Home » మన రచయితలు » మనసుని నవలగా మార్చినవాడు - బుచ్చిబాబుFacebook Twitter Google
మనసుని నవలగా మార్చినవాడు - బుచ్చిబాబు

 

మనసుని నవలగా మార్చినవాడు - బుచ్చిబాబు

 

 

తెలుగు కాల్పనిక సాహిత్యంలో తాత్వికతని స్పృశించే రచనలు కానీ, మనిషి లోతుల్లోకి తొంగిచూసే ప్రయత్నాలు కానీ జరగలేదని ఓ విమర్శ ఉంది. అదృష్టవశాత్తూ ఆ వివర్శని దీటుగా ఎదుర్కొనేందుకు మనకి చివరకు మిగిలేది, అసమర్థుని జీవిత యాత్ర లాంటి రచనలు ఉన్నాయి. దురదృష్టవశాత్తూ, స్వీయవిమర్శకు సాధనగా ఉపయోగపడే ఇటువంటి రచనలు తర్వాత కాలంలో అరుదైపోయాయి. పాఠకుల హృదయాలని కాకుండా వారి నరాలను స్పందింపచేసే రచనలు ముంచెత్తాయి. ఇప్పటికీ తెలుగు సాహిత్యం గురించి చెప్పుకొనేటప్పుడు ఎన్నో రచనలను చెరగి ‘చివరకు మిగిలేది’ లాంటి పేర్లను తల్చుకుంటున్నామంటే.. ఆయా రచయితల్లో ఉన్న నిబద్ధతే కారణం. అలాంటి రచనలు చేసిన బుచ్చిబాబుని ఈసారి స్మరించుకుందాం.

1916 జూన్ 14న ఏలూరులోని ఒక సంప్రదాయ కుటుంబంలో బుచ్చిబాబు జన్మించారు. సంప్రదాయబద్ధమైన కుటుంబ నేపథ్యం ఉన్నప్పటికీ, స్వాతంత్ర్య సంగ్రామంతో పాటుగా రగులుకుంటున్న ఆదర్శాలని వంట పట్టించుకున్నారు. అలాంటి ఆలోచనా దృక్పథం ఉన్నప్పుడు సాహిత్యం పట్ల అభిరుచి ఏర్పడటం కూడా సహజమే కదా! అందుకే ఒకవైపు సాహిత్యమే ప్రధానాంశమైన చదువులు చదువుకుంటూనే, మరోవైపు స్వయంగా రచనలు చేయసాగారు. అలా బుచ్చిబాబు తాను బీ.ఏ చదివే రోజుల్లోనే ‘పశ్చాత్తాపం లేదు’ అనే కథని రాశారు. ఆ తర్వాత నాగపూర్ విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ పట్టాని సాధించి ఉపాధ్యాయ వృత్థిలో స్థిరపడ్డారు. ఆ తర్వాత ఆలిండియా రేడియోలో పనిచేశారు.

 

 

బుచ్చిబాబు వ్యక్తిగత జీవితం గురించి అలా ఉంచితే... తన సాహితీ జీవితంలో 80కి పైగా కథలు రాశారు. వాటిలో చాలా కథలు పాఠకుల మన్ననలు పొందినవే! అరకులోయలో కూలిన శిఖరం, మేడమెట్లు, నన్ను గురించి కథ వ్రాయవూ ? దేశం నాకిచ్చిన సందేశం... ఇలా బుచ్చిబాబు కథలలో చాలా కథలు ఇప్పటికీ సాహితీవేత్తలకు పరిచయమే! బుచ్చిబాబు మీద ఆంగ్ల రచయితలు ప్రభావం బాగా ఉంది. అటు చదువు కోసమూ, ఇటు అభిరుచి కోసమూ.... షేక్స్పియర్ దగ్గర నుంచీ ఓ.హెన్రీ వరకూ ఆంగ్ల రచయితల సాహిత్యాన్నంతా ఆకళింపు చేసుకున్నారు. సహజంగానే ఆయన రచనల మీద కూడా వారి ప్రభావం కనిపించక మానదు. బుచ్చిబాబు రచనలు చేసేనాటికి ప్రపంచమంతటా మానవతావాదాన్ని పలవరిస్తోంది. ప్రపంచయుద్ధాలు, స్వాతంత్ర్య సంగ్రామం నేపథ్యంలో మనిషిని మనిషిగా గుర్తించి ప్రేమించాల్సిన అవసరాన్ని గుర్తిస్తోంది. ఈ అగత్యం బుచ్చిబాబు రచనల్లో కూడా కనిపిస్తుంది.

బుచ్చిబాబు రచనలనీ, రచయితగా ఆయన దృక్పథాన్నీ చెప్పుకోవాలంటే... చివరకు మిగిలేది చదివితే సరి! బుచ్చిబాబు ఈ ఒక్క నవలనే రాశారు. అయితే ఏం! వంద నవలలకు దీటుగా ఇది మన సాహిత్యంలో నిలిచిపోయింది. ఇందులో ప్రధాన పాత్ర ‘దయానిధి’ అనే యువకుడు. ఆ పేరుతోనే ఆ పాత్ర ద్వారా తానేం సాధించదల్చుకున్నానో చెప్పకనే చెబుతాడు రచయిత. ఏదో ఒక కమర్షియల్ విజయాన్ని సాధించడానికో, రచయితగా స్థిరపడిపోవడానికో ఈ నవల రాయలేదు బుచ్చిబాబు. తనలోని అంతర్మధనాన్ని పాఠకులతో పంచుకోవడానికీ, దానికి ఒక ముగింపుని ఇవ్వడానికీ నవలని సాగించాడు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే... ‘సమాజాల మధ్య ఉన్న ద్వేషాలకీ, వ్యక్తులు ప్రేమించలేకపోవడానికీ ఏదో సంబంధం ఉండి ఉండాలని నా నమ్మకం. అదేమిటో, ఎల్లా ఉంటుందో కనుక్కుందామని ఈ నవలా రచన సాగిందనిపిస్తుంది,’ అంటారు బుచ్చిబాబు.

 

 

చివరకు మిగిలేది నవలలో దయానిధి తల్లి పాత్రది కీలకం. కానీ ఆ పాత్ర నవలలో ఎక్కడా కనిపించదు. ఆమె మీద పడిన నింద మాత్రం అతని జీవితాన్ని నీడలా వెంటాడుతూ ఉంటుంది. ఆ నిందను మోస్తూ, ఆ నీడను తప్పించుకుంటూ.... తన అంతరంగాన్నీ, తనకు తారసపడిన ప్రతివ్యక్తి స్వభావాన్నీ విశ్లేషిస్తూ సాగే పాత్రగా దయానిధి కనిపిస్తాడు. అనంతపురంలో పనిచేసినప్పుడు రచయితకి రాయలసీమ ప్రాంతం గురించిన అవగాహన ఏర్పడటంతో, రచనలో కొంతభాగం రాయలసీమ నేపథ్యంలో సాగుతుంది.

చివరకు మిగిలేది ‘గడ్డిపోచ విలువెంత?’ అన్న అధ్యాయంతో మొదలవుతుంది. ‘చివరకు మిగిలేదేమిటి? దీనికి సమాధానం తెలిస్తే జీవిత రహస్యం తెలుసుకున్నట్లే. అసలు జీవితానికర్థమేమై ఉంటుంది?’ అన్న ప్రశ్నలతో ఈ అధ్యాయం మొదలవుతుంది. ఆఖరున ‘చివరకు మిగిలేది’ అన్న అధ్యాయంతో నవల ముగుస్తుంది. ‘చివరకు మిగిలింది – దాని సమాధానం కాదు; సమాధానం తెల్సుకునేటందుకు తను చేసిన యత్నాల జ్ఞాపకాలు – తనతో తాను సమాధానపడటం – అది మిగిలింది.’ అంటూ తన ఆఖరు వాక్యాలతో మొదట వేసిన ప్రశ్నలకు జవాబు చెప్పే యత్నం చేస్తారు. రచయిత మొదటి మాటలోనే పేర్కొన్నట్లు ‘నిజమైన విషాదం ప్రేమించలేకపోవడం,’ అన్న సూత్రాన్ని నవలలో అడుగడుగునా బలపరిచే ప్రయత్నం కనిపిస్తుంది.

బుచ్చిబాబు కేవలం కథకుడే కాదు. నాటక రచయిత కూడా! ఆయన మంచి చిత్రకారుడని కూడా చెబుతూ ఉంటారు. రంగం ఏదైతేనేం జీవతపు కాన్వాస్ మీద రచయితగా తనదైన ముద్రని వేయడంలో మాత్రం ఆయన ఎప్పుడూ వెనకడుగు వేయని మాట మాత్రం వాస్తవం. అందుకే ఆయన అసలు పేరైన ‘శివరాజు వెంకట సుబ్బారావు’ అన్న పేరుని కూడా మర్చిపోయిన పాఠకులు బుచ్చిబాబు అన్న కలం పేరు వినిపిస్తే మాత్రం గౌరవంతో ఒక్క నిమిషం ఆయనని తల్చుకుంటారు. ఆయన చనిపోయి ఐదు దశాబ్దాలు గడిచిపోయినా... ఇప్పటికీ ఆయన కథలంటే కళ్లు ఇంతింత చేసుకుంటారు.

- నిర్జర.

 

 

 


యుద్దనపూడి సులోచనారాణి తెలుగులో పాపులర్ నవలా ప్రపంచంలో ఓ కలికితురాయి. మధ్యతరగతి మహిళా మణుల ఊహలను, వాస్తవ జీవితాలను తన నవలల్లో అద్భుతంగా చిత్రించారు
May 21, 2018
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా తెలంగాణ రచయితల గురించి లోకానికి చాటే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం.
Dec 18, 2017
తెలంగాణలో తొలి ప్రపంచ తెలుగు మహాసభలు జరుగుతున్నాయి. ప్రశంసలు, విమర్శలూ ఎలా ఉన్నా...
Dec 14, 2017
భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు.
Sep 14, 2017
తెలుగు సాహిత్యంలో అన్నమయ్య పేరు వినపడగానే ఆ శ్రీనివాసుని తన కీర్తనలతో కొలిచిన తాళ్లపాక అన్నమయ్యే గుర్తుకువస్తాడు.
Sep 12, 2017
ఈ రచయితలు ఉపాధ్యాయులు కూడా
Sep 5, 2017
పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని ఓ సామెత ఉంది.
Aug 31, 2017
తెలుగు భాషలోని సాహిత్యం గురించి చాలామందికి చాలా అపోహలే ఉన్నాయి.
Aug 26, 2017
తెలుగు సాహిత్యంలో శతకాల గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.
Aug 22, 2017
పరవస్తు చిన్నయసూరి. ఈ పేరు వినగానే బాలవ్యాకరణం పుస్తకమే గుర్తుకువస్తుంది.
Aug 16, 2017
TeluguOne For Your Business
About TeluguOne