.png)
"ఏమో ఈ ఆడవాళ్ళు కొన్ని రోజులు నిద్రలేస్తూనే తలారాస్నానం చేస్తారు. అలాగే ఇప్పుడు పూటకి రెండుసార్లు చేస్తారు కాబోలు..." అని సర్దిచెప్పుకున్నాడు. సరసి స్నానం ముగించేవరకు ఎదురుచూశాడు. సరసి స్నానానికి వెళ్ళేముందే రెండు డ్రమ్ముల నీళ్ళు పోసింది. అప్పుడే ఒక డ్రమ్ము ఖాళీ అయింది. ఎలా? అనుకొంటూ రెండు చెంబులతో మొహం, కాళ్ళు, చేతులు కడుక్కొని బయటపడ్డాడు.
ఆఫీసుకి వెళ్ళడానికి డ్రస్ మార్చుకుంటున్న సరసిని చూశాడు. "ఆఫీసు వేళయింది కాబోలు" అనుకుంటూ వెళ్ళి చకచకా ముస్తాబు కాశాగాడు. తన ముస్తాబు ముగించుకుని ఆఫీసుకి వెళ్ళడానికి బయటకు వచ్చిన ఆంజనేయులు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి మ్రాన్పడిపోయాడు సరసి మరో మారు స్నానానికి సిద్ధమయింది.
"ఏమిటి...ఏమిటది...ఇప్పుడేగా స్నానం చేశావ్?" తన మాటలు తల్లికి వినిపిస్తే సరసికి గాలి సోకిందని ఆమె ఎక్కడ కన్ ఫర్మ్ చేస్తుందో అన్న ఆందోళనతో గుసగుసలాడాడు ఆంజనేయులు.
"చూడండి... నాదగ్గర ఎంత్ చెమట వాసన వస్తుందో, నా ఆశుభ్రత వలెనే నా బిడ్డ నాకు దక్కకుండాపోయాడు" అని కళ్ళొత్తుకుంటూ స్నానాల గదిలోకి వెళ్ళింది సరసి.
ఆ దృశ్యాన్ని చూసిన ఆంజనేయులు అర్జంటుగా ఓ నిర్ణయానికి వచ్చాడు గర్భం పోవడంతో సరసికి మతిస్థిమితం తప్పి వుండాలి. లేదా అమ్మ చెప్పినట్లు 'గాలి' సోకి వుండాలి. సరసికి మతిస్థిమితం తప్పిందా? లేక గాలి సోకిందా? ఏదో ఒక నిర్ణయానికి వెంటనే రాలేకపోయాడు. సరిగ్గా అప్పుడే మరో విషయం కూడా గుర్తొచ్చింది ఆంజనేయులుకి. గతంలో కూడా సరసికి అకారణంగా చిర్రుబుర్రు లాడేది; ఇంట్లోని అద్దం పగులగొట్టింది. తనని దగ్గరకి రానిచ్చేది కాదు. అంతలోనే ఏం జరిగేదో వారం తిరగక మునుపే ప్రేమ కురిపించేది: ఇప్పుడు ఇలా సరసిలో ఏదో లోపం వుందన్నది స్పష్టం. అయితే అది మానసికమైన జబ్బా? లేక గాలి సోకిందా?
మానసికమైన జబ్బు అయితే వైద్యుడిని సంప్రదించాలి. గాలి అయితే భూత వైద్యుడ్ని సంప్రదించాలి. ఇద్దరూ వైద్యులే. ఇద్దరిలో ఏ వైద్యుడ్ని సంప్రదించాలి? అన్నదే ఇప్పుడు అతడి ముందున్న సమస్య. ఈ విషయమై వెంటనే ఓ నిర్ణయానికి రాలేకపోయాడు. ఆఫీసులో కూర్చున్నప్పుడు సరసికి తెలియకుండా టాస్ వేసుకున్నాడు. టాస్ వేయబోయే ముందు దేవునికి దండం పెట్టుకున్నాడు.
తక్కువ ఫీజులో పోయే వైద్యుడ్ని సంప్రదించేలా చేయమని. హెడ్ పడితే రిజిష్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనరు. టెయిల్ పడితే భూత వైద్యుడు. టాస్ వేశాడు. హెడ్ పడింది. సాయంత్రం డాక్టర్ని చూడాలి. అనుకున్నాడు ఆంజనేయులు. ఆఫీసులో కూడా గంటకి నాలుగుసార్లు బాత్రూమ్ కి వెళ్ళి సోపుతో చేతులు వాష్ చేసుకుంటూనే వుంది సరసి. ఆమె కుర్చీ, టేబుల్ ని కూడా శుభ్రంగా వుంచుతోంది. ఒకటికి నాలుగుసార్లు దులుపుతోంది. * * *
|
|


