Facebook Twitter
పిల్లాడు-పిచ్చుక

పిల్లాడు-పిచ్చుక

 


నది ఒడ్డున చెట్టు మీద రెండు పిచ్చుకలు ఉండేవి. అవి మంచి స్నేహితులు. రెండూ కలిసి పుల్లలు తెచ్చుకున్నాయి; రెండూ కలిసి గూడు కట్టుకున్నాయి; చాలా కాలం కలిసి బ్రతికాయి. ఒకనాడు ఉదయాన్నే ఒక పిచ్చుక నిద్ర లేచింది. చుట్టూ చూసింది. వాతావరణం చాలా బాగా అనిపించింది. నదిలో ఉన్న పూలను, మొక్కలను చూస్తూ సంబరపడింది.

 


నీళ్ళలో తన నీడ చూసుకుందామని, క్రిందకు వంగింది. అంతే- పొరపాటున కాలు జారి నదిలో పడిపోయింది! నది బాగా వేగంగా పోతోంది; దానికి ఈత కూడా రాదు! దాంతో అది నదిలో కొట్టుకుపోయింది. కొంచెం సేపటికి రెండవ పిచ్చుక నిద్రలేచింది. మిత్రుని కోసం చూసింది. మిత్రుడు లేడు. 'ఎక్కడికి వెళ్ళాడబ్బా ఇంత పొద్దున్నే?' అనుకుంది. ఎంత సేపు వేచి చూసినా స్నేహితుడు తిరిగి రాలేదు. చివరికి అది ఆందోళన పడింది. చుట్టూ వెతికింది. తన ఫ్రెండ్‌ ఎక్కడా కనపడలేదు. అటూ ఇటూ ఎగిరి వెళ్ళి చూసింది. ఎక్కడా దొరకలేదు. బాధ పడుతూ ఒకచోట కూర్చుని ఏడుస్తున్నది.

 


అంతలో అటుగా వచ్చాడు రాము. వాడికి ఒక్క అవ్వ తప్ప వేరే ఎవ్వరూ లేరు. "ఎందుకు ఏడుస్తున్నావ్?" అని అడిగాడు దూరం నుండే. "నా ఫ్రెండ్ కనిపించట్లేదు" అన్నది పిచ్చుక. "నా ఫ్రెండూ కనిపించట్లేదు. నేను ఏడుస్తున్నానా?" అన్నాడు రాము- "ఇదిగో, ఈ కాసిని సెనగలు ఉన్నై నా దగ్గర- తిను" అని దానికి వేస్తూ. పిచ్చుక ఏమీ అనలేదు. సెనగలు తినలేదు. "ఏడవకు" అని దాన్ని నిమిరాడు రాము. "ఇకమీద నువ్వు-నేను ఒకరికొకరం స్నేహితులం సరేనా?" అన్నాడు. పిచ్చుకకు ఏడుపొచ్చింది. కానీ దానికి రాము తన స్నేహితుడు అని అర్థం అయింది.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో