Facebook Twitter
హనుమంతుని జీవితమే విజయానికి పాఠం

మన దేశంలో చిన్న పిల్లల దగ్గర్నుంచీ పండు ముసలి వరకూ హనుమంతుడు అంటే ఇష్టపడని వారు ఉండరు. వారి దృష్టిలో హనుమంతుడు ఒక దేవుడు మాత్రమే కాదు... ఒక హీరో, ఒక రోల్ మోడల్‌. ఆయన వ్యక్తిత్వంలోని ప్రతి లక్షణమూ ఆదర్శప్రాయంగానే కనిపిస్తుంది.

సరదా సరదా బాల్యం
కృష్ణుని బాల్య లీలలు ఎంతగా ప్రసిద్ధమో, హనుమంతుని బాల్య చేష్టలూ అంతే ప్రసిద్ధం. అవి ఒకోసారి శృతి మించవచ్చుగాక. కోరికోరి ఆపదలకి అవకాశం ఇచ్చి ఉండవచ్చుగాక. కానీ బాల్యం నిర్లిప్తంగా సాగిపోతే ఎలా! ఒక చోట బుద్ధిగా కూర్చునే పిల్లవాడిని చూసి నలుగురూ మెచ్చుకోవచ్చేమో కానీ... మున్ముందు సమస్యలను ఎదుర్కొనేందుకు కావల్సిన చొరవా, చురుకూ అతనిలో లోపిస్తాయి.

శ్రేయోభిలాషి
సూర్యుని దగ్గర శిష్యరికం చేసినందుకు గురుదక్షిణగా, ఆంజనేయుడు సూర్యుని కుమారుడైన సుగ్రీవునికి మంత్రిగా ఉండేందుకు సిద్ధపడతాడు. వాలి చేతిలో పరాభవం పొందిన సుగ్రీవుడు రుష్యమూక పర్వతం మీద తలదాచుకుంటే... హనుమంతుడు కూడా అతన్ని అనుసరిస్తాడు. ఆ పర్వతం దగ్గరకు వచ్చిన రామలక్ష్మణులను బ్రాహ్మణుని రూపంలో పరీక్షించి.... వారిని సుగ్రీవునితో కలుపుతాడు. హనుమంతుడు తల్చుకుంటే సుగ్రీవునికే నాయకునిగా ఉండగలిగేవాడు. కానీ గురువుగారి మీద అభిమానంతో, సుగ్రీవునికి మంత్రిగా నిలిచి అడుగడుగునా అతనికి శ్రేయస్సుని కలిగించాడు.

విధేయత
హనుమంతుడు చిరంజీవుడు. కానీ మానవరూపంలో ఉన్న రాముని మీద అభిమానంతో అతని ప్రతి ఆజ్ఞనీ నెరవేర్చాడు. సీతమ్మ జాడని కనిపెట్టడం దగ్గర్నుంచీ, సంజీవని మోసుకురావడం వరకూ ఎలాంటి అహంకారమూ లేకుండా రామునికి సేవ చేశాడు. పెద్దలకు, గురువులకు ఏ విధంగా విధేయంగా ఉండాలో ఆచరణలో చూపించాడు. అందుకనే నవవిధ భక్తులలో ‘దాస్యం’ గురించి చెప్పుకొనేటప్పుడు హనుమంతునే ఉదాహరణగా పేర్కొంటారు.

ఆత్మవిశ్వాసం
తన నమ్మకం ఎట్టిపరిస్థితుల్లోనూ వృధా కాదని హనుమంతుని విశ్వాసం. ఆ విషయాన్ని నిరూపించేందుకు నారదుడు ఓ కథని కూడా నడిపిస్తాడు. రాముని చేతే హనుమంతునికి మరణదండన విధిస్తాడు. కానీ రామనామాన్ని నమ్ముకున్న హనుమంతుని రామబాణం ఏమీ చేయలేకపోతుంది. 

పట్టుదల
ఆలోచించకుండా ఏ దీక్షనీ చేపట్టకూడదు. ఒకసారి చేపట్టిన తర్వాత దాని నుంచి ఇసుమంతైనా సడలకూడదు. అందుకు హనుమంతునే ఉదాహరణగా పేర్కొనవచ్చు. హనుమంతుడు బ్రహ్మచారిగా ఉంటానని ప్రతినపూనాడు. ఎన్ని అవాంతరాలొచ్చినా ఆ ప్రతినకు కట్టుబడే ఉన్నాడు. 

కార్యసాధన
రామాయణంలో ఏ ముఖ్య ఘట్టాన్ని తీసుకున్నా అందులో హనుమంతుని పాత్ర ప్రముఖంగా కనిపిస్తుంది. సాగరాన్ని లంఘించాలన్నా, సీతమ్మ జాడను కనుగొన్నా, లంకానగరాన్నే దహనం చేసినా, రాక్షసులను సంహరించినా, సంజీవని పర్వతాన్ని పెకలించి లక్ష్మణుని రక్షించినా... ఎటువంటి కార్యాన్నయినా సుసాధ్యం చేసిన కార్యశీలత హనుమంతునిది.

జ్ఞాని
హనుమంతుడు వినయవిధేయతలకు ప్రతీక అని తెలుసు కానీ, ఆయన గొప్ప జ్ఞాని అన్న విషయాన్ని మర్చిపోతుంటాం. సాక్షాత్తూ ఆ సూర్యభగవానుడితో పాటు తిరుగుతూ సకల శాస్త్రాలూ అభ్యసించిన ఘనత హనుమంతునిది. అణిమ, మహిమలాంటి అష్టసిద్ధులనీ గుప్పిట్లో ఉంచుకున్న సామర్థ్యం ఆయనది. అంతదాకా ఎందుకు! రాముని చరిత్రను లిఖించాలనే కోరికతో తనే స్వయంగా ఓ రామాయణాన్ని లిఖించాడని చెబుతుంటారు.

మనలో దాగిన శక్తి
మనలో ఎవ్వరమూ హనుమంతునితో సమానం కాకపోవచ్చు. కానీ మనకీ ఆయనకీ మధ్య ఒక పోలిక మాత్రం ఉంది. హనుమంతుని శక్తి అపారం. దానిని ప్రపంచం తట్టుకోవడం అసాధ్యం. అందుకనే అవసరం వచ్చి, ఎవరన్నా తన శక్తిని గుర్తుచేస్తేనే కానీ ఆయనకు తనలో ఉన్న బలం తెలియదు. మనం కూడా అంతే! మనలో ఎంత శక్తి ఉందో మనకే తెలియనంత ఆత్మన్యూనతతో ఉంటాము. ఆ శక్తిని గుర్తించిన రోజున అద్భుతాలు చేసేందుకు సిద్ధపడతాము.

 

 

- నిర్జర.