Home » ఈపేజీ మీకోసం » స్నేహితులని గెలుచుకునే పుస్తకం - How to Win FriendsFacebook Twitter Google
స్నేహితులని గెలుచుకునే పుస్తకం - How to Win Friends

స్నేహితులని గెలుచుకునే పుస్తకం - How to Win Friends

 

వ్యక్తిత్వ వికాస పుస్తకాలు (self sevelopment books) మనకి కొత్తేమీ కాదు. తెలుగు సహా ఏ భాషలో చూసినా, ఇలాంటి పుస్తకాలు కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. తలపండిపోయిన ఫిక్షన్ రచయితలు కూడా కుర్రకారుని ఆకట్టుకునేందుకు వ్యక్తిత్వ వికాస రంగం వైపు అడుగులు వేస్తున్నారు. కానీ ఈ రంగంలో ఎన్ని పుస్తకాలు వచ్చినా.... ఓ ఎనభై ఏళ్ల క్రితం వచ్చిన పుస్తకం ఇప్పటికీ ఓ సంచలనంగానే నిలుస్తోంది. అదే How to Win Friends and Influence People.

ఈ పుస్తకాన్ని రాసిన వ్యక్తి పేరు డేల్ కార్నెగి. నిజానికి ఆయన తాను ఒక పుస్తకం రాయాలనీ, అది ఒక సంచలనంగా మారిపోవాలనీ కోరుకోలేదు. డేల్ కార్నెగి అమెరికాలోని ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చాడు. జీవితంలో నిలదొక్కుకోవడానికి సేల్స్మెన్ అవతారం ఎత్తాడు. ఆ ఉద్యోగం అతనికి కావల్సినంత డబ్బుని సంపాదించి పెట్టింది. ఆ డబ్బుతో పాటుగా బోలెడు లోకానుభవాన్నీ ఇచ్చింది. దాంతో డేల్ తనకి ఉన్న అనుభవాన్ని నలుగురికీ పంచే ప్రయత్నం చేశాడు. స్వామికార్యమూ, స్వకార్యమూ పూర్తయ్యేలా.... కుర్రకారుకి మార్కెటింగ్లో పాఠాలు నేర్పించడం మొదలుపెట్టాడు.

డేల్ ఇచ్చే లెక్చర్లకి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఎక్కడెక్కడి నుంచో జనం అతని దగ్గర శిక్షణ తీసుకునేందుకు రాసాగారు. కానీ డేల్ మనసులో ఒకటే అసంతృప్తి. తను రిఫరెన్స్ కోసం చూసుకోవడానికైనా, మార్కెటింగ్ రంగంలో ఉండేవారికి మార్గదర్శిగా నిలిచేందుకైనా.... అప్పటివరకూ మార్కెటింగ్కి సంబంధించి ఎలాంటి పుస్తకమూ అందుబాటులో లేదు. పోనీ తనే ఒక పుస్తకం రాద్దామా అంటే, ఏమాత్రం తీరిక లేదయ్యే! పైగా రచనారంగంలో తనకి అనుభవమూ లేదు. అదే సమయంలో డేల్ ఉపన్యాసాలు విన్న ఒక ప్రచురణకర్త అతని దగ్గరకు వచ్చాడు. `నేను మీకోసం స్టెనోగ్రాఫర్ని ఏర్పాటు చేస్తాను. మీరు ఉపన్యసించే సమయంలో సదరు వ్యక్తి, మీ మాటలని యథాతథంగా పుస్తకంలోకి ఎక్కిస్తుది. దానికే కావల్సిన మార్పులు చేసి ఒక పుస్తకంగా అచ్చువేద్దాం,` అని ప్రతిపాదించాడు. డేల్కి ఆ ఆలోచన నచ్చడంతో అతని ఉపన్యాసాలు ఒక పుస్తకంగా రూపొందాయి.

ఆ పుస్తకానికి తగిన మార్పులు చేసి 1936లో How to Win Friends and Influence People అన్న పుస్తకంగా తీసుకువచ్చారు. పుస్తకం మార్కెట్లోకి వచ్చిన మొదటి మూడు నెలలలోనే రెండున్నర లక్షల ప్రతులు అమ్ముడుపోయాయి. మొదటి ఏడాదే 17 సార్లు పుస్తకాన్ని ముద్రించాల్సి వచ్చింది. ఇప్పటికీ ఈ పుస్తకం వ్యక్తిత్వ వికాస రంగంలోని అత్యుత్తమ పుస్తకాల జాబితాలో ముందు ఉంటుంది. ఇప్పటిదాకా దాదాపు మూడు కోట్ల ప్రతులు అమ్ముడుపోయింది.

 

 

నిజానికి ఈ పుస్తకం మార్కెటింగ్ రంగంలో ఉండేవారి కోసం రాయబడింది. కానీ ఇందులోని సూత్రాలు ప్రతి ఒక్కరూ ఆచరించదగ్గవి కావడంతో, అందరికీ ఉపయోగంగా నిలిచింది. మనిషి మనసు గెల్చుకోవడం అనేది కేవలం మార్కెటింగ్కు మాత్రమే పరిమితం కాదు కదా! అవతలివారి మనసుని నొప్పించకుండా, వారికి తగిన ప్రాముఖ్యతని ఇస్తూ, వారి ఇష్టాయిష్టాలని తెలుసుకుంటూ... బంధాన్ని నిలుపుకోవడం ఎలాగో ఈ పుస్తకంలో కనిపిస్తుంది. ఎదుటి వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లోనూ విమర్శించవద్దు, వారిని మనస్ఫూర్తిగా అభినందించండి, ఎదుటి మనిషి చెప్పేది శ్రద్ధగ ఆలకించండి, సంభాషణని స్నేహపూర్వకంగా మొదలుపెట్టండి... లాంటి విలువైన సూచనలతో ఈ పుస్తకం నిండిపోతుంది. ఆ సూచనలు నిజంగా ఉపయోగపడతాయి అనేందుకు రుజువుగా అనేక కథలు, అనుభవాలను జోడిస్తూ పాఠకులలో తగిన నమ్మకాన్ని కలిగించే ప్రయత్నం చేస్తారు రచయిత.

డేల్ కార్నెగి రాసిన పుస్తకంలో చాలా విశేషాలే ఉన్నాయి. దీన్ని చదివేటప్పుడు పాఠకుడు ఎలాంటి బోర్ ఫీలవడు, ఎవరో తనకి క్లాస్ పీకుతున్నట్లుగా తోచదు, ఇందులోని సూచనలు పాటించడానికి చాలా సులువుగా తోస్తాయి, మధ్యమధ్యలో వచ్చే కథలు చదివిన విషయాన్ని మర్చిపోకుండా తోడ్పడతాయి. అందుకే ఇన్ని సంవత్సరాలు గడిచినా కూడా ఈ పుస్తకం ఒక మాస్టర్పీస్గా నిలిచిపోయింది. పుస్తకం ఎలా రాయాలి అన్న విషయం మీద రచయితలకు, పుస్తకం ఎలా ఉండాలి అన్న విషయం మీద పాఠకులకు ఒక ఉదాహరణగా మిగిలింది. కావాలంటే మీరూ ఒకసారి చదివి చూడండి. ఇప్పటికే చదివేస్తే మరోసారి సరికొత్తగా చదివే ప్రయత్నం చేయండి. ఈ పుస్తకం తాలూకు పీడీఎఫ్ నెట్లో ఉచితంగానే దొరుకుతుంది.

- నిర్జర.

 

 


తన శివతాండవ కావ్యాన్ని సంగీత సాహిత్య నాట్య త్రివేణీసంగమంగా మలచేందుకు మా అయ్యగారికి స్ఫూర్తినిచ్చినది చిదంబరంలోని
Feb 12, 2018
01 - తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం వంటి భాషలని ద్రవిడ భాషలంటారు కదా!
Dec 16, 2017
తేనెటీగా! తేనెటీగా!  తేనె ఇస్తావా? 
Dec 2, 2017
దివిటీల పండుగ టపాసుల పండుగ లక్ష్మిపూజ పండుగ దీపావళి పండుగ
Oct 14, 2017
అతడు-ఆమె-ఆకాశం
Oct 10, 2017
తెలుగునాట లాలిపాటలకు కొదవేమీ
Sep 29, 2017
సర్వాయి పాపన్న కథ వింటారా
Sep 28, 2017
తెలుగునాట అమ్మవారి దసరా ఎంత వేడుకగా
Sep 27, 2017
ద‌స‌రా వ‌చ్చేసింది. ఎటుచూసినా అమ్మ‌వారి కొలుపులే క‌నిపిస్తున్నాయి.
Sep 25, 2017
ఇప్పుడంటే గురువులకి తగినంత జీతం దక్కుతోంది.
Sep 22, 2017
TeluguOne For Your Business
About TeluguOne