Facebook Twitter
త్రాగుబోతు

 

త్రాగుబోతు

 

 

అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే చిన్న రైతు ఒకడు ఉండేవాడు. రామయ్య భార్య సీతమ్మ. వాళ్ళకు ఒక కొడుకు.

వాళ్ల సంసారం అలా చల్లగా సాగుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆ పిల్లవాడు అనారోగ్యానికి గురి అయ్యాడు, 'డాక్టర్ దగ్గరకు వెళ్దాం' అని సలహా ఇచ్చింది సీతమ్మ. కానీ రామయ్య మాత్రం తనకు తెలిసిన నాటు వైద్యం చేసి చూశాడు. పిల్లవాడి సమస్య తగ్గలేదు సరికదా, మరింత తీవ్రమైంది.

ఇక విధిలేని పరిస్థితులో ఇద్దరూ ఆ పిల్లవాడిని తీసుకొని బస్టాండ్ కు పోయారు, కానీ ఎంత వేచి చూసినా ఒక్క బస్సూ రాలేదు. "ఆ రోజు ఇక బస్సులు రావు, బంద్" అనిచెప్పారు అందరూ. ఆ మాటలకు దంపతులిద్దరికీ ఏడుపు వచ్చేసింది. సరైన వైద్యం దొరక్క వాళ్ల కొడుకు చనిపోయాడు!

తల్లి తండ్రులు ఆ పిల్లవాడిని మరచిపోవడమే లేదు. అన్నం‌ తిన్నప్పుడల్లా కొడుకు గుర్తుకు వస్తున్నాడు- అలా రోజులు గడిచాయి. ఒక రోజున రామయ్య పొలానికి వెళ్ళి, మంచం వేసుకొని నిదుర పోదామని అనుకున్నాడు. కానీ కళ్ళు మూసుకుంటానే కొడుకు గుర్తుకు వచ్చాడు.

 

అప్పుడు 'కాటమయ్య' అనే పనికిమాలిన వెధవ ఒకడు అతని దగ్గరకు వచ్చి"రామయ్యా! చనిపోయిన వాడు తిరిగి వెనక్కి రాడు. కానీ నువ్వు- ఇదిగో, ఈ బ్రాందీ త్రాగు- నీ పిల్లవాడు అసలు గుర్తుకే రాడు !" అని చెప్పాడు.

రామయ్య ముందు వద్దన్నాడు. కానీ వాడు 'ఇదిగో, ఈ కొద్దిగా త్రాగు- చాలు" అని బలవంతంగా కొంచెం త్రాగించాడు. పైగా ఒక కోటర్ చిన్న సీసాడు సారాయి అక్కడ పెట్టి మరీ పోయాడు. సారాయి తాగే సరికి రామయ్యకు ఆలోచన మందగించి, బాగా నిద్రపట్టింది- ఇక ఆ తర్వాత అతనికి కూడా ఆ త్రాగుడు రోగం అంటుకున్నది.

ఇప్పుడు రామయ్య ప్రతి రోజూ విపరీతంగా త్రాగుతున్నాడు. ఎప్పుడూ మత్తులోనే ఉంటున్నాడు. త్రాగకుండా ఉండలేని పరిస్థితి! తన త్రాగుడుకు ఉన్న ఆస్తి అంతా ఖాళీ చేశాడు. సీతమ్మ మనసు చంపుకొని బ్రతికేందుకు ప్రయత్నించింది, కానీ ఎన్నాళ్లు? చివరికి ఆమె బలహీనురాలై, చనిపోయింది.

అయినా రామయ్యకి బుద్ధి రాలేదు. భార్య-పిల్లలు గుర్తు రాకూడదని అతను ఇంకా చాలా సారాయి తాగాడు- ఊళ్లు పట్టుకొని తిరిగాడు. ఒక రోజున రామయ్య అటూ, ఇటూ ఊగుకుంటూ పోయి ఒక గుంతలో పడిపోయాడు. అక్కడే కట్టెలు కొడుతున్న ఒక మంచి మనిషి చూసాడు అతన్ని. వెంటనే ఆస్పత్రిలో చేర్పించాడు.

 

 

అక్కడ రామయ్యను పరీక్ష చేసి, "కాలేయం అంతా పాడైపోయింది “అని చెప్పారు డాక్టర్లు . "ఇంక మేము ఏమీ చెయ్యలేం" అన్నారు వాళ్లు.

భార్య-కొడుకు గుర్తుకొచ్చిన రామయ్య నిరాశచెందాడు: "నన్ను చనిపోనివ్వండి" అని ప్రాణభీతితో ఏడవటం మొదలుపెట్టాడు.

అతనిని కాపాడిన మంచి మనిషి అతనికి ధైర్యం చెప్పి, తనకు తెలిసిన ఆయుర్వేద డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాడు అతన్ని, ఆ డాక్టర్ గారు రామయ్యకు రకరకాల మూలికలతో వైద్యం చేశారు; ధ్యానం కూడా నేర్పారు. వాటన్నిటి మూలంగా‌ రామయ్య ఆరోగ్యం క్రమంగా మెరుగైంది.

 

 

అప్పటి నుంచి రామయ్య మత్తుపానీయాలు త్రాగడం మానేశాడు. తను త్రాగకపోవటమే కాదు; ఇతరులకు కూడా "త్రాగద్దు బాబులూ!" అని చెప్పటం మొదలెట్టాడు !

 

Courtesy..
kottapalli.in