Facebook Twitter
చిన్నమ్మ - పెద్దమ్మ

చిన్నమ్మ - పెద్దమ్మ

 


శ్రీపతికి భక్తి ఎక్కువ ఆశకూడా ఎక్కువే. ఏదో ఒక రోజు తన అదృష్టం తన్నుకొని వస్తుందని ఎదురు చూస్తూ ఉండేవాడతను. ఇంట్లో చాలా మంది దేవతల ఫోటోలు ఉండేవి, రోజూ వాటిలో తనకు గుర్తొచ్చిన వాళ్లకల్లా పూజలు చేసి హారతులిస్తూ ఉండేవాడు శ్రీపతి. అలా పూజ చేసినప్పుడల్లా ఆ దేవుళ్లకు తప్పకుండా చెప్పేవాడు: "స్వామీ! తల్లీ! మాతా! మా యింటికి రండి! ఒక్కళ్ళే రాకండి- సపరివారసమేతంగా విచ్చేయండి. ఇక్కడే ఉండిపోండి! ఇది మీ ఇల్లే అనుకోండి! నన్ను కటాక్షించండి,... " ఇలా సాగేది అతని స్తోత్రం. ఆ రోజు శ్రీపతి ఒక్కడే ఉన్నాడు ఇంట్లో. బయట వాన కురుస్తున్నది. చలి కూడా చాలా ఎక్కువే ఉన్నది. శ్రీపతి పడక్కుర్చీలో కూర్చొని కునికి పాట్లు పడుతున్నాడు. ఆ సమయంలో ఎవరో తలుపు తట్టినట్లు అయ్యింది.

 

 

శ్రీపతి వెళ్లి తలుపుతీశాడు. ఎవరో చాలా చక్కని యువతి నిలబడి ఉన్నది బయట! బంగారం రంగులో ధగధగా మెరిసిపోతున్నది. ఎన్నడూ కనీ-వినీ ఎరుగని నగలు ధరించి ఉన్నది. "ఎవరమ్మా నువ్వు?" అడిగాడు శ్రీపతి. "రోజూ పూజ చేస్తున్నావు కదా, గుర్తు పట్టలేదా?" అన్నదామె. శ్రీపతి నిర్ఘాంత పోయాడు. "నేను, లక్ష్మీదేవిని!” అన్నదామె, తనని తాను పరిచయం చేసుకుంటున్నట్లు. "సంపదల తల్లీ! రా! నా యింట్లోనే ఉండిపో" అని అంతగా‌ ప్రార్థించావుగా? అందుకనే వొచ్చా" అన్నది చిరునవ్వుతో. "అయ్యో ! తల్లీ! రామ్మా! రా! ఇన్నాళ్లకు కరుణించావా?! రా, తల్లీ! కూర్చో! ఒక్కతెవే వచ్చావా?" అని హడావిడి పడ్డాడు శ్రీపతి.

సంపదల తల్లి మాట్లాడకుండా లోపలికొచ్చి అటూ ఇటూ చూడటం మొదలు పెట్టింది. శ్రీపతి ఆ తల్లికి మంచినీళ్ళు తెచ్చి ఇచ్చి "తర్వాత పాలు ఇవ్వాలా, టీ ఇవ్వాలా?” అని కంగారు పడటం మొదలు పెట్టాడు. కొంచెం సేపటికి మళ్లీ ఎవరో తలుపు తట్టినట్లు అయ్యింది- "ఈ సారి ఎవరొచ్చారో!" అని సంబరంగా వెళ్లి తలుపు తీశాడు శ్రీపతి. ఎవరో బిచ్చగత్తె- మాసిపోయి, చిరుగులు పడ్డ చీరతో , రేగిపోయిన జుట్టుతో, ముడతలు పడిన చర్మంతో - చాలా వికారంగా ఉంది. "నీ ఇంట్లోనే ఉండిపోదామని వొచ్చాం. రానియ్యి లోపలికి!" అంటోంది. "ఆగాగు - ఎవర్నువ్వు? నిన్ను నేనెందుకు పిలిచాను?! ఎవర్ని చూసి ఎవరనుకుంటున్నావో!" అడ్డుకున్నాడు శ్రీపతి. 

 

"మా చెల్లి వచ్చిందిగా ఇక్కడికి?! నువ్వు సకుటుంబంగా రమ్మన్నావని చెబితే ఇద్దరం బయలు దేరి వచ్చాం. నేను దరిద్ర దేవతను, రానియ్యి నన్ను, లోపలికి !" అన్నదామె. శ్రీపతిని ప్రక్కకు నెడుతూ. "ఆగు! తల్లీ! ఆగు! నేను లక్ష్మిని ఒక్కదాన్నే రమ్మన్నాను, ఆమె కావాలంటే విష్ణువును వెంటబెట్టుకొని రావచ్చు! నువ్వు మాత్రం నా యింట కాలు పెట్టేందుకు వీల్లేదు తల్లీ, పోమ్మా పో!" అని ఆమెను అటునుండి అటే సాగనంపాడు శ్రీపతి. ఆవిడ అటుపోగానే ఇటు లక్ష్మీదేవి కూడా బయలు దేరింది- "మా అక్కా-నేనూ ఎప్పటికీ కలిసే ఉంటామని ఒట్టు పెట్టుకున్నాం. అయినా నువ్వేంటి, అందరినీ తీసుకు రమ్మని, తీరా తీసుకొచ్చాక ఇలా అవమానిస్తున్నావు?" అని మాయం అయిపోయింది కోపంగా.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో