.png)
"డాక్టరుగారూ, మీకు చేతులెత్తి నమస్కరిస్తాను. నాకు నా ప్రాణంకన్నా నా పిల్లల భవిష్యత్తు ఎక్కువ. మా కలతలవల్ల, అపార్థాలవల్ల, అనుమాన రోగంవల్ల నా పిల్లల చదువు ... నా పిల్లల భవిష్యత్తు నాశనం అయ్యే ప్రమాదం వుంది డాక్టర్ ... నాడి అనుమానపు రోగమని నాకు తెలుసు. ఈ రోగం ముదిరిన కొద్దీ అనుమానం నిజంగా కనిపిస్తోంది ...
అందుకు తగిన సాక్ష్యాధారాలు కూడా నాకు కనిపిస్తున్నాయి. ఆ యావ మినహా మరో విషయం స్ఫురణకు రావడం లేదు. ఈ పిచ్చి ముదరక మునుపే నాకు ట్రీట్ మెంట్ ఇవ్వండి డాక్టర్ గారూ ... నాకు తెలుసు ... నాకు 'పారనాయిడ్' అని. ఈ పారనాయిడ్ పేషెంట్స్ అందరికీ అనుమానపు రోగం ... అనుమానం నిజంలా కనిపిస్తుంది. నిజమని నమ్మిస్తుంది. తొందరగా ట్రీట్ మెంట్ తీసుకోకపోతే నా పిచ్చి ముదురుతుంది ...
భార్యాభర్తల మధ్య అపార్థాలు, సంసారం చిన్నాభిన్నమవుతుంది ... నా బిడ్డలా భవిష్యత్తు నాశనమవుతుంది. అది నేను భరించలేను డాక్టరుగారూ .... వెంటనే నీకు ట్రీట్ మెంట్ ప్రారంభించండి ... నేను పారనాయిడ్ అయినందునే నాకు నా భార్య శీలంమీద అనుమానం వస్తూంది ... నా అనుమానం నిజంగా కనిపిస్తూంది ... మీకు తెలియదు డాక్టరుగారూ, మాకు పాలుపోసే కుర్రవాడి వయస్సు మా అబ్బాయి వయసంత వుంటుంది. కాని వాడికీ మా ఆవిడకీ సంబంధం వుందని నా అనుమానం ...
అలాగే మా ఇంటికి చీరలు తెచ్చేవాడి వయస్సు మా మామగారి వయసంతా వుంటుంది. కాని అతడికీ మా ఆవిడకీ సంబంధం వుందని నేను నమ్ముతున్నాను. ఓ వైపు కొడుకు వయసున్న వాడితో, మరోవైపు తండ్రి వయసున్న వాడితో నా భార్యకు సంబంధం వుందని నేను నమ్ముతున్నాను. ఇది పారనాయిడ్ లక్షణం డాక్టర్ ... నాకు వెంటనే ట్రీట్ మెంట్ ప్రారంభించండి. అవసరమయితే కరెంటు షాక్ ఇవ్వండి ...'' అని ప్రాధేయపడుతున్న ఆ లారీడ్రైవర్ని ఉద్దేశించి డాక్టర్ అభినయ్ అడిగిన ప్రశ్న ...
"మీరేం చదువుకున్నారు?'' అని.
"తెలుగు చదవనూ, రాయనూ వచ్చు కానీ డ్యూటీ ఎక్కినా తర్వాత మధ్యలో బండి ఆపుకున్నప్పుడు లోకల్ డ్రైవర్ కి బండి ఇచ్చినప్పుడు ఏదో ఒక పత్రిక చదువుతూ కాలక్షేపం చేస్తాను ... మా ఆవిడ అనుమానపడుతున్నట్లు నేను ఏ సరదా తీర్చుకోను ...''
డోరు దగ్గర నిల్చుని వారి సంభాషణ అంతా వింటున్న గాయత్రి పూర్తిగా మెల్ట్ అయిపొయింది. 'మగవాళ్ళలో ప్రత్యేకించి భర్తలలో కూడా ఇటువంటివారు వుంటారా? దేవుడు అంటే గుళ్ళోని రాతి విగ్రహాలు కాదు ... ఇతడే, ఇలాంటి భర్తలే' అనుకున్నది. వెళ్ళి అతడి కాళ్ళమీద పడాలి అన్న కోరికను బలవంతాన అణచుకుంది.
గుమ్మం దగ్గర ఏదో అలికిడయినట్లుంది, దృష్టి ప్రక్కకు మరల్చిన అభినయ్ గాయత్రిని చూసి "స్పృహలోకి వచ్చారా?'' అని,
"జస్ట్ ఏ మినిట్ ...'' లారీ డ్రైవర్ని ఉద్దేశించి అంటూ జయంత్ వైపు దారి తీశాడు. అప్పుడే జయంత్ స్పృహలోకి వస్తున్నాడు. "మీరు ఏమీ జరగనట్లే మాట్లాడండి. ఆయనకీ జ్ఞాపకశక్తి తగ్గించడానికి ... ఎక్కువసేపు మత్తులో వుండటానికి ... మానసికంగా పూర్తి విశ్రాంతి ఇవ్వడానికీ, వ్యాధి కుదరడానికే ఈ మందులు, కరెంట్ షాక్ ...''
స్పృహలోకి వచ్చిన జయంత్ గాయత్రిని ఉద్దేశించి అడిగిన మొదటి ప్రశ్న ....
|
|


