Facebook Twitter
కాలం విస్తుపోతూనే ఉంది

కాలం విస్తుపోతూనే ఉంది

 

శిశిరాలు వసంతాలు
షష్టి పూర్తిని దాటేశాయి

జీవితపు తొలి సంజ వెలుగుల
చారికలు చిత్తరువుల్లా
గుండె గది గోడలను
అలుముకుని ఉన్నాయి

తొలి ఋతువుల క్రతువులు
పసిడి పసిబుగ్గల మెరుపుల్లా
రెప్పల వెనుక చేరి, చూపులకు
తూపులు వెయ్యడం నేర్పుతున్నాయి

ఓ నా నది ఆలపించిన గీతమా
సాగరం చేరదీసిన కావ్యమా
నువ్వు అనాదిలయవని
పెట్టెలోని పట్టుచీరను వదలని
మొగలి రేకుల వాసనవని
గునుగు పూల గుబాళింపువని
తంగేడు పూల తన్మయత్వానివని
నరాలు నవవీణా తంత్రువులై నినదిస్తుంటే
ఎలా తోసిరాజనను?

కాలం కదులుతుందన్నది
ఒక అవాస్తవ ప్రతిపాదనలా నిలిస్తే
నిశ్శబ్దాన్నే ఆశ్రయించాలి
గులాబీ,
ముల్లుస్పర్శనే ఇస్తుందని
అది చేత్తో తాకితే గుండెకు చేరుతుందని
అయినా అదే కోరుకోవాలనిపిస్తుందని
కావ్యాల పాలపుంతలు వెలిశాయి
కాలం విస్తుపోతూనే ఉంది
పోతూనే ఉంటుంది .......


- Rammohan Rao Thummuri