Home » మన రచయితలు » ఆ డిటెక్టివ్ రచయిత జీవితమే ఓ మిస్టరీ!Facebook Twitter Google
ఆ డిటెక్టివ్ రచయిత జీవితమే ఓ మిస్టరీ!

 

ఆ డిటెక్టివ్ రచయిత జీవితమే ఓ మిస్టరీ!

 

 

 

సాహిత్యం గురించి ఎంతో కొంత తెలిసిన వారికి ‘అగాథా క్రిస్టీ’ పేరు పరిచయమే! నరాలు తెగిపోయే ఉత్కంఠతతో మిస్టరీ నవలలు రాయడంలో ఆమెకి ఆమే సాటి. అందుకే బైబిల్, షేక్స్పియర్ పుస్తకాల తర్వాత అత్యధికంగా ఆమె పుస్తకాలే అమ్ముడుపోయాయి. అగాథా క్రిస్టీ రాసిన దాదాపు 80 పుస్తకాలు ఇప్పటివరకూ 400 కోట్ల ప్రతులు అమ్ముడుపోయాయంటే... ఆమె సత్తా ఏమిటో తెలిసిపోతుంది. అలాంటి అగాథా జీవితంలోని ఓ ఘట్టం ఇప్పటికీ వీడని చిక్కుముడిగానే మిగిలిపోయింది. అది 1926 సంవత్సరం. అగాథా వయసు అప్పటికి 36 ఏళ్లు. కానీ ఆపాటికే ఆమె పాపులర్ రచయిత్రి. తను రాసే ప్రతి వాక్యంతోనూ పాఠకులను వెర్రెత్తిస్తున్న శక్తి. కానీ అకస్మాత్తుగా ఓ రోజు ఆమె అదృశ్యం అయిపోయింది. తన కారుని నడుపుతూ వెళ్లిన ఆమె ఎవ్వరికీ కనిపించకుండా మాయమైపోయింది. అగాథా అదృశ్యం అయ్యిందన్న వార్త దావానలంలా వ్యాపించింది. మర్నాడు పత్రికలలో పతాక శీర్షిక ఆమె అదృశ్యమే!

 

అగాథా తాను బయటకు వెళ్లేటప్పుడు ‘యార్క్షైర్’ అనే ప్రదేశానికి వెళ్తున్నట్లు తన సెక్రెటరీతో చెప్పి వెళ్లింది. కానీ మర్నాడు ఆమె కారు ఎక్కడో దూరంగా ఉన్న ‘న్యూలాండ్స్ కార్నర్’ అనే ప్రదేశంలో కనిపించింది. అందులో అగాథా దుస్తులు, లైసెన్స్ పోలీసులని వెక్కిరించాయి. ఇక దాంతో అగాథా ఏమై ఉంటుందన్న సందేహంతో ఇంగ్లండు వెర్రెత్తిపోయింది. అగాథాని వెతికించేందుకు స్వయంగా మంత్రులు రంగంలోకి దిగారు. వేయిమంది పోలీసు అధికారులను ఆమె ఆచూకీ కనిపెట్టేందుకు నియమించారు. దేశంలోని అణువణువునీ గాలించేందుకు ఓ 15 వేలమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. అగాథా ఆచూకీ తెలిపినవారికి భారీ బహుమానం ఇస్తామంటూ వార్తాపత్రికలు స్వయంగా ప్రకటనలు ఇచ్చాయి. ఆఖరికి కొందరు మంత్రగాళ్లు కూడా రంగంలోకి దిగారు. కానీ రోజులు గడిచేకొద్దీ అగాథాకి సంబంధించిన చిన్నపాటి ఆచూకీని కూడా పొందలేకపోయారు.

 

 

1926 డిసెంబరు 14. అగాథా అప్పటికి తప్పిపోయి సరిగ్గా 11 రోజులు. ఆ రోజున అగాథా ‘Old Swan’ అనే ఒక హోటల్లో ఉన్నట్లు తెలిసింది. ఆ సమయంలో ఆమె ఈ లోకంలో లేదు. తనెవరలో, తన పేరేమిటో కూడా గుర్తులేనంత అయోమయంలో ఉంది. దాంతో ఆమెని భద్రంగా వెనక్కి తీసుకువచ్చి వైద్యపరీక్షలు నిర్వహించారు. అగాథా తాత్కాలిక మతిమరపుతో (అమ్నీషియా)తో బాధపడుతున్నట్లు తేలింది. ఒక పక్క విపరీతమైన పని ఒత్తిడి, మరో పక్క ఆ మధ్యే చనిపోయిన తల్లి మరణంతో ఆమె డిప్రెషన్కు లోనై ఉంటుందనీ... దాంతో తాత్కాలికంగా ఆమె మతి భ్రమించిందనీ వైద్యులు తేల్చారు. ఆ తర్వాతకాలంలో తాను అదృశ్యమైన విషయం గురించి అగాథా ఎక్కడా వివరణ ఇవ్వలేదు. ఆమె మారుపేరుతో రాసిన Unfinished portrait అనే నవలలో మాత్రం, ఆత్మహత్య చేసుకోబోయి మనసుమార్చుకున్న మనిషి గురించి ప్రస్తావించారు. తర్వాతకాలంలో అగాథా అదృశ్యం గురించి అనేక కథనాలు, విశ్లేషణలు, పుస్తకాలు వచ్చాయి. వాటిలో చాలామంది తేల్చిన కారణం ఏమిటంటే-

 

అగాథా భర్త ‘ఆర్చీ క్రిస్టీ’కి పరాయి స్త్రీతో సంబంధం ఏర్పడింది. అగాథాకి విడాకులు ఇచ్చి ఆమెని పెళ్లి చేసుకునేందుకు అతను సిద్ధంగా ఉన్నాడు. భర్త తననుంచి దూరమవుతున్నాడన్న విషయాన్ని అగాథా తట్టుకోలేకపోయారు. దాంతో ఆమె తరచూ డిప్రెషన్లో కూరుకుపోయేవారు. ఆ సమయంలో ఆత్మహత్యకు సంబంధించిన ఆలోచనలు కూడా వచ్చేవి. చివరికి ఆమె ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కాకపోతే డిటెక్టివ్ నవలలు రాసీ రాసీ ఆమె బుర్ర పదునెక్కిపోవడంతో... తన ఆత్మహత్యను కూడా ఒక ప్రతీకారం కిందకి మార్చుకోవాలని అనుకున్నారు.

 

అగాథా  ‘Old Swan’ హోటల్లో దిగినప్పుడు తన పేరు కాకుండా, తన భర్త ప్రియురాలి పేరు మీద రూం తీసుకున్నారు. అక్కడ తను ఆత్మహత్య చేసుకుంటే ఆ ప్రియురాలే అగాథాని చంపి ఉంటుందని లోకం నమ్ముతుంది కదా! ఒకవేళ ఎప్పటికో నిజం బయటపడినా... ఆ క్రమంలో ఆమె భర్తా, అతని ప్రియురాలూ అభాసుపాలు కావడం ఖాయం. అందుకే అగాథా అకస్మాత్తుగా అదృశ్యం అయిపోయి ఉంటుందని విశ్లేషకుల అంచనా! అయితే ఏ కారణం చేతనో ఆమె మనసు మళ్లీ మారింది. తనని మోసం చేసిన భర్త కోసం తన ప్రాణం తీసుకోవడం ఏమిటి? అన్న ఆలోచన వచ్చి ఉండవచ్చు. కానీ ఈ పదిరోజులూ ఎందుకని ఇంటికి దూరంగా ఉన్నావు? అని ప్రపంచం అడిగితే ఏమని చెప్పేది! అందుకే మతిమరపు నాటకాన్ని ఆడింది.

 

అయితే పైన చెప్పుకొన్నదంతా విశ్లేషణ మాత్రమే! నిజంగా అగాథా మనసులో ఏముంది? ఆ 11 రోజులూ ఆమె ఏం చేసింది? ఆమె అదృశ్యం అవ్వడానికి వెనక ఉన్న కారణం ఏమిటి?... లాంటి ప్రశ్నలకు ఇంతవరకూ స్పష్టమైన జవాబు లేనేలేదు. ఆ జవాబు చెప్పగలిగిన అగాథా క్రిస్టీ కూడా ఇప్పుడు ప్రపంచంలోనే లేదు. కాబట్టి ఈ రహస్యం ఆమెతో సమాధి అయిపోయినట్లే! ఎన్నో డిటెక్టివ్ నవలలను అద్భుతమైన మలుపులు తిప్పి, అనూహ్యమైన ముగింపులు ఇచ్చిన ఆ మహారచయిత్రి... చివరికి తన జీవితాన్నే ఒక మిస్టరీగా మిగిల్చి వెళ్లింది.

- నిర్జర.

 

 

పరవస్తు చిన్నయసూరి. ఈ పేరు వినగానే బాలవ్యాకరణం పుస్తకమే గుర్తుకువస్తుంది.
Aug 16, 2017
ఒక వంద సంవత్సరాల క్రితం ప్రచురించిన పుస్తకం ఏదన్నా తీసుకోండి....
Jul 29, 2017
హరికథకు గురువు - నారాయణదాసు
Jul 8, 2017
సాటిలేని రచయిత – ఆరుద్ర!
Jul 1, 2017
ఓ సంచలన రచయిత - శరత్ చంద్ర!
Jun 24, 2017
కొందరు రచయితలు బతికుండగానే గొప్ప సాహిత్యకారులుగా
Jun 10, 2017
తెలుగు కాల్పనిక సాహిత్యంలో తాత్వికతని స్పృశించే రచనలు కానీ, మనిషి లోతుల్లోకి తొంగిచూసే ప్రయత్నాలు కానీ జరగలేదని ఓ విమర్శ ఉంది. అదృష్టవశాత్తూ
Jun 3, 2017
గురజాడ, వీరేశలింగం తర్వాత తెలుగు కథను భుజానికెత్తుకున్న వ్యక్తిగా శ్రీపాదను విమర్శకులు
Apr 22, 2017
మనసున్న మారాజు – అడివి బాపిరాజు
Apr 8, 2017
బెంగాల్ వారికి రవీంద్రానాధ్ టాగూర్ ఓ వరం. ఆయన రాసిన....
Mar 25, 2017
TeluguOne For Your Business
About TeluguOne