Home » పిల్లల కోసం » నక్క నేర్చిన పాటంFacebook Twitter Google
నక్క నేర్చిన పాటం

 

నక్క నేర్చిన పాటం

 

 

అనగనగా ఒక అడవిలో జిత్తులమారి నక్క ఒకటి ఉండేది. దానికి స్వయంగా వేటాడటం రాదు; అడవిలో ఏదో కారణంచేత చచ్చి పడివున్న జంతువులను తిని బ్రతుకుతుండేది అది.

ఒకసారి దానికి అడవిలో ఏ జంతువూ దొరకలేదు. ఆకలితో నాలుగు రోజులు అలమటించాక, దానికి ఒక ఉపాయం తోచింది. "మృగరాజైన సింహంతో జత-కడితే...!?" అనుకున్నది.

అది వెళ్ళేసరికి సింహం ముందు ఒక తోడేలు నిలబడి ఉంది. అది సింహానికి వేటలో మెళకువలు నేర్పుతున్నది. సింహం శ్రద్దగా వినటం చూసి నక్కకు ముచ్చట వేసింది. అది సింహంతో "ప్రభూ, తమరు వేటాడగా చూడాలని నాకు మహా కోరికగా ఉన్నది. తమరి అనుచరులుగా నేను, ఈ తోడేలూ తమరి వెంట వేటకు రాకోరుతున్నాము. తమరు అంగీకరిస్తే ధన్యులమౌతాము" అన్నది.

 

 

తక్కువ జాతివైన నక్కలతో, తోడేళ్ళతో కలిసి వేటకు పోవటం సింహానికి నామోషీ అనిపించింది. కానీ నక్క అడిగిన తీరువల్ల, కాదనేందుకు దానికి వీలవ్వలేదు. ఆ విధంగా ఆ మూడూ కలిసి అడవిలోకి పోయినై; ఒక అడవి దున్నను, ఒక అడవి గొర్రెను, ఒక కుందేలును చంపాయి.

నక్కకు, తోడేలుకు ఆ మాంసాన్ని చూసేసరికి నోట్లో నీళ్ళు ఊరాయి. "ఈ వేటలో మా భాగం ఎంత ఉంటుందో.." అని ఆలోచించటం మొదలుపెట్టాయవి.

అవి అట్లా చొంగలార్చుకుంటూ నిలబడటం చూసిన సింహానికి చాలా చికాకు వేసింది. "దొంగ వెధవల్లారా! ఆగండి! ఏమౌతుందో చూడండి! మీ దురాశకు తగిన గుణపాఠం చెప్పకపోతే నేను మృగరాజునేకాదు. జన్మలో మరిచిపోలేని పాఠం చెప్తాను ఆగండి!" అనుకున్నది అది.

పైకి మాత్రం రాజసంగా ముఖం పెట్టి, అది తోడేలుతో అన్నది "చూశావుగా?! మన ముందు చాలా మాంసం పడిఉన్నది. దీన్ని అంతటినీ మన తాహతుకు తగినట్లుగా పంచు" అని.

 

 

 

తెలివి తక్కువ తోడేలు వెంటనే నోరు జారింది- "మహాప్రభూ! మూడు జంతువులలోకీ పెద్దదైన అడవిదున్న మహాప్రభువులు, ఉత్తమ-జీవులు అయిన తమరికి చెందుతుంది. మధ్యరకం ప్రాణి కనుక, ఈ అడవిగొర్రె నాకు చెందాలి. అల్ప జీవి అయిన నక్కకు ఈ చిట్టి కుందేలు సరిపోతుంది!" అన్నది.

ఇది వినగానే సింహం కళ్ళు కోపంతో ఎర్ర-బడ్డాయి. దాని వెంట్రుకలు నిటారుగా నిలబడ్డాయి. ఉరుములు ఉరిమినట్లు అరిచింది అది: "నీచపు కుక్కా! మా స్థాయి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ!? మాతోపాటు వేటను పంచుకునేందుకు, వాటా అడిగేందుకు నీకెన్ని గుండెలు?! ఎంత ధైర్యం నీకసలు..?!" అని. అట్లా అరుస్తూ ముందుకు దూకి అది తోడేలును ఒక్క చరుపు చరిచింది. ఆ దెబ్బకు తోడేలు అక్కడికక్కడ తలపగిలి చచ్చింది!

తరువాత సింహం నక్కవైపుకు తిరిగి, వేటను పంచమన్నది.

తోడేలు గతిని చూసిన జిత్తులమారి నక్కకు ఆ సరికే సగం ప్రాణాలు పోయినై. 'బలవంతులతో చెలిమి తన వంటి బక్క ప్రాణులకు తగదు' అని అది ఆ సరికే గ్రహించింది. అయినా ఇప్పటికి చేయగలి-గింది లేదు. ఏదో ఒక విధంగా తప్పించు-కోవాలి...

 

అందుకని అది సింహంతో- "మహారాజా, ఇందులో ఆలోచించాల్సింది ఏమీ లేదు. బలిసిన ఈ దున్న ఈ ఉదయాన తమరికి అల్పాహారం అవుతుంది. బలిసిన ఈ అడవి గొర్రె తమరి మధ్యాహ్న భోజనానికి అనువుగా ఉంటుంది. ఇక ఈ కుందేలు ఉన్నది చూశారా, అది ఈ రాత్రికి తమకు రుచికరమైన భోజనం కాగలదు!" అన్నది.

జిత్తులమారి నక్క తెలివిగా చేసిన ఈ పంపకానికి సింహం చాలా సంతోషపడింది. మనసులోనే ఉబ్బిపోతూ అది "ఓ ప్రియమైన నక్కా, అందరికీ అనుకరణీయమైన, అతి అద్భుతమైన ఇంత చక్కని పంపకపు విధానాన్ని నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు?" అని అడిగింది.

నక్క అణకువగా తల వంచుతూ, "మహా ప్రభూ, తన తెలివిమాలిన మూర్ఖపు ప్రవర్తన కారణంగా కొద్ది సేపటి క్రితమే తమ చేత యమపురికి పంపబడిన వెర్రి తోడేలు ఉదాహరణ నుండి నేను ఈ కళను నేర్చుకున్నాను. నావంటి అల్పుడికి ఇంత గొప్ప పాఠం నేర్పిన శ్రేయస్సు పూర్తిగా తమరిదే!" అన్నది.

ఈ జవాబుతో సింహం ఎంత సంతోషపడిందంటే అది నక్క భుజాన్ని తట్టుతూ "విస్వాసం గల ఓ నక్కా! నువ్వు నీ స్వంత అస్తిత్వాన్ని నాకోసం త్యాగం చేసిన తీరు అమోఘం. నేను నిన్ను మెచ్చాను. ఈ జంతువులన్నింటినీ నీకే బహుమానంగా ఇవ్వాలని నిశ్చయించాను. పండగ చేసుకో, ఇక సంతోషంగా ఉండు!" అని వెళ్ళిపోయింది.

"చస్తూ చస్తూ బ్రతికిపోయాను. చావుకు అంత దగ్గరగా వెళ్ళికూడా, కేవలం నా అదృష్టంకొద్దీ బతికాను. ఇక ఎప్పుడూ

అహంకారులతో పొత్తు పెట్టుకోను" అని ఒట్టు పెట్టుకున్నది నక్క, నిండుగా ఊపిరి పీల్చుకుంటూ.

Courtesy..
kottapalli.in
 

 

అనగనగా ఒక అడవి. ఆ అడవిలో ఒక నక్క. అది ఒక రోజున వేటగాడు
Apr 27, 2017
అనగనగా ఒక అడవి ఉండేది. ఆ అడవిలోని జంతువులన్నింటికీ, పాపం ఏదో ఒక సమయంలో గాయాలు తగులుతూనే ఉన్నాయి. గాయాలు తగిలినప్పుడు వాటిని ఎలా మాన్పుకోవాలో ఆ జంతువులకి తెలీదు! రాను రాను
Apr 19, 2017
మాధవపురాన్ని పాలించే మాధవుడికి రహస్యాలు ఛేదించటం అంటే ఇష్టం. సాహస కార్యాలు ఆయన్ని అనేక దేశాలు తిప్పాయి. ఒకసారి ఆయన
Apr 10, 2017
ఒక ఊరిలో ఒక అవ్వ నివసిస్తూ ఉండేది. ఒక నాడు ఆ అవ్వ కూరగాయలు తీసుకరావడానికని సంతకెళ్ళింది. సంతలో అవ్వ చాలా కూరగాయలు
Mar 30, 2017
సామాన్యుడు ఒకడు ఓ నది ఒడ్డున కూర్చొని ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నాడట. ఆ సమయంలో
Mar 27, 2017
అనగనగా ఓ ఇంటి ఆవరణలో ఉండేవి- ఒక చీమ, ఒక దోమ, ఒక ఈగ. దోమ
Mar 18, 2017
అనగనగా ఒక ఊరిలో రామయ్య అనే చిన్న రైతు ఒకడు...
Mar 10, 2017
బలవంతుని గర్వభంగం
Mar 6, 2017
చిలుక-ఏనుగు (కథ)
Mar 3, 2017
బాల కార్మికులు
Mar 1, 2017
TeluguOne For Your Business
About TeluguOne