Facebook Twitter
ఉగాది స్పెషల్ కవిత

ఉగాది

 

 

సంస్కృతి, సంప్ర‌దాయం సంద‌డిచేసేలా..
పసుపు, కుంకుమ ప‌ల్ల‌వి పాడిన శుభ‌వేళ‌..
ప్ర‌తి కొమ్మ పువ్వుల‌తో స్వాగ‌తమిస్తుంటే..
ప్ర‌తిపువ్వు ప‌రిమ‌ళంతో పుల‌క‌రిస్తుంటే..
తెలుగునేల వైభ‌వం వెలిగేలా..
తెలుగుభాష తియ్య‌ద‌నం తెలిసేలా..
వేకుజామునే వెన్నెల్లా వ‌చ్చేసింది ఉగాది!
తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి!

ప్ర‌తి మనసు మావిచిగురులా అల్లుకుంటే..
ప్ర‌తి చిగురు చిరునువ్వులా పూస్తుంటే..
అంతులేని ఆనందాల హేల‌..
అంద‌రి క‌ళ్ల‌ల్లో మెరిసిన‌ వేళ‌..
పొలిమేర నుంచి పూజ‌గ‌ది వరకు పండ‌గ‌తెస్తుంది!
గుడి నుంచి గుండెల వ‌ర‌కు సంబ‌ర‌మిస్తుంది!
ఊపిరికి ఉర‌కలువేసే  ఉత్సాహాన్నిస్తుంది!
ఊహ‌లకు స‌రికొత్త ఊపిరినిస్తుంది.. ఉగాది!
తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి!

వాన‌విల్లు తోర‌ణమై ఎదురొస్తుంటే..
వేయిక‌ళ్ల‌తో తెలుగులోగిళ్లు ఎదురుచూస్తుంటే..
నింగి నేరుగా నేల‌కు జారేలా..
నేల ప‌ర‌వ‌శ‌మై ప‌ల‌క‌రించేలా..
ముత్యాల‌ముగ్గుల‌కు మెరుపునిస్తుంది!
ముద్దుగుమ్మ సిగ్గుల‌కు మెరుగుదిద్దుతుంది!
పూజించే హృద‌యాన్నిహారతిలా తీసుకుంటుంది!
ప్రేమించే మార్పుని నైవేద్యంలా తిరిగిస్తుంది.. ఉగాది!
తెలుగువారి ష‌డ్రుచుల సంతోషాల సార‌ధి!

                                                           

- మ‌నోసంజీవ్‌