Home » పిల్లల కోసం » అబద్ధాలు చెబితే...Facebook Twitter Google
అబద్ధాలు చెబితే...

అబద్ధాలు చెబితే...

 


నందపురంలో ఉండే గోపి, చందు, గౌరిలకు వాళ్ళ మామయ్య అంటే చాలా ఇష్టం. వచ్చినప్పుడల్లా కొత్త కొత్త కథలు చెప్తాడు మామయ్య. అంతేకాదు, వీళ్ళతో కలిసి రకరకాల ఆటలు ఆడతాడు. మామయ్య వచ్చాడంటే పిల్లలకు పండుగే. ఒకరోజు బాగా వర్షం పడుతోంది. సరిగ్గా అప్పుడే వచ్చాడు మామయ్య. బయట ఆడుకోవడానికి వీలులేక ఇంట్లో బోరుగా కూర్చున్న పిల్లలు మామయ్యని చూసి సంతోషం గా అరిచారు. మామయ్య వచ్చీ రావడంతోనే "ఆ! పిల్లలూ ఈరోజు ఒక కొత్త ఆట ఆడదాం" అన్నాడు. 

"ఏం ఆట? " అన్నారు పిల్లలు మామయ్య చుట్టూ చేరి. "దాన్ని అబద్ధాలు చెప్పే ఆట" అందాం. మీలో ఎవరైతే పెద్ద అబద్ధం చెప్తారో వాళ్ళకి బహుమతి ఇస్తాను" అన్నాడు మామయ్య. మామయ్య మాటలకు పిల్లలు ఆశ్చర్యపోతూ "మా అమ్మ ఎప్పుడూ అబద్ధాలు చెప్పకూడదని చెప్పింది. నువ్వేమో చెప్పమంటున్నావు" అన్నారు. "మీ అమ్మ అబద్ధాలు చెప్పొద్దంది కాని ఎందుకు చెప్పకూడదో చెప్పిందా?" అడిగాడు మామయ్య. "చెప్పలేదు" అన్నారు పిల్లలు మూతి ముడుచుకుని.

 

"అయితే మరి అబద్ధాలు ఎందుకు చెప్పకూడదో మీకే తెలుస్తుందిలే కాని, ముందు ఎవరెంత బాగా అబద్ధం చెప్పగలరో చూద్దాం- కానీండి" అన్నాడు మామయ్య నవ్వుతూ. "సరే! ఎలాంటి అబద్ధాలు చెప్పాలో మాకు తెలీదుగా, అందుకని ముందు నువ్వే మొదలు పెట్టు!" అన్నారు పిల్లలు. "సరే, అయితే వినండి: ఒక తోటలో ఓ కుంటోడు, ఓ గుడ్డోడు, ఒక మూగోడు నడుస్తూ ఉన్నారు.

 

గుడ్డోడు అన్నాడు: 'అదిగో చూడండి! అక్కడ తెల్ల కుందేలుంది. అబ్బ! ఎంత బాగుందో కదా! ' అని. 'అవును! అవును! కుందేలు చాలా బాగుంది. పట్టుకోండి-పట్టుకోండి' అన్నాడు మూగోడు. మరుక్షణం కుంటోడు వేగంగా పరిగెత్తి ఆ కుందేలుని పట్టుకున్నాడు. అప్పుడు మూగోడు అన్నాడు: 'దాన్ని పెట్టెలో పెట్టు. రేపు మనం దాని మీద ఎక్కి షికారుకి వెళ్దాం' అని! ఇంత మాత్రం‌చెప్పి ఆపాడు మామయ్య- "ఇంత మాత్రం చాల్లే.. దీని కంటే పెద్ద అబద్ధం ఎవరైనా చెప్పగలరా?" అన్నాడు కధ లోని అబద్ధాలకు నవ్వుకుంటున్న పిల్లలను చూస్తూ.

 

"నేను చెప్పగలను!" అని మొదలు పెట్టాడు గోపి. "ఒక రోజు నేను బడి నుండి వస్తుండగా చాలా పక్షులు -వీపు కిందికి, తల పైకి- పెట్టి ఎగురుతూ కనిపించాయి. నేను చూస్తూండగానే అవి అట్లా పైపైకి ఎగిరి ఎగిరి పోయినై. చివరికి ఆ రోజు రాత్రి చంద్రుడు వచ్చే సరికి అవన్నీ చంద్రుడిని చేరుకున్నాయి. పాపం‌ అంత దూరం ఎగిరి వెళ్ళే సరికి వాటికి కాస్తా చాలా ఆకలి అయ్యింది. అప్పుడు చంద్రుడు వాటికి తేనె పోశాడు. ఆ తేనె కారి నా మీద పడుతుంటే నేను ఏంచేశానో తెలుసుగా, నా స్కూలు పుస్తకంతో పట్టేసుకుని కడుపునిండా తాగాను!" ఆపాడు గోపి. "బలే చెప్పావు గోపీ -ఇప్పుడు చందూ, నువ్వు చెప్తావా?" అడిగాడు మామయ్య చందూని.

చందూ మొదలు పెట్టాడు: "సరే వినండి - ఒక రోజున బాగా వర్షం కురిసింది. హఠాత్తుగా పైనుండి మా ఇంట్లోకి కూడా వర్షం పడటం మొదలు పెట్టింది! 'ఏంటబ్బా' అనుకొని బయటికి వెళ్ళి చూస్తే ఏముందనుకుంటున్నారు? మా ఇంటి పైన ఒక ఆవు నిల్చొని పెంకులు తినేస్తోంది! అప్పుడు మా నాన్న పైప్ ద్వారా ఆవుని కిందికి తెచ్చి, ఒక మూటలో కట్టి, సంతకి తీసుకెళ్ళి అమ్మేశాడు!" చెప్పాడు చందు. "భలే! నీ అబద్ధం కూడా నాకు నచ్చింది. ఇప్పుడు నీ వంతు, గౌరీ!" అన్నాడు మామయ్య నవ్వుతూ.

 

"అలాగే చెబుతాను- జాగ్రత్తగా వినండి మామయ్యా!" అంటూ గౌరి చెప్పడం మొదలు పెట్టింది. "ఒక రోజు నేను ఆకాశంలో ఎగురుతుండగా ఒక పేను కనిపించింది. దాన్ని పట్టుకుని నా తలలో వేసుకున్నాను. అప్పుడు అది నా జుట్టును నా కాళ్ళ వరకు వచ్చేట్లు చేసింది. ఒక్కొక్క వెంట్రుకను నాకుతూ నా జుట్టునంతా అది నల్లగా చేసేసింది. దాంతో‌నేను చాలా అందంగా తయారయ్యాను. అప్పుడు నా అందానికి మెచ్చి ఆకాశం నుండి దేవతలు ఒక తెల్ల ఏనుగుని పంపారు. దాని మీద ఎక్కి స్కూలుకు వెళ్ళాను" అంది గౌరి.

 

"మీరందరూ భలే అబద్ధాలు చెప్పారురా! మీకందరికీ‌ బహుమతులు ఇవ్వాల్సిందే!" అంటూ మామయ్య మూడు పటిక బెల్లం ముక్కలు తీసి ఒక్కొక్కరికి ఒక్కొకటి ఇస్తూ "వీటిని వదలకుండా తిన్నవాళ్ళకి అదనంగా ఒక బొమ్మ ఇస్తాను!" అన్నాడు. పిల్లలు ఆత్రంగా ముక్కలను నోట్లో పెట్టుకున్నారు. వెంటనే "ఛీ! ఇది పటిక బెల్లం కాదు" అంటూ ఊసేశారు. "ఇదేంటి మామయ్యా! పటిక బెల్లం ఇలా ఉంది? " అన్నారు. అప్పుడు మామయ్య "అది పటిక. పటిక బెల్లం కాదు. అబద్ఢాలు చెబితే దొరికేది పటిక బెల్లంలా కనిపించే చేదు పటికే. నిజాలు చెబితేనే తియ్యని పటిక బెల్లం దొరికేది." అన్నాడు. "మాకు పటిక బెల్లమే కావాలి మామయ్యా. అబద్ధాలు చెప్పంలే!" నవ్వారు పిల్లలు.

- కొత్తపల్లి.ఇన్ వారి సౌజన్యంతో


శ్రావణి వాళ్ళ తరగతిలో‌ పిల్లలందరూ పాఠాలను శ్రద్ధగా వినేవారు ఒకరు తప్ప.
Jul 19, 2018
శివ బాగా చదివేవాడు కాదు. కానీ వాడికి చదవటం అంటే చాలా ఇష్టం!
Jul 17, 2018
కొత్తపల్లిలో ఉండే రాఘవరావుకు ఒక కొడుకు, ఒక కూతురు.
Jul 16, 2018
అనగనగనగనగా ఒక అడవి. ఆ అడవిలో రకరకాల జంతువులు ఉండేవి.
Jul 14, 2018
అనగనగా ఒక అడవి, అడవి ప్రక్కనే ఒక ఊరు ఉండేవి.
Jul 13, 2018
పరమానందయ్య గారి శిష్యులు పదిమంది ఓసారి ఒక నదిని దాటారట.
Jul 11, 2018
అద్దంలో ఎవరమ్మా
Jul 10, 2018
చెల్లీ రావే! సిరిమల్లీ రావే! అడవితల్లి ఒడిలో
Jun 30, 2018
అది ఒక అందమైన సామ్రాజ్యం. ఆ దేశపు రాజయిన 'శ్రీ శ్రీ శ్రీ వెంకటా చలపతి' గారు దేవుడికి మరో రూపం.
Jun 25, 2018
అనగనగా ఒక అడవిలో సింహం ఒకటి ఉండేది.
Jun 22, 2018
TeluguOne For Your Business
About TeluguOne