.png)
"ఎవరు నువ్వు?'' అతడి మాటలు ముద్దుగా, అస్పష్టంగా వెలువడుతున్నాయి. ఆమె సమాధానం ఇచ్చేలోపునే "ఇప్పుడు నేను ఎక్కడ వున్నాను'' అని అడిగాడు.
"హాస్పిటల్ కి వచ్చాం ... మీరు కళ్ళు తిరిగి పడిపోయారు''
'అలాగా ...'' అన్నట్టుగా తలూపి మళ్ళీ నిద్రలోకి జారుకున్నట్టుగా కళ్ళు మూసుకున్నాడు.
"కొద్దిసేపు ఇలాగే మత్తులో వుంటారు ... మెడిసిన్స్ రాసిస్తాను మళ్ళీ వచ్చేవారం షాక్ కి తీసుకురండి ... ఈ వేళ వాంతులయితే కంగారు పడకండి'' అంటూ ప్రిస్కిప్షన్ ప్యాడ్ తీసుకున్నాడు డాక్టర్ అభినయ్.
అంతలో బయట పని ముగించుకుని ఆటోలో వచ్చింది రజిత. ఓ పసిపిల్లవాడిలా తన భారాన్నంతా గాయత్రిపై మోపి తడబడే అడుగులతో, మూతబడుతున్న రెప్పలతో ఆతోవైపు నడుస్తున్నాడు జయంత్.
****
కాలచక్రంలో ఓ ఆరు నెలలు గడిచిపోయాయి. ఆ ఇంటి గోడకి ఓ బోర్డు పిన్ చేసి వుంది. ఆ నీలిరంగు బోర్డు మీద 'గాయత్రీ షేర్ కన్సల్టెన్సీ' అన్న తెల్లటి అక్షరాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఇంటి వరండాలో గోద్రెజ్ కుర్చీలు వున్నాయి. ఆ వరండా జనంతో నిండివుంది. ఇప్పుడు జయంత్ కి ఉద్యోగం లేదు. కాని తెలివితేటలూ వున్న వాడికి డబ్బు సంపాదించడానికి ఉద్యోగమే చేయనవసరం లేదు. ఇప్పుడతను గాయత్రి పేరు మీద షేర్ కన్సల్టెన్సీ ప్రారంభించాడు.
అతడు ఇచ్చే టిప్స్ అమోఘం, అతడు చెప్పిన షేర్స్ వాల్యూ రెట్లు పెరుగుతున్నాయి. అతడి సలహా పాటించినవారు ఆర్థికంగా బలపడుతున్నారు. అందుకే అక్కడ అంతమంది చేరింది. అయితే అక్కడున్న వారంతా షేర్ ఇంవేష్టర్లు కాదు; గాయత్రి తండ్రి వద్ద జాతకం రాయించుకోవడానికి మొహూర్తాలు పెట్టించుకోవడానికి, శాంతి పూజలు చేయించుకోవడానికి వచ్చిన వారు కూడా వున్నారు.
"హమ్మయ్య ... ఇప్పుడు మళ్ళీ ఖాళీ అయ్యారు, రండి టిఫిన్ చేద్దురుగాని'' అని తండ్రిని, భర్తని పిలిచింది గాయత్రి.
"అల్లుడుగారూ ... రోజూ మన ఇంటికి వచ్చేవారిలో నా కోసం ఎక్కువమంది వస్తున్నారా? మీ కోసమా?'' చేతులు శుభ్రం చేసుకుంటూ జయంత్ ని ఉద్దేశించి అడిగాడాయన.
"మావయ్యగారూ ... మీరు చూడవలసింది పుట్టిన తేదీలు, నక్షత్రాలు, గ్రహాల స్థితి కాదు. ఆ వ్యక్తి తల్లిదండ్రులు పెరిగిన పరిసరాలు, పెరిగిన వాతావరణం, చిన్నతనం నుంచీ అతడి మానసిక వత్తిడి, అతడి కుటుంబ పరిస్థితి, వారసత్వంగా వచ్చిన జబ్బులు ఏమైనా వున్నాయా అనేవి చూడాలి. ప్రత్యేకించి పెళ్ళి సమయంలో ... లేకుంటే నావంటి వాడే అల్లుడుగా దొరికే ప్రమాదం వుంది'' నవ్వుతూ అన్నాడు జయంత్.
కాని ఆ ఆడపిల్ల తండ్రి అతడితో నవ్వు కలపలేక పోయడు.
------ అయిపొయింది -------
|
|


