Facebook Twitter
నన్నెక్కనివ్వండి బోను

 

నన్నెక్కనివ్వండి బోను

 

 

నల్లకోట్లు నీలిరంగు నోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యే కేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను

నలుగురి నమ్మికతో 'అమ్మా ' అని పిలవడం తప్ప
నవమోసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తోన్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను

మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను

కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? యెల్లలేమిటి?
మనిషీ, రక్తం ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్, మస్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు యెందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్లు,
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మ యెవరైతేనేం? చనుబాల తీపంతా ఒక్కటే
బిక్కముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను

తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్?
మంచి మనసు పరిమళాలు
విశ్వవ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్నికణం
చల్లారక రగులుతోంది
తీర్పు మీది జైలు మీది
... నన్నెక్కనివ్వండి బోను!
(దిగంబర కవులలో ఒకరైన చెరబండరాజు రాసిన ప్రసిద్ధ కవిత ఇది)