Facebook Twitter
ఇంద్రకీలాద్రి

ఇంద్రకీలాద్రి!

 

 


అల్లదే ఇంద్రకీలాద్రి, ఆకసమ్ము
పై కెగయబ్రాకు, నల్ల యా ప్రాతగుడిసె
పార్థుడా శైలశిఖరాన పాశుపతము
బడయ శివుగూర్చి ఘోరతపమ్ము జేసె!

కార్యశూరత దక్కి నిర్వీర్యు లౌచు
కన్నభూమాతకును కళంకమ్ము గూర్చు
పరమనాస్తికులిపుడు తపఃప్రభావ
మెల్ల బూటక మంచు నిందింతు రకట!

ఆ నగోత్తమమున కధిష్ఠానదేవి
కనకదుర్గాభవాని లోకాలతల్లి
తొల్లి తన యుగ్రశక్తుల నెల్ల నొక్క
బాలసన్యాసి ఘనతపోబలముకతన
గోలు పడి, యొంటి నివసింప దాళలేక
స్త్రీజనోచిత కోమలప్రేమ చకిత
చిత్తయై, మొన్నమొన్ననే చెంత జేర
విభుని మల్లికార్జునుని రప్పించుకొనియె!

ప్రాతదయ్యును నా వధూవరులప్రేమ
నవనవానందజనక మై భువనతతికి
పరగ నిత్యకళ్యాణమున్‌ పచ్చతోర
ణముగ శోభిల్లజేయు నన్నగవరమును!

ఆలయము ప్రక్క కోనేరగాధమైన,
దప్సరస్త్రీలు రాత్రుల నచట జలక
మాడి, దేవిని పూజించి వీడినట్టి
పసుపుకుంకుమ మక్షతల్‌ కుసుమములవె!

ఆ కొలని చెంతనున్న గుహాంతరముల
యుగములాదిగ మునివరుల్‌ యోగనిరతు
లై నిమీలితలోచను లగుచు లోక
సంగ్రహార్థముగ తపమ్ము సల్పుచుంద్రు!

అద్రిశిఖరమ్ముపై కిరాతార్జునులు మ
హాహవ మ్మొనరించిన యట్టిచోట
నేటికిని చిన్నె లగుపించు వాటివలన
విజయవాడ యంచు పురికి పేరు కలిగె!

చుట్టు నున్నట్టి పర్వతాల్‌ పెట్టనట్టి
కోటలై యొప్ప శాత్రవకోట్ల కెల్ల
మిగుల దుర్భేద్యమై పండువగుచు కనుల
కలరు మా విజయునివాడ, చెలిమికాడ!

కాలువలు నల్గడల నలంకారములుగ 
జెలగ, జలయంత్రనిర్గత జలకణాళి
మౌక్తికాహారభూషిత మందిరాంగ
ణోల్లసత్‌ పుష్పవల్లుల నొప్పుపురము!

వారకాంతలు నివసించు వాడలందు
గాన నృత్తానుకర మృదంగములదైన
స్నిగ్ధగంభీరఘోషము చెవులబడిన
తోడనే మేఘరవమంచు దోచు నీకు!

భాగ్యవంతులు మేడల పాన్పులందు
మందమతులట్లు పొరలాడుచుందు రకట!
అన్నమో రామచంద్రా యటంచు నెండ
నేడ్చు బీదవానికి నిల్వనీడలేదు!

కాంచుమా కృష్ణవేణి, దుర్గాంబ పైడి
ముక్కుపో గందుకొన పంత మూని వేగ
వచ్చు నాటోపముగ పరవళ్ళతోడ
చెంగలించుచు నార్చుచు భంగపడుచు!

ఇంద్రకీలాద్రి కాసింత సందు నీయ
కృష్ణవేణి మోమోట మింతేని లేక
చీల్చి భేదించి ప్రవహించు చెచ్చెర నదె
చనువునిచ్చిన నెక్కెను చంక కనగ.

 

(‘ఇంద్రకీలాద్రి’ ఘనతను, అక్కడి కనకదుర్గ మహత్తును వివరిస్తూ బసవరాజు అప్పారావుగారు రచించిన కావ్యమిది)