Facebook Twitter
గౌరీ పూజ

గౌరీ పూజ!

 

 

ద‌స‌రా వ‌చ్చేసింది. ఎటుచూసినా అమ్మ‌వారి కొలుపులే క‌నిపిస్తున్నాయి. ఇల్ల‌యినా, ఆల‌య‌మైనా... అమ్మ‌వారి ఆరాధ‌న క‌నిపిస్తుంది. ఆ సంద‌ర్భంగా గౌరీదేవిని పూజించేందుకు జాన‌ప‌దులు పాడుకునే పాట ఒక‌టి ఇది. అమ్మ‌వారి అలంకర‌ణ‌లు, అవ‌తారాలు ఉట్టంకిస్తూ ఈ పాట సాగించ‌డం విశేషం.

శ్రీ గౌరి నీపూజ చేయబూనితినమ్మ!
కాపాడి మమ్మేలు కాశీపుర రాణీ
శాంకరీ పార్వతీ శంభునీ రాణీ
తల్లి నిన్నెపుడు ధ్యానింతునమ్మ
కలహంస నడకల కదలిరావమ్మ
సింహ పీఠంబున చెలియరో కూర్చుండ
బంగారు చెంబుతో గంగ నీళ్ళుదెచ్చి
కాంత నీ పాదాల కడిగి తడియొత్తెద
అంబికా నీకిదే అర్ఘ్యంబు నిత్తును
ఆకాశ గంగతో అర్పింతు తల్లి
పంచామృతంబిదే పణతిరో నీకిత్తు
జలజాక్షి పన్నీట జలక మాడింతు
జల్తారు చీరెను శాంభవీ గైకొమ్ము
అద్దాల రవికెను అంబ నీకిచ్చెద
రతనాల సొమ్ములా రంజిల్లు గౌరీ
అందమౌ నీమేను చందనము బూసి
అక్షంత లుంచితీ అంబ నీ పాదాల
పునుగు జవ్వాదితో పూజింతునమ్మ
పసుపు కుంకుమబెట్టి పణతి నిన్‌ పూజింతు
పూలు పత్రిబెట్టి పూజింతు గౌరమ్మ
పారిజాతంబుల పార్వతీ నీకిత్తు
మారేడు దళముల మాతరో నిన్‌ గొల్తు
తమ్మిపూవులతోడ అమ్మ నిన్‌ పూజింతు
కలువపూవుల నిన్ను కలికిరో పూజింతు
సంపెంగ పూవుల ఇంపుగా పూజింతు
బంతి పూవుల దెచ్చి ఇంతి నీ కర్పింతు
సన్న జాజులు నీకు మిన్నుగా నిత్తు
మంకెన పూవుల శాంకరీ నీకిత్తు
గొనుగుపూవుల దెచ్చి కోమలీ నీకిత్తు
తంగేడు పూవులా తల్లి నిన్‌ పూజింతు
మల్లెపూవులు దెచ్చి మాతల్లి బూజింతు
మొల పువ్వులనిన్ను పూజింతు నమ్మరో
నీలకంఠుని రాణి నీ కంఠమందున
ప్రేమ పూవులమాల వేసి పూజించెద
సాంబ్రాణి ధూపంబు శాంకరీ నీకిత్తు
దేవి నీ సన్నిధి దీపంబు వెలిగింతు
సారపల్కుల పప్పు నారికేళములును
నాతిరో నీకిదే నైవేద్య మిచ్చెద
పార్వతీ నీకిదే పానీయమిచ్చెద
శంభు రాణీ నీకు తాంబూల మిచ్చెద
దాక్షాయణీ నీకు దక్షణల నిచ్చెద
మానినీ గైకొమ్మ తిరిగివచ్చీ నీకు
సాగిల మ్రొక్కితిని సావిత్రి దేవీ
అంగనామణి నీకు మంగళా హారతి
భువనేశ్వరీ నిన్ను పూజింతునమ్మ
మమ్ము గాపాడుమా మాతల్లి గౌరమ్మ
తప్పులన్నీ గాచి తల్లిరో మమ్మేలు
జయ జయము గౌరమ్మ జయమహో తల్లి.