Home » మన రచయితలు » దిల్లీని గెలుచుకున్న తెలుగు కవి – జగన్నాథ పండితరాయలుFacebook Twitter Google
దిల్లీని గెలుచుకున్న తెలుగు కవి – జగన్నాథ పండితరాయలు

దిల్లీని గెలుచుకున్న తెలుగు కవి – జగన్నాథ పండితరాయలు

 

 

పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది. మన మధ్య తిరిగేవాడి ప్రతిభని ఎవరో గమనించి తలకెత్తుకున్నాక కానీ... అతని విలువని గ్రహించలేం. అలాంటి వ్యక్తులలో మొదటగా చెప్పుకోవాల్సినవాడు ‘జగన్నాథ పండితరాయలు’.

 

జగన్నాథుడు 17వ శతాబ్దానికి చెందిన ప్రముఖ సంస్కృత కవి. ఈయన తూర్పు గోదావరి జిల్లా ముంగొండ అగ్రహారంలో జన్మించారు. తండ్రి స్వతహాగా పండితుడు కావడంతో.... మొదట ఆయన దగ్గరే విద్యని అభ్యసించాడు. తర్వాత ఒకో గురువునీ ఎంచుకొంటూ న్యాయం, వైశేషికం వంటి షట్దర్శనాలన్నింటిలోనూ ఆరితేరిపోయారు. వేదవేదాంతాల మీదా పట్టు సాధించారు. కాశీకి వెళ్లి సకల శాస్త్రాలనీ ఔపోసన పట్టారు.

 

ఒక పక్క అపారమైన జ్ఞానం, మరో పక్క ఒక్కసారి వింటే దేన్నీ మర్చిపోలేని ఏకసంథాగ్రహత. అయినా కూడా జగన్నాథునికి తగిన గౌరవం కానీ భత్యం కానీ లభించలేదు. దాంతో ఆయన నేరుగా దిల్లీ సుల్తాను దగ్గరకే వెళ్లి తన పాండిత్యాన్ని నిరూపించుకోవాలని అనుకున్నాడు. అప్పట్లో కాశీకి వెళ్లడం అంటేనే కాటికి వెళ్లడంతో సమానం. ఇక దేశ రాజధానిలో పాగా వేయడం అంటే ఎంత దుస్సాహసమో!

 

దిల్లీకి చేరుకున్న జగన్నాథునికి, పాదుషా దర్శనం దక్కలేదు. ఆయన పిలుపు కోసం నిరీక్షస్తూ ఉండగా, ఓసారి తన ముందే ఇద్దరు హోరాహోరీగా వాదులాడుకోవడాన్ని గమనించాడు. వారు మాట్లాడుకున్న భాష ఏమిటో ఆయనకు తెలియదు. కానీ ఏకసంథాగ్రాహి కావడంతో వారి నోటి నుంచి వెలువడిన శబ్దాలను మాత్రం జ్ఞప్తికి ఉండిపోయాయి. తన దర్బారు బయట జరిగిన ఈ వాదులాట పాదుషాగా ఉన్న షాజహానుకి తెలసింది. వెంటనే ఆ గొడవపడినవారినీ, ఆ గొడవకి సాక్ష్యంగా ఉన్నవారినీ తన వద్దకు తీసుకురమ్మని ఆజ్ఞాపించారు.

 

షాజహాను ముందర తను విన్నదంగా పూసగుచ్చినట్లు అప్పచెప్పాడు జగన్నాథుడు. భాష తెలియకుండానే అంత స్పష్టంగా వాదనని విన్న జగన్నాథుని ప్రతిభకు పాదుషా ఆశ్చర్యపోయాడు. వెంటనే తన ఆస్థానంలోకి సాదరంగా ఆహ్వానించాడు. అనతికాలంలోనే జగన్నాథుని ప్రతిభకు పాదుషా ముగ్ధుడైపోయాడు. స్వతహాగా సున్నితమనస్కుడైన షాజహానుకీ, పండితుడైన జగన్నాథునికీ మంచి పొత్తు కుదిరింది. జగన్నాథుని పండిత్యానికి మెచ్చి పండితరాయులు అనే బిరుదుని అందించాడు షాజహాన్‌.

 

షాజహానుకి లవంగిక అనే కుమార్తె ఉండేదనీ, ఆమె జగన్నాథుని తన గురువుగా భావించేదనీ చెబుతారు. వీరిరువురి మధ్యా ఒక ప్రేమ కథ కూడా ప్రచారంలో ఉంది. ఆ కథ ప్రకారం... ‘నిన్ను గౌరవించుకునేందుకు ఎంత గొప్ప కానుకని ఇచ్చినా తక్కువే! అందుకని నువ్వే ఏదో ఒక బహుమతిని కోరుకో!’ అంటూ ఓసారి షాజహాన్‌, జగన్నాథునితో అన్నాడట. ‘ప్రభూ నాకు మీ కుమార్తె లవంగికని ఇచ్చి వివాహం చేయండి’ అంటూ జగన్నాథుడు కోరాడట.

 

జగన్నాథుని మాటలకు షాజహాన్‌కు కోపం వచ్చింది. కానీ చాలాకాలం ఆలోచించిన తర్వాత అతని కోరికని మన్నించడం సబబే అని తోచింది. వెంటనే తన కుమార్తెతో జగన్నాథునికి వివాహం జరిపించాడు. వివాహం జరిగిందన్నమాటే కానీ అటు ముస్లింల దగ్గర నుంచీ, ఇటు హిందువుల దగ్గర నుంచీ జగన్నాథుడు తీవ్రమైన అవమానాలను ఎదుర్కోవలసి వచ్చిందట.

 

దాంతో మనస్తాపం చెందిన ఆయన గంగలో లీనమైపోవాలని నిశ్చయించుకున్నాడు. అనుకున్నదే తడవుగా తన భార్యతో కలిసి కాశీకి చేరుకున్నాడు. అక్కడ గంగానది గట్టు మీద కూర్చుని ‘గంగాలహరి’ అనే కావ్యాన్ని ఆశువుగా చెప్పసాగాడు. అందులో ఒకో శ్లోకాన్ని చెబుతుండగా గంగ నీరు ఒకో మెట్టు దాటి పైకి రాసాగిందట. అలా 53 శ్లోకాలు చెప్పేసరికి గంగానది మట్టం పైకి చేరి, జగన్నాథుని తనలో ఐక్యం చేసుకుందట.

 

చాలామంది చరిత్రకారులు జగన్నాథుని ప్రేమకథను కొట్టిపారేస్తారు. అయితే షాజహాన్‌ ఆస్థానంలో జగన్నాథుడనే గొప్ప పండితుడు ఉన్నాడనీ, ఆయన తెలుగువాడనీ చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహమూ లేదు. జగన్నాథుడు గంగాలహరితో యమున (అమృత లహరి), సూర్యుడు (సుధాలహరి), కృష్ణుడు (కరుణా లహరి), లక్ష్మీదేవి (లక్ష్మీ లహరి) మీద కూడా కావ్యాలను రాశారు.

 

వీటితో పాటు భామినీ విలాసం, రసగంగాధరం లాంటి అద్భుతమైన రచనలెన్నో చేశారు. ఇక విమర్శన గ్రంథాలు, భాష్యాల సంగతి సరేసరి. ఆయన రాసిన రచనలు ఇప్పటికీ సంస్కృతంలోని అత్యుత్తమ కావ్యాల జాబితాలో నిలుస్తూ ఉంటాయి. విదేశీయులు చేత ఆంగ్లంలోకి అనువదించబడ్డాయి. ఇప్పుడు తెలుగువారంతా జగన్నాథ పండితరాయలు మన తెలుగువాడేనట! అని చెప్పుకొంటున్నారు.

- నిర్జర.

 

భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు.
Sep 14, 2017
తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు.
Sep 12, 2017
ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా
Sep 5, 2017
తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి.
Aug 26, 2017
తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Aug 22, 2017
పరవస్తు చిన్నయసూరి. ఈ పేరు వినగానే బాలవ్యాకరణం పుస్తకమే గుర్తుకువస్తుంది.
Aug 16, 2017
ఒక వంద సంవత్సరాల క్రితం ప్రచురించిన పుస్తకం ఏదన్నా తీసుకోండి....
Jul 29, 2017
హరికథకు గురువు - నారాయణదాసు
Jul 8, 2017
సాటిలేని రచయిత – ఆరుద్ర!
Jul 1, 2017
సాహిత్యం గురించి ఎంతో కొంత తెలిసిన వారికి ‘అగాథా క్రిస్టీ’ పేరు పరిచయమే! నరాలు తెగిపోయే
Jun 29, 2017
TeluguOne For Your Business
About TeluguOne