Home » కథలు » కలిసొచ్చిన అదృష్టంFacebook Twitter Google
కలిసొచ్చిన అదృష్టం

కలిసొచ్చిన అదృష్టం

 

రాయల చెరువులో నివసించే లక్ష్మయ్య అదృష్టవంతుడు అనుకునేవాళ్ళు అందరూ. పది ఎకరాల చేను ఉండేది అతనికి. లక్ష్మయ్య చాలా మంచివాడు. ఎదురు పడిన శత్రువునైనా ఇంట్లోకి పిలిచి మర్యాదలు చేసేంత మంచివాడు. ఆ సంవత్సరం అందరిలాగానే లక్ష్మయ్య కూడా తన పొలంలో వేరుశనగ విత్తనాలు వేసేందుకు తయారయ్యాడు. చేనును బాగా దుక్కి చేసి, విత్తనాలు వొలిచి పెట్టుకొని, వర్షం కోసం ఎదురు చూడసాగాడు. కానీ అంతకు ముందులాగే ఆ ఏడాది కూడా అదనులో వర్షాలు పడలేదు. 'పడతాయిలే' అని ధైర్యం చేసి విత్తిన రైతులందరూ ఘోరంగా నష్టపోయారు. చాలా పొలాల్లో వేరుశెనగ మొలకలు కూడా రాలేదు. గ్రామంలో అందరూ అప్పులపాలయ్యారు. "త్వరపడి విత్తకపోవటం మంచిదైంది. అయినా ఈ సంవత్సరం అంతా చేన్లను బీడుగా వదిలితే ఎలాగ?" అని ఆలోచిస్తూ విచారంలో మునిగాడు లక్ష్మయ్య.


ఆరోజు రాత్రి చీకటి పడుతుండగా ఒక ముసలాయన లక్ష్మయ్య ఇంటి తలుపు తట్టాడు. "పెద్దయ్యా! మాది కొమ్ముల తాండా. సంతకని బయలుదేరి వస్తుంటే బండి చక్రం విరిగి, ఆలస్యమైపోయింది. అటూ ఇటూ కాకుండా ఇరుక్కుపోయాను. తమరు సరేనంటే ఇక్కడ ఈ రాత్రికి పడుకొని, రేపు ఉదయంగా మళ్ళీ మా ఊరికి నేను బయలుదేరి పోతాను" అని. "దానిదేముంది, పశువుల్ని అక్కడ కట్టేసి, నువ్వు లోనికి రా, రొంత బువ్వ తిందువు మాతోటి" అని అతన్ని ఆహ్వానించిన లక్ష్మయ్యకు మాటల సందర్భంలో మరిన్ని వివరాలు తెలిసాయి: అతను అంతకు క్రితం పండించిన కొర్రలు అమ్ముకునేందుకు వచ్చాడు సంతకు. అతని దగ్గర ఐదు బస్తాల కొర్రలు ఉన్నాయి.

 

ఆ రోజు రాత్రి నిద్రపోబోతుండగా లక్ష్మయ్యకు ఓ ఆలోచన వచ్చింది. "వేరుశెనగకు అదను ఎలాగూ తప్పిపోయింది. ఇప్పుడు తన చేనులో కొర్రలు వేస్తే ఎలా ఉంటుంది? దేవుడు నా కోసమే పంపించినట్లున్నాడు ఇతన్ని! ఒక్క వాన పడితే చాలు- కొర్రలు పండిపోతాయి. వాటికి పెద్ద రేటు ఉండదు; కానీ చేనును బీడుగా వదలటం కంటే అదే మంచిది కద!" తెల్లవారాక, ముసలాయన చెప్పిన రేటుకు ఐదు బస్తాల కొర్రలూ కొనేసి అతన్ని సంతోషంగా ఇంటికి పంపించాడు లక్ష్మయ్య. నిజంగానే అదృష్టం ఆ ముసలాయన రూపంలో వచ్చిందేమో మరి- ఆ రోజు సాయంత్రమే వర్షం మొదలైంది. ఎక్కడో వచ్చిన తుఫాను వల్ల రాయల చెరువులో నింగీ నేలా ఏకమయ్యేట్లు వానలు పడ్డాయి. ఊళ్లో పొలాలన్నీ చెరువులయ్యాయి.


లక్ష్మయ్య ఎంతో సంబరపడిపోయాడు. "వేరుశనగ విత్తుదామా? వరి వేద్దామా?" అని అతనికిప్పుడు రకరకాల ఆలోచనలు వచ్చాయి. అయితే మరొకవైపున ముసలాయన ముఖం గుర్తుకొస్తూ ఉండింది. చివరికి "ఏమైనా సరే!కొర్రలే విత్తుదాం. దేవుడు నాకోసం ఆ వాట్నే పంపించాడు" అని తన చేన్లో అంతటా కొర్రలు చల్లేసాడు, ఎవ్వరు ఏమన్నా వినకుండా. పొలాలున్న రైతులందరూ గబగబా వరి నారు కొనుక్కొచ్చి నాటారు. అయితే ప్రకృతి రైతును మళ్ళీ మోసమే చేసింది. ఆ సంవత్సరం ఇక వానలు పడలేదు. అదను తప్పిపోయాక వేరుశెనగ వేసిన రైతుతో బాటు, వరి నాటిన రైతులంతా భారీగా నష్టపోయారు. లక్ష్మయ్య పొలంలో మటుకు కొర్రలు విరగ కాసాయి.

 

"అయినా ఏం లాభం? కొర్రలు పశువుల మేతకు తప్ప ఇంకెందుకూ పనికి రావు" అన్నారు అప్పటికే నష్టపోయిన రైతులు. వాళ్ల అంచనాలను వమ్ము చేస్తూ లక్ష్మయ్య పండించిన కొర్రలు మొత్తం మంచి ధరకు అమ్ముడయ్యాయి. "తృణధాన్యాలు చక్కెర వ్యాధిని దరి చేరనివ్వవు" అని కొత్తగా కనుక్కున్న పట్టణాల వాళ్ళంతా వరసలు కట్టి మరీ కొనుక్కెళ్ళారు, లక్ష్మయ్య పంటని. ఆ ఒక్క సంవత్సరంలోనే వేరుశెనగకంటేను, వరికంటేనూ ఎక్కువ లాభాన్ని కళ్ళజూసాడు లక్ష్మయ్య, తనకు ఆ అదృష్టాన్నిచ్చిన ముసలాయనకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంటూ.


- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


అనగనగా ఒక ఊళ్లో ఇద్దరు దంపతులుండేవారు.
Aug 7, 2019
మతి మరుపు
Jul 31, 2019
ఆవులు కాసే రంగన్నకు ఉన్నట్టుండి ఓ సందేహం కలిగింది. "నేనేం చెయ్యాలి..
Jun 25, 2019
“అబ్బా!” తెల్లని డోరియా చీరపై గులాబీలు క్రాస్..
May 11, 2019
ఒక ఊరిలో రాజయ్య అని ఒక కట్టెలు కొట్టేవాడు వుండేటోడు...
Apr 27, 2019
గిరి వాళ్ళ నాన్న వీరయ్య కష్టజీవి. వాళ్ళు పడే కష్టం తెలుసు గనకనే..
Apr 26, 2019
అనగనగా ఒక ఊళ్లో ఒక అన్న, ఒక తమ్ముడు ఉండేవాళ్ళు.
Apr 25, 2019
ధర్మపురంలో చాలా పేద కుటుంబం ఒకటి ఉండేది.
Apr 24, 2019
రామయ్య ఒకరోజు రాత్రి భోజనం చేసాక తోటకి బయలుదేరాడు.
Apr 22, 2019
చైత్ర మాసానికి స్వాగతం పలుకుతోంది...
Apr 4, 2019
TeluguOne For Your Business
About TeluguOne