Home » పిల్లల కోసం » లచ్చయ్య మంచితనంFacebook Twitter Google
లచ్చయ్య మంచితనం

 

లచ్చయ్య మంచితనం

 

లింగేశ్వరంలో ఉండే కోటేశ్వరావు గొప్ప ధనవంతుడు, పరమ పిసినారి. 'అతనికి ఉన్నంత డబ్బు పిచ్చి వేరే ఎవ్వరికీ ఉండదు' అని చెప్పుకునేవాళ్ళు.

ఎంగిలి చేత్తో విదిలిస్తే కాకులకు మెతుకులు దొరుకుతాయని, అతను అన్నం తినేప్పుడు ఎప్పుడూ చేతుల్ని తనకు దగ్గరగానే పెట్టుకునేవాడు.

 

కంచం అంచు వెంబడి మెతుకులు క్రింద పడకుండా ఉండాలని, తను ఎప్పుడు అన్నం తిన్నా, కంచం మధ్యలోనే కలుపుకొని తినటం అలవరచుకున్నాడు.

ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే వాళ్ళు అడగకుండానే గ్లాసులకు గ్లాసులు నీళ్ళు ఇచ్చి, వాళ్లను వీలైనంత త్వరగా తిప్పి పంపించేవాడు: "వామ్మో! అతను బిచ్చగాడి నుండే బిచ్చం ఎత్తుకుంటాడు" అని బంధువులు ఎవ్వరూ అతని ఇంటికి వచ్చేవాళ్ళు కాదు.

అదే ఊళ్ళో మంచి, మర్యాద, మానవత్వం కలిగిన పేద రైతు ఒకడు ఉండే వాడు. అతని పేరు లచ్చయ్య. ఉన్నంతలో తృప్తిగా జీవించేవాడు లచ్చయ్య. ఇంటికి వచ్చిన అతిథులకు దేన్నైనా ప్రేమానురాగాలతో పంచేవాడు. తను ఒక పూట అన్నం తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు. "నాకు వేరే ఏమీ ఇవ్వకపోయినా పర్లేదు కానీ, ఇంటికి వచ్చిన వాళ్ళకి కడుపునిండా అన్నం పెట్టి, సంతోషంగా సాగనంపే శక్తిని మటుకు ఉండనివ్వు స్వామీ" అని రోజూ దేవుడిని ప్రార్థించేవాడు.

 

రాను రాను ఆ చుట్టు ప్రక్కల ప్రాంతాల వాళ్ళంతా లచ్చయ్య గురించి గొప్పగా చెప్పుకోవటం మొదలెట్టారు. దానితోబాటే కోటేశ్వరరావు పిసినారితనం కూడా ప్రచారమైంది. దాంతో కోటేశ్వరరావుకి లచ్చయ్య మీద కోపం పెరిగిపోయింది!

చివరికి అతనిక తట్టుకోలేక, దూరం నుండి పిలిపించిన రౌడీలను కొందరిని లచ్చయ్య ఇంట్లో దొంగతనానికి పంపించాడు.
ఆరోజు రాత్రి వాళ్ళు భోజనం కోసం వెతుక్కుంటుంటే ఎవరో చెప్పారు- "ఈ టైములో‌ భోజనం ఎక్కడ దొరుకుతుంది? ప్రక్కనే లచ్చయ్య ఇంటికి పోండి, కనీసం ఏ ఊరగాయో వేసి ఇంత అన్నం పెడతాడు" అని.

అట్లా ఆ దొంగలు లచ్చయ్య ఇంట్లోనే భోజనాలు చేసారు. మరి ఆ సమయంలో వాళ్ళు ఏమనుకున్నారో ఏమో: ఆ రోజు రాత్రి కోటేశ్వర రావు ఇంట్లోనే దోపిడీ జరిగింది! దొంగలు అతని దగ్గరున్న డబ్బునీ, నగల్నీ, విలువైన సామాన్లనీ‌ మొత్తం దోచుకుపోయారు!

దు:ఖంలో‌ ఉన్న కోటేశ్వరరావు కుటుంబానికి కూడా లచ్చయ్యే ఆసరాగా నిలిచాడు. వాళ్ళు తినేందుకు రోజూ భోజనం వండి పంపించాడు!

అంతలో‌ వాళ్ళ పొరుగూరు లింగగిరిలో చెరువు కట్ట తెగింది- నీళ్ళన్నీ ఊళ్లోకి వచ్చాయి; పలు కుటుంబాలకు చెందిన ఇళ్ళు కూలిపోయాయి. లచ్చయ్య ముందుపడి, పునరావాసపు పనులు మొదలుపెట్టాడు. దానికోసం తనకున్న కొద్దిపాటి భూమినీ అమ్మేసేందుకు సిద్ధపడ్డాడతను! అయితే ఊళ్ళో వాళ్లంతా ముందుకొచ్చి, చందాలు వేసుకొని ఆ పనిని తమ వంతుగా నెరవేర్చారు.

అంతలోనే మరో అద్భుతం జరిగింది. లచ్చయ్య కృషిని మెచ్చుకుంటూ ఎవరో కోటీశ్వరుడు ముందుకొచ్చి, పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చాడు. ఆ సంగతి చెప్పి, లచ్చయ్య ఊళ్ళోవాళ్ళిచ్చిన చందాల డబ్బును ఎవరిది వాళ్ళకు వాపసు చేసాడు!

దీన్నంతా దగ్గరనుండి గమనించిన కోటేశ్వరరావులో పరివర్తన కలిగింది- "ఇకమీద నేను లచ్చయ్యను వేరుగా చూడను- నా కుటుంబ సభ్యులలో ఒకడుగా ఆదరిస్తాను. అతను చేసే మంచిపనుల్లో నేను కూడా పాలు పంచుకుంటాను" అనుకున్నాడు. అతనిలో‌ మార్పును గమనించిన కుటుంబ సభ్యులూ, ఊళ్ళోవాళ్ళు కూడా చాలా సంతోషించారు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


"అయ్యో, ఉడతా, నీ అమాయకత్వానికి నవ్వుతున్నాను! నీ చారలు చూసుకొనే నువ్వు..
Apr 23, 2019
పాముకి గుణపాఠం చెప్పిన కోడిపెట్ట
Apr 8, 2019
పిల్లలకు ఆకలి ఎక్కువ. టామీ కుక్కపిల్ల చిన్నగా ఉన్నప్పుడు దానికి కూడా చాలా ఆకలి ఉండేది.
Mar 1, 2019
రాజీవ్‌ అనే కుర్రవాడు చక్కగా చదివి, చదువు పూర్తయ్యాక ఉద్యోగం కోసం వెతుక్కుంటూ పట్టణం చేరాడు..
Feb 23, 2019
పట్టువదలని విక్రం తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి, బేతాళాన్ని భుజంపైన వేసుకొని...
Feb 18, 2019
రామాపురం జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలో శ్రీధర్‌, మురళి అనే అన్నదమ్ములు ఇద్దరు చదివేవాళ్ళు..
Feb 16, 2019
నాగసముద్రంలో రామయ్య, రాధమ్మ అనే దంపతులు ఉండేవాళ్ళు...
Feb 6, 2019
శుభాకాంక్షలు... శుభాకాంక్షలు... గణతంత్రదినోత్సవ శుభాకాంక్షలు భారతీయులందరికీ..
Jan 25, 2019
ఒకరోజున, నీళ్ళు తాగుదామని నది దగ్గరికి పోయింది, లేడికూన...
Jan 23, 2019
అనగా అనగా దేవి అనే చేపపిల్ల ఒకటి ఉండేది. అది చాలా తెలివైనది.
Dec 22, 2018
TeluguOne For Your Business
About TeluguOne