The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Hereditary Eye Problems
వంశపారంపర్యంగా వచ్చే కళ్ళ వ్యాధులు :-

సంగీత సహజంగానే అందమైన అమ్మాయి. ఆ అమ్మాయిని చూచుకుని వాళ్ళ మామ్మ అమితంగా ముచ్చటపడిపోతుంది. సంగీతకి చక్కని మొగుడిని తీసుకువచ్చి ముడివేయాలనే ఆ ముసలమ్మ కోరిక! అలాగే ఆమె కోర్కెకు తగ్గట్టుగానే మంచి అబ్బాయితో పెళ్ళి సంబంధం వచ్చింది. ఈ సంబంధం గురించి యథాలాపంగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టరుతో చెప్పగానే ఆ సంబంధం గురించి త్వరగా నిర్ణయం తీసుకోవద్దని సలహా ఇచ్చాడు. దానికి కారణం పెళ్ళికొడుకు తాలూకు వారి వంశంలో చాలామందికి ఒక వయస్సు వచ్చేసరికి అంధత్వం ప్రాప్తించే లక్షణం వుంది. ఆ అబ్బాయితాతకి 50 సంవత్సరాలు నిండేసరికి పూర్తిగా అంధత్వం ప్రాప్తించింది. వాళ్ళ నాన్నకి, బాబాయిలకి కూడా చీకటిపడితే కళ్ళు కనపడని పరిస్థితి ఈ మధ్యనే ప్రారంభమైంది. ఎన్ని మందులు వాడుతున్నా ఫలితం కనబడటం లేదు. ఆ లక్షణం ఈ పెళ్ళికొడుకుకి రాదని నమ్మకం ఏమిటి? అలాంటప్పుడు సంగీఅర్థాంగిగా వుండి ఆనందించ కలుగుతుందా? లేక అతనికి ఊతకర్రగా మారుతుందా? ఇటువంటి భయసందేహాలతో సంగీత తండ్రి ఆ సంబంధాన్ని వదులుకున్నాడు.

 

మరి ఇంత విషయం ఆలోచించలేని మామ్మగారు అందమైన అబ్బాయితో తన మనుమరాలు వివాహం తప్పిపోయినందుకు కారణమయిన డాక్టరుని నిందించింది. పెళ్ళికొడుకు తాలూకువారి వంశంలోని కళ్ళకు సంబంధించిన వ్యాధిని "రెటినైటిస్ పిగ్ మెన్ టోజా'' అని అంటారు. ఇది సాధారణంగా కొంతవయస్సు వచ్చిన తరువాత రేచీకటితో జబ్బు ప్రారంభమై నిదానంగా పగలు కూడా చూపు సరిగ్గా కనబడని స్థితికి చేరుకుంటుంది. అటుపిమ్మట పూర్తిగా అంధత్వం ప్రాప్తించడానికి అవకాశంవుంది. సాధారణంగా చిన్నపిల్లలలో రేచీకటి వుంటుంది. అది విటమిన్ 'ఎ' తక్కువ వలన వస్తుంది. కాని పెద్దవాళ్ళలో వచ్చే ఈ వ్యాధికి సంబంధించిన రేచీకటి కన్నుగుడ్డులోనే లోపం ప్రారంభమై వస్తుంది. "రెటినైటిస్ పిగ్ మెన్ టోజా' వంశపారంపర్యంగా వచ్చే వ్యాధి అయితే ఆ వంశంలో అందరికీ ఈ లక్షణాలు బయటపడకపోయినా కొందరికి మాత్రం ఈ వ్యాధి లక్షణాలు బయటపడవచ్చు. అదే విధంగా వంశపారంపర్యంగా వచ్చే మరొక కళ్ళవ్యాధి "లిబర్స్ డిసీజ్''. సాధారణంగా వ్యాధి లక్షణాలు ఇరవై సంవత్సరాల వయస్సు అప్పుడు బయటపడతాయి. ఈ కళ్ళవ్యాధి వున్న వంశంలో ఆడపిల్లలు సాధారణంగా ఈ వ్యాధి వలన బాధపడరు. మగపిల్లలకే ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధిలో కూడా అకస్మాత్తుగా రెండు కళ్ళ చూపు తగ్గిపోతుంది. కానీ తిరిగి నిదానంగా కొంతచూపు రావడం జేరుగుతుంది. అయితే కొన్ని రంగులని గుర్తించలేని అంధత్వం మాత్రం మిగిలిపోతుంది.