.png)
ఫోను మీద సంభాషణని పెంచలేదు రజిత. "గాయత్రీ ... నేను వచ్చేస్తున్నాను ... ఓ ముఖ్య విషయం మాట్లాడాలి'' తాను సమాధానం చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా రజిత ఫోను క్రేడిల్ చేయడంతో ఇరకాటంలో పడింది గాయత్రి. తలుపు లోపల తాళం ... ఏడ్చి ఏడ్చి తన మొహం వాచిపోయింది. ఇప్పుడెలా? అని కాలాయాపన చేయలేడు.
బాత్రూమ్ కి వెళ్ళి మొహం వాష్ చేసుకుంది. తల దువ్వి మొహానికి పౌడరు అద్దింది. చీర మార్చుకుంటూ వుండగా కనిపించాయి ఒంటి మీద బెల్టు దెబ్బలు. ఆ దెబ్బలు కనిపించకుండా భుజాల చుట్టూ కొంగు కప్పుకుంది. భారాన్ని భగవంతుడి మీద వేసి రజిత కోసం ఎదురు చూడసాగింది. గాయత్రి లోపల తాళం తీసి వుంచింది. అదే ఆమె చేసిన పొరపాటు. ఆ పొరపాటుకి ఎంత మూల్యం చెల్లించవలసి వస్తుందో ఆ క్షణాన ఆమెకి తెలియలేదు.
తాను వస్తున్నానని చెప్పినా అంతలోనే గాయత్రి తాళం పెట్టి వెళ్లినందుకు కోపం వచ్చింది రజితకి. వెనువెంటనే ఓ సందేహం కూడా కలిగింది. గాయత్రిని లోపలపెట్టి ఈ ప్రబుద్ధుడు బయట తాళం పెట్టలేదు గదా అని. అనుమానంతోనే కిటికీ దగ్గరకు వెళ్ళి పిలిచింది. ఆందోళనని, అలజడిని, ఉద్వేగాన్ని అణచి పెట్టుకుంటూ పెదవులపై నవ్వు పులుముకుని కిటికీ దగ్గరకు వచ్చింది గాయత్రి. వస్తూనే "చూశావా ... మా వారి మేథా సంపత్తి ... నేను బాత్రూమ్ లో వుండగా ఆయన నా విషయమే మర్చిపోయి లాక్ చెసుకుని వెళ్ళిపోయారు.
నేను ఎప్పుడు గుర్తుస్తానో ఆయనకీ ... చూద్దాం అనుకుంటూ వెయిట్ చేస్తున్నాను'' అన్నది. కాని అసలు విషయాన్ని రజిత కనిపెట్టేసింది. ఆ పెదవులపై నిర్జీవమైన నవ్వుని సరిగ్గానే అంచనా వేసింది. ఇంట్లో ఎవరూ లేనప్పుడు కూడా భుజాల నిండా కప్పుకున్న పవిట రజిత అనుమానాన్ని బలపరిచింది. "గాయత్రీ ... నేను పసిపాపను కాను, నీవు చెప్పినదల్లా వినడానికి, నమ్మడానికి. జయంత్ సంతకం చేసిన ప్రతి కాగితం నా దగ్గరకు వస్తుంది. ప్రతి కాగితం ఆయన మానసిక స్థితిని తెలియజేస్తుంది.
నన్ను వంచించడానికి ప్రయత్నించకు.'' భళ్ళున బద్దలయింది .... గాయత్రి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ఆ తర్వాత మానసికంగా బలహీనురాలయిన గాయత్రి వంటి వ్యక్తి నుంచి రజితకు కావలసిన సమాచారం సేకరించడానికి ఎక్కువసేపు పట్టలేదు. చదువుకున్నది, ఉద్యోగాస్తురాలు, ప్రేమించి పెళ్ళి చేసుకున్న వ్యక్తిని శంకించి భర్త తలుపు తాళం పెట్టి వెళ్ళాడు. బెల్టుతో భార్యని గొడ్డుని బాదినట్టు బాదాడు. ఈ రెండు విషయాల్ని జీర్ణించుకాలేకపోయింది రజిత.
"ఛీ ... రాస్కెల్ ... వీణ్ణి ఎట్టి పరిస్థితిలోనూ జైలుకు పంపాల్సిందే ...'' అన్నది ఆవేశంగా. రజిత ఆవేశాన్ని చూసి నవ్వుకుంది గాయత్రి "జైలుకి పంపి?'' అని అడిగింది. "మరొక మగాడు ఆ పని చేయకుండా బుద్ధి చెబుదాం'' "దానివలన నా కాపురం నిలబడుతుందా? మరొక మగవాడు తన భార్యని హింసించడం మానతాడా?'' త్రుళ్ళిపడింది రజిత గాయత్రి ప్రశ్నలకు.
"అంటే ... అంటే పశువులా నిన్ను బాధించిన ఆ పశువుతో ఇంకా కాపురం చేయాలనే అనుకుంటున్నావా?'' "రజితా! చెయ్యి చేసుకున్న ప్రతి మగవాడికి అతడి ఇల్లాలు డైవోర్స్ ఇస్తే ఈ రోజున ఈ దేశంలో పెళ్ళయిన వారిలో సగం మంది కోర్టుకి వెళ్ళవలసి వుండేది విడాకుల కోసం'' "అదే మంచిదేమో ...'' "పోరాబడుతున్నావు రజితా ... మన నుదుట మీద ఎలా రాసివుంటే అలా జరుగుతుంది ...''
"కర్మ సిద్ధనటం ... అమాయకులు, పిరికివాళ్ళు, పలాయన వాదులు అనుసరించే మార్గం ...'
' "నేనూ వారిలో ఒకర్ని అనుకో ...''
"అలా జరగడానికి వీల్లేదు.... నీ వయసెంత? నీకు పెళ్ళయి ఎంతకాలమయింది? నీ జీవితంలో ఓ దుర్ఘటన జయంత్ ని మర్చిపో'' "రజితా ... నేను భారతీయురాలని ... అందునా హైదంవ స్త్రీని. ఒంటిమీద చీరని మార్చినట్టు తాళిబొట్టుని మార్చలేను ...'' "లేదు గాయత్రీ ... జయంత్ ఒక సైకో, అతని వద్ద నీకు రక్షణ లేదు. నీవు చదువుకున్నదానివి, ఉద్యోగం చేసినదానివి. నీ బ్రతుకు నీవు బ్రతకగాలవు, నీ వ్యక్తిత్వాన్ని నీవు నిలుపుకోగలవు ...''
"కావచ్చు, కానీ నేనూ ఓ ఆడదాన్నే ... భర్త నుంచి విడిపోయిన భార్యకు ఈ సమాజంలో రక్షణ లేదు. వారు విసిరే సూటిపోటీ మాటల్ని నేను భరించలేను. చావయినా బ్రతుకయినా అతడితోటిదే నా జీవితం'' రజితకు అర్థమయింది గాయత్రి మానసిక స్థితి. తాను వత్తిడి చేసిన కొద్దీ గాయత్రి తన అభిప్రాయాలకు కట్టుబడి వుండటం మినహా ప్రయోజనం వుండదని కూడా అర్థమయింది.
ఈ సమస్య పరిష్కారానికి మరో మార్గం ఎన్నుకుంది. గాయత్రి బలహీనత మీద సవారీ చేయసాగింది. "గాయత్రీ ... నీవు ఇంట్లో ఒంటరిగా వుండటం వలన జయంత్ కి ఇన్ని అనుమానాలు వస్తున్నాయి. అదే ఆఫీసులో, నీ భర్తకి ఎదురుగా వుంటే నిన్ను అనుమానించడేమో'' ఈ ఆలోచన గాయత్రికి బాగా నచ్చింది. అంతలోనే మరో అనుమానం ... జయంత్ పని చేస్తున్న ఆఫీసులోనే తాను క్లర్క్ గా జయంత్ అందుకు అంగీకరిస్తాడా?
|
|


