Facebook Twitter
‘అదిగో భద్రాద్రి’ కీర్తన రాసిన కవి

‘అదిగో భద్రాద్రి’ కీర్తన రాసిన కవి!

 


భక్త రామదాసు గురించీ, ఆయన కీర్తినల గురించీ తెలియని తెలుగువాడు ఉండడు. కంచర్ల గోపన్న అనే తహలీల్దారు కాస్తా భద్రాచలం గుడిని నిర్మించే ప్రయత్నంలో రామదాసుగా మారిన కథ మనకి కొత్త కాదు. కానీ అదే బాటలో సాగిన ‘తూము లక్ష్మీనరసింహదాసు’ జీవితాన్నీ, ఆయన కొనసాగించిన రామదాసు కార్యాన్నీ గురించి తెలిసినవారు చాలా అరుదు.


భక్తరామదాసు 1680లో చనిపోయారని అంటారు. ఆయన చనిపోయిన దాదాపు 110 ఏళ్ల తర్వాత గుంటూరులో అచ్చయ మంత్రి, వెంకమ్మ అనే దంపతులకు తూము లక్ష్మీనరసింహదాసు జన్మించాడు. నరసింహదాసుది పండితవంశం. ఆయన తండ్రికి సంగీతం మీద మంచి అభిరుచి ఉంది. నిత్యం వారింట్లో ఏదో ఒక గోష్టి జరుగుతూనే ఉండేది. నరసింహదాసు ఏకసంథాగ్రాహి కావడంతో తాను వింటున్న ప్రతిమాటనీ ఆకళింపు చేసేసుకునేవాడు. యుక్తవయసుకి వచ్చేసరికే పండితునిగా మారిపోయాడు.


నరసింహదాసుకి 19 ఏళ్లు వచ్చేసరికి వివాహం జరిగిపోయింది. ఆ మరుసటి ఏడాది ఆయన తండ్రి మరణించాడు. తమ్ముడు చూస్తే ఇంకా చేతికి అందలేదు. దాంతో గంపెడు సంసార బాధ్యత నరసింహుని మీదే పడింది. ఆ బాధ్యతను నడపించడానికి పేష్కర్‌ అనే రెవెన్యూ ఉద్యోగాన్ని చేపట్టాడు. కానీ అతని లౌకిక వృత్తికీ, ఆధ్మాత్మిక ప్రవృత్తికీ ఏమాత్రం పొంతన కుదరలేదు. ఎక్కువ రోజులు ఆ ఉద్యోగంలో నిలవలేకపోయాడు. ఆర్థికంగా కష్టాలను ఎదుర్కొంటానని తెలిసినా... ఉద్యోగాన్ని వీడి భక్తి మార్గాన్ని ఎంచుకొన్నాడు.


ఉద్యోగాన్ని వీడిన నరసింహ సకుటుంబంగా యాత్రలు చేయడం మొదలుపెట్టాడు. వైష్ణవ దీక్షను చేపట్టి నరసింహ కాస్తా నరసింహదాసుగా మారిపోయాడు. అలా దేశమంతా తీర్థయాత్రలు సాగిస్తున్న సమయంలో తన సమకాలికుడైన త్యాగరాజుని కూడా కలుసుకున్నాడట. బహుశా ఆయన ప్రభావంతోనే నరసింహదాసుకి కూడా కీర్తనలు రాయాలన్న అభిలాష మొదలై ఉంటుంది.


నరసింహదాసు తన యాత్రలో భాగంగా భద్రాచలానికి చేరుకున్నాడు. అప్పటికి వందేళ్ల క్రితమే భక్త రామదాసు ఆ ఆలయాన్ని పునరుద్ధరించి ఉన్నాడు. కానీ కాలక్రమంలో అది తిరిగి జీర్ణవస్థకు చేరుకోవడాన్ని గమనించారు నరసింహదాసు. పూర్వపు పాలకులు ఆలయ నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన శాసనాలని నాశనం చేసి, ఆలయ ఆస్తులను ఇతరులు అనుభవిస్తున్నారని తెలిసింది. దాంతో హుటాహుటిన హైదరాబాదుకి చేరుకుని ఆనాటి నవాబుని కలుసుకున్నారు. జరిగిన అన్యాయాన్ని తెలియచేసి, ఆలయ ఆస్తులను పరిరక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. నరసింహదాసు అభ్యర్థనని నవాబు మన్నించడంతో.... తిరిగి భద్రాచలానికి చేరుకున్నాడు.


నరసింహదాసు తన శేష జీవితమంతా భద్రాచలంలోనే గడిపేశాడు. నిత్యం ఆ స్వామిని సేవిస్తూ, కీర్తిస్తూ తన జన్మని ధన్యం చేసుకున్నాడు. ఆయన రాసిన లెక్కలేనన్ని కీర్తనలలో కొన్ని ఇప్పటికీ సంగీతజ్ఞులకు పరిచయమే! ముఖ్యంగా ‘అదిగో భద్రాద్రి – గౌతమి యిదిగో చూడండి’ అంటూ సాగే కీర్తన వినని వారు ఎవరూ ఉండరేమో! ఒకపక్క రామదాసులాగా కీర్తనలు చేస్తూ, మరోపక్క ఆయనకు ఇష్టమైన భద్రాచల ఆలయాన్ని పునరుద్ధరించాడు కాబట్టి... ఆయన రామదాసు అవతారమే అని చాలామంది నమ్మకం.

- నిర్జర.