వానాలు పంపించాడు. అనేకమంది రాజులు, సామంతులు, ఆయా రాజ్యాలలోని ధనికులు- అందరూ విజయసింహ మహారాజు నిర్వహిస్తున్న విందుకు విచ్చేసారు.

మహారాజుతో సహా అందరూ వారికి గౌరవంగా స్వాగతం పలికి తగిన వసతులు ఏర్పరచారు. ఆరోజు విందు ముగిసిన తరువాత, మహామంత్రి లేచి, వివిధ రాజ్యల నుంచి వచ్చిన రాజులను ఉద్దేశించి మాట్లాడుతూ "ఆర్యులారా! మా ఆహ్వానం అందుకొని మీరంతా విచ్చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు తమరు కొంత సమయం తీసుకొని తమరి గురించీ, తమరి రాజ్యాల గురించీ, తమరి పరిపాలన గురించీ క్లుప్తంగా చెప్పవలసిందిగా మనవి.

ఆ విధంగా మీరు చేస్తున్న మంచి పనుల గురించి మిగిలిన పాలకులందరికీ తెలుస్తుందనీ, వాటి అమలు వల్ల ఇతర రాజ్యాల ప్రజలకు కూడా మేలు కలుగుతుందని చక్రవర్తుల వారి భావన!" అన్నాడు.

 

 

అప్పుడు కోసలదేశపు మహారాజు లేచి నిలబడి గంభీరంగా "మహారాజా! నేను పది రాజ్యాలను గెలిచాను. నా ఖజానా నిండా ఎనలేని బంగారం, వజ్రాలు, వైడూర్యాలు, నగలు ఉన్నాయి. నావద్ద ఉన్నంత సంపద మన దక్షిణాపథంలో ఎవ్వరి వద్దా లేదు. యావద్దక్షిణాపథంలో నన్ను మించిన వారు లేరు" అని చెప్పి కుర్చున్నాడు.

వెంటనే కళింగ మహారాజు లేచి గట్టిగా నవ్వి, "నీ సొత్తుకు మూడింతల సొమ్ము ఉంది, నా దగ్గర. పైపెచ్చు పధ్నాలుగు మండలాలు పూర్తిగా నా ఆధీనంలో ఉన్నాయి. ఇరవై వేల మంది సైనికుల బలం మాది. కేవలం ప్రభుత్వ వినియోగం కోసమనే మూడు వేల ఎకరాల భూమి ఉంది మాకు!" అని చెప్పి కూర్చున్నాడు.

ఆ వెంటనే పకపకా నవ్వుకుంటూ విజయనగర మహారాజు లేచాడు. "మాకు ఐదు వేల ఎకరాల భూమి ఉంది. మీకు లేనంత ధనము, సైనిక బలము ఉన్నాయి. మీరు మాకన్నా దేనిలోనూ ఎక్కువ కాదు! నేను ఎందరు రాజులను ఓడించి చెరసాలలో బంధించానో లెక్కలేదు: అని కూర్చున్నాడు.

ఈ విధంగా రాజులందరూ ఒక్కొక్కరూ తమ గొప్పతనాన్ని తమ ముందు రాజులు చెప్పిన సంపద లెక్కలతో పోల్చి చెప్పుకుంటూ పోయారు. చివరికి, అంగ మహారాజు లేచాడు.

ముందుగా సభలోని వారికి అందరికీ కృతజ్ఞతలు చెప్పి, ఆనక విజయసింహ మహారాజుతో చెప్పాడు: "మహారాజా! తమరి సామ్రాజ్యపు సరిహద్దున ఉన్న చిన్న దేశం మాది. ఈ రాజులందరూ చెప్పినన్ని మొత్తాలు మా ఖజానాలో ఏనాడూ లేవు. అయినప్పటికీ మేము మా రాజ్యంలో ఎన్నో చెరువులు, బావులు త్రవ్వుకున్నాం. చక్కని రోడ్లు వేసుకున్నాం. రాజ్యంలోని ప్రజలందరికీ కనీస ఆహార,గృహ వసతులను, పిల్లలు చదువుకునేందుకు చక్కని పాఠశాలలను ఏర్పరచుకున్నాం.

 

 

మా సైనికులకు, వారి కుటుంబాలకు వసతులు ఏర్పరచుకున్నాం. ఇవన్నీ మా ప్రజల మంచితనం వల్ల, క్రమశిక్షణ వల్ల వీలైనాయి. ఇక ఇంతకంటే గొప్ప పనులు ఐతే మేము ఏమీ చేయలేదు: అని ముగించి కూర్చున్నాడు.

సభ అంతా కొద్ది సేపు నిశ్శబ్దమైపోయింది. తర్వాత రాజులు, మహరాజులతో అందరూ లేచి నిలబడి చప్పట్లు కొట్టారు. సభంతా హర్షధ్వానాలతో నిండిపోయింది.

విజయసింహుడు అంగరాజును అభినం-దిస్తూ " 'రాజు తన ఖజానా గురించి కాక, ప్రజల బాగు గురించి తపించాలి' అని మాకందరికీ నేర్పించిన అంగ ప్రభువులవారు మాకు గురు తుల్యులు. వారికి మనసారా నమస్కరిస్తూ, రాబోయే పది సంవత్సరాల వరకు అంగరాజ్యం వారు మాకు కట్టవలసిన కప్పాన్ని పూర్తిగా మినహాయిస్తున్నాం" అని ప్రకటించాడు!

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో
 

 


అనగా అనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది.
Dec 22, 2018
సుద్దాలకొట్టంలో నివసించే గిరీష్ పావురాలను పెంచేవాడు. పిల్లవాడుగా ఉన్నప్పుడు అతనొక పావురాన్ని కాపాడాడు...
Dec 21, 2018
ఒక అడవిలో ఒక నెమలి, పావురం, కోయిల స్నేహంగా ఉండేవి.
Dec 19, 2018
అది మా తమ్ముడి పుట్టినరోజు. ఇంట్లో‌ మా అమ్మ చాలా హడావిడి చేస్తోంది...
Dec 13, 2018
బటానిత్తు బటానిత్తు బాగున్నావా...
Dec 4, 2018
అనగనగా ఒక రాజ్యంలో ఒక జమీందారు ఉండేవాడు. అతనికి ఇద్దరు కొడుకులు...
Dec 3, 2018
ఒక ఊళ్ళో కోడిపుంజు ఒకటి ఉండేది. అది చాలా అందంగా ఉండేది...
Nov 30, 2018
కోడీ కోడీ వస్తావా, ఆడుకుందాం వస్తావా? రాను రాను రామయ్యా, తీరికలేదు తీవయ్యా
Nov 17, 2018
బడిలో బాలల దినోత్సవం జరుపుకుంటున్నారు. వేదిక మీద వెనకగా ఉన్న ఫొటోలో...
Nov 13, 2018
అనగనగా గడ్డంనాగేపల్లిలో ఒక రైతు ఉండేవాడు...
Nov 12, 2018
TeluguOne For Your Business
About TeluguOne