Facebook Twitter
న్యాయం

న్యాయం

 

చాలా కాలం క్రితం ధాన్యకటకంలో సూరయ్య, వరదయ్య అనే వ్యాపారులు ఇద్దరు ఉండేవాళ్ళు. ఇద్దరూ ఒకే రకం వ్యాపారాలు చేసేవాళ్ళు; ఇద్దరికీ సత్సంబంధాలు ఉండేవి. ఒకసారి సూరయ్య, అతని భార్య కాశీకి పోయి రావాలనుకున్నారు. అయితే ఆ రోజులో డబ్బులు దాచుకునేందుకు బ్యాంకులు ఉండేవి కావు; అలాగని సొమ్మును వెంట తీసుకు పోదామంటే మార్గ మధ్యంలో దొంగల బెడద ఉండేది. దారి దోపిడి దొంగలు మాటు వేసి, బాటసారుల్ని దోచుకునే పరిస్థితులు ఎక్కువ. అందుకని ఆ రోజుల్లో ఎవరైనా యాత్రలకు పోవాలంటే ముందుగా తమ డబ్బును, నగల్నీ ఎవరైనా నమ్మకస్తుల దగ్గర దాచుకొని వెళ్ళేవాళ్ళు.

"మరి ఎలాగ?" అని ఆలోచించిన సూరయ్య తను అంతవరకూ కూడబెట్టిన డబ్బునూ, భార్య నగల్నీ వరదయ్య దగ్గర దాచి పెడదా-నుకున్నాడు. వరదయ్య కూడా "మీరు తిరిగి వచ్చేంత వరకూ మీ సొమ్మును కూడా నా సొమ్ము లాగానే దాచి ఉంచుతాను, దానిదేమున్నది?" అనటంతో, సూరయ్య తన డబ్బునీ, నగల్నీ ఓ సంచిలో పెట్టి, వరదయ్య చేతికి అందించాడు. ఆనక సూరయ్య దంపతులు నిశ్చింతగా కాశీయాత్ర మొదలు పెట్టారు.

అయితే, ఇక్కడ వరదయ్యకు ఆ సంచీని చూడగానే "అమ్మో! చాలా బరువుగా ఉన్నదే, ఎంత సొమ్ము ఉన్నదో!" అనిపించింది. ఎలాగైనా వాటిని కాజెయ్యాలనే దుర్బుద్ధి పుట్టింది. సూరయ్య దంపతులు కాశీకి వెళ్ళిన రెండో రోజునే అతను సంచీని విప్పి చూసి, దానిలోని డబ్బుని, నగల్నీ తీసి తన పెట్టెలో దాచేసుకున్నాడు. ఆరోజు సాయంత్రం చీకటి పడుతుండగా అతను పెరట్లో ఒక గుంట త్రవ్వాడు. ఆ మట్టిలోంచి రాళ్లన్నిటినీ ఏరి, సూరయ్య సంచీలో వేయటం మొదలు పెట్టాడు. సొమ్ముల మూటకు బదులుగా ఈ మూటని గుంతలో పెడదామని అతని ఆలోచన! అయితే అతని దురదృష్టమో, ఏమో గానీ, సరిగ్గా అదే సమయానికి అటువైపుగా వెళ్తున్నాడు ఒక గంధర్వుడు. 

ఆత్రంగా రాళ్ళు ఏరుతున్న వరదయ్యను చూసి గంధర్వుడికి ఆశ్చర్యం వేసింది. కొంచెం సేపు అక్కడే ఆగి, వరదయ్య ఉద్దేశాన్ని, దాన్ని నెరవేర్చుకునేందుకై అతను చేస్తున్న పనిని గమనించాడు. గంధర్వుల శక్తికి అడ్డు ఏమున్నది? వరదయ్య దుష్టబుద్ధి అతనికి వెంటనే తెలిసిపోయింది. దాంతో అతను నవ్వుకొని, తన శక్తితో ఆ సంచిలోని రాళ్లలో ఒకదాన్ని అత్యంత విలువైన వజ్రంగా మార్చేసాడు. సంగతి తెలీని వరదయ్య సంచిని అంతా పూర్తిగా రాళ్లతో నింపేసి, గోతిలో పడేసాడు! మెల్లగా మూడు నెలలు గడిచాయి. కాశీ నుండి సూరయ్య దంపతులు తిరిగి వచ్చారు. వరదయ్య ఇంటికి వెళ్ళి తన సొమ్ముల సంచీ అడిగాడు సూరయ్య.

 

వరదయ్య అతన్ని చూసి సంతోషం నటిస్తూ "ఓహో! తిరిగి వచ్చేసారా, సూరయ్యా?! ప్రయాణం బాగా జరిగిందా? దర్శనాలూ అవీ బాగా ఐనాయా? ఇక్కడ రోజులు ఏమాత్రం బాగుండటం లేదు సూరయ్యా! విన్నావుగా, ఇళ్ళకు కన్నం వేసి దొంగతనం చేసే దొగలు ఎక్కువ అయి పోతున్నారు. అందుకని నువ్విచ్చిన డబ్బునీ, నగల్నీ అన్నిటినీ జాగ్రత్తగా నా పెరడులో పూడ్చి పెట్టాను- నువ్వే తీసుకో, శ్రమ అనుకోకు" అని దూరం నుండే సంచిని పూడ్చిన స్థలం చూపించి, ఇక తను అక్కడ లేకుండా ఇంటిలోకి వెళ్ళిపోయాడు.

అక్కడ త్రవ్విన సూరయ్యకు సంచీ కనబడింది. అతను సంతోషంతో దాన్ని తీసుకుని, వరదయ్యకు ధన్యవాదాలు చెప్పి, ఇంటికి వెళ్ళాక గానీ సంచిని విప్పి చూసుకోలేదు. చూసుకుంటే ఏముంది, అందులో నిండా రాళ్ళు ఉన్నాయి! డబ్బు, బంగారం లేనే లేవు!! ఇంకేముంది, సూరయ్య లబోదిబో మంటూ పోయి న్యాయస్థానంలో ఫిర్యాదు చేసాడు. సూరయ్య చేతిలోని సంచీని తీసుకుని అందులోని రాళ్ళను తన ముందున్న బల్ల పైన కుమ్మరించాడు న్యాయాధికారి. ఆ రాళ్ళలో ఒక రాయి ఆయన కంటిని ఆకర్షించింది. దానికి ఏ మూలనో కొంచెం మెరుపు ఉండింది. న్యాయాధికారి ఆ రాయిని కడిగించి, జాగ్రత్తగా పరిశీలించాడు: అది నిఖార్సయిన మేలిమి వజ్రం!

 

"చూసావా, సూరయ్యా! స్నేహితుడు నిన్ను ఎంత మోసగించాలని చూసినా, నీకు మటుకు మేలే జరిగింది. ఇదిగో, నీ స్నేహితుడు నిన్ను మోసం చెయ్యటం కోసం, తనకు దొరికిన రాయినల్లా సంచీలోకి వేసాడు. అయితే ఆ క్రమంలో అనుకోకుండా చాలా విలువైన వజ్రపు రాయిని కూడా ఒకదాన్ని, సంచీలో వేసి పూడ్చి పెట్టాడు. ఆ ఒక్క వజ్రపు విలువే పది- పదిహేను కిలోల బంగారపు విలువకు సమానం అవుతుంది!" నవ్వుతూ చెప్పాడు న్యాయాధికారి.

సూరయ్య ఆశ్చర్యపోతూనే న్యాయాధికారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. "పోనీలెండి, మరయితే ఇక వరదయ్యను ఏమీ అనక్కర్లేదు- దేవుడి దయ వల్ల నాకు ఏమీ అన్యాయం జరగలేదు! నిజంగానే నా సర్వస్వం పోయిందని కృంగిపోయాను నేను!" అన్నాడు. "అదే మనలోని లోపం, సూరయ్యా! మోసం చేసిన వాడిని ఇప్పుడు వదిలేస్తే, వాడు మరొకరిని మోసం చేస్తాడు. దోషిని అట్లా వదిలి పెట్టకూడదు. అతనికి తగిన శిక్ష అతనికి పడాల్సిందే" అని వెంటనే తన గుమాస్తాను పంపి వరదయ్యను పిలిపించాడు న్యాయాధికారి.

"వరదయ్యా! రా! రా!‌ కూర్చో! సూరయ్య డబ్బును అంత చక్కగా, బలే దాచావే! నిజంగా, నీ పెరటి నేలలో బలే మహత్తు ఉందోయ్! మరేం లేదు; నా దగ్గర కొంత బంగారం ఉంది- దాన్ని కూడా కాస్త నీ పెరట్లో పూడ్చిపెడతావా, అది కూడా విలువైన రాయిగా మారుతుంది?" అన్నాడాయన, వరదయ్య రాగానే. న్యాయాధికారి తనని మెచ్చుకుంటున్నాడో, తిడుతున్నాడో అర్థం కాని వరదయ్య గుటకలు మింగాడు.

 

"నేను చెప్పేది నిజమే సుమా! చూడు, నువ్వు సూరయ్య సంచీని తీసుకెళ్ళి మీ పెరట్లో పూడ్చిపెట్టావా? అవి కాస్తా ఇప్పుడు వజ్రాలుగా మారాయి! అందులో ఇదొక్కటే ఇప్పుడు లక్ష వరహాలు చేస్తుంది. నిజం! నమ్మకం చిక్కట్లేదా? చూడు, కావాలంటే. ఎట్లా మెరుస్తున్నదో చూసావా? సాన పడితే అద్భుతంగా అవుతుందిది" అంటూ ఆ వజ్రాన్ని తీసి చూపించాడు న్యాయాధికారి. "మహాప్రభో! సూరయ్య సొమ్ములన్నీ నా తిజోరీలో భద్రంగా ఉన్నాయి. అతను తమరికి చూపించాడే, ఆ సంచీలోని సామాను అంతా పూర్తిగా నాదే. నా పెరడులో దొరికిన వజ్రాలన్నీ కూడా, మరి నావే అవుతాయి కదా..?!" అని తన దుష్ట బుద్ధిని మరో మారు చూపించాడు వరదయ్య.

"నోర్ముయ్! నిన్ను నమ్మి, నీ స్నేహితుడు ఒకడు తను చెమటోడ్చి సంపాదించిన ధనాన్ని కొంతకాలం దాచి పెట్టమని నీచేతికి ఇచ్చి వెళ్తే, దాన్ని మ్రింగేసేందుకు పథకాలు రచించావు. సొమ్ముల స్థానంలో రాళ్ళు వేసి అతనిని మోసం చేశావు. అతని అదృష్టం కొద్దీ ఆ రాళ్లలో ఒకటి విలువైన వజ్రం అయ్యింది. ఆ సంగతి తెలియగానే ప్లేటు ఫిరాయిస్తావా? నీకు తగిన శాస్తి జరగాలి. నీ పాడుబుద్ధిని వ్యక్తం చేసుకున్నావు. మర్యాదగా సూరయ్య డబ్బు, నగలు తెచ్చి ఇవ్వు. ఆ తర్వాత నిన్ను తీరిగ్గా విచారించి, నీ ఆస్తులన్నీ‌ జప్తు చేసుకొని, సంవత్సరం పాటు నిన్ను కారాగారంలో పెట్టిస్తాను నేను!" చెప్పాడు న్యాయాధికారి కఠినంగా.

"క్షమించండి, బుద్ధి గడ్డి తిని, తప్పు చేశాను! సూరయ్య సొమ్ములు సూరయ్యకు తెచ్చి ఇస్తాను" అని పశ్చాత్తాపపడి, సూరయ్య సొమ్మును సూరయ్యకు అప్పచెప్పాడు వరదయ్య: "నాకు బుద్ధి వచ్చింది. నన్ను వదిలెయ్యండి చాలు. ఆ వజ్రాలూ వైడూర్యాలూ‌ ఏమీ నాకు అవసరం లేదు. వాటిని మీరు కావాలంటే సూరయ్యకు ఇవ్వండి, లేదా తమరికి తోచిన విధంగా గ్రామాభివృద్ధికై ఉపయోగించండి. నేను మటుకు చాలా మారిపోయాను. ఇకపై ఎన్నడూ దురాశను దరి చేరనీయను" అని కళ్ళ నీళ్ళు పెట్టుకుంటూ లెంపలు వేసుకున్నాడు.

"నా సొమ్ములు నాకు దొరికాయి, అదే చాలు. అయ్యా! ఆ వజ్రాన్ని ఇతను అన్నట్లు గ్రామాభివృద్ధికై వినియోగించండి. అదే సబబుగా ఉంటుంది. తమరికి వీలైతే ఈ వరదయ్యను క్షమించండి" అన్నాడు సూరయ్య సంతోషంగా. సూరయ్యకు న్యాయం జరిగినందుకు, వరదయ్య మనసు మారినందుకు, గ్రామాభివృద్ధికి నిధులు ఏర్పడ్డందుకు సంతోషిస్తూ ఆకాశంనుండి వానజల్లులు కురిపించాడు గంధర్వుడు.


కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో