ఎక్కడో వర్షం పడ్డట్టు గాలి చల్లగా వీస్తోంది. అప్పటివరకు నిప్పులు చెరిగిన సూర్యుడు శాపవశాత్తు చల్లబడిపోయినట్టు పడమటి కొండల్లోకి దిగిపోయాడు. పక్షులన్నీ తిరుగు ప్రయాణం చేస్తూ ఆకాశంలోని గీతలు కదిలినట్టు వెళుతున్నాయి. చెట్లయితే అప్పుడే నిద్రకు ఉపక్రమిస్తున్నట్టు అలికిడైనా చేయడంలేదు. చింతామణి, గంగారత్నం ఎంతసేపూ శశిరేఖను హుషారుపరచడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఆమె ఏమీ మాట్లాడకుండా మౌనంగా వుంటూవుంటే వాళ్లిద్దరికి గుండెలు అవిసిపోతున్నాయి.
“వాతావరణం బావుంది. కాఫీ తాగుదామమ్మా” చిన్నపిల్లను అడిగినట్టు అడిగి – “ఒక్క నిముషంలో కాఫీతో రెడీ” అని చింతామణి లోపలికెళ్లింది.
“ఇదిగోమ్మా మల్లెపూలు – తలలో పెట్టుకో. దీని వాసన వెయ్యి యోజనాలు సోకి మన సురేష్ బాబు ఎక్కడున్నా వచ్చేస్తాడేమో చూద్దాం” గంగారత్నం అంతవరకు కట్టిన మల్లెపూల దండను ఆమె చేతికిచ్చింది.
అంతలోనే ఏదో గుర్తొచ్చినట్టు - “ముందు వెళ్ళి ముఖం కడుక్కుని రామ్మా” అంటూ శశిరేఖ చేతిలోంచి మల్లెపూల దండను తిరిగి తీసుకుంది.
శశిరేఖ మౌనంగా లేచివెళ్లి ముఖం కడుక్కొచ్చింది. ఆమె ముఖమే కాకుండా, తన విషాదాన్నంతా కడిగేసుకుని వచ్చినట్లు ప్రెష్ గా వుంది. బాగా వర్షం కురిశాక ఆకాశం నిర్మలమయిపోయినట్లుగా కనిపిస్తోంది. గంగారత్నం ఇచ్చిన మల్లెపూల దండను తలలో పెట్టుకుంది. ఆమెను ఆమె ఆలోచనలకు దండను ఇష్టంలేక, గంగారత్నం ఆమెతో ఏమిటేమిటో మాట్లాడుతోంది. అంతలో చింతామణి మూడు గ్లాసుల కాఫీతో వచ్చింది. ముగ్గురూ కాఫీ తాగుతూ మాటల్లోపడ్డారు.
“ఎందుకనో తెలియదుగాని ఈ రోజు సురేష్ బాబు వచ్చేస్తాడని నాకు అనిపిస్తోంది” చింతామణి శశిరేఖకు హుషారు కల్పించడానికి అట్లా చెప్పింది.
“నీ మాట నిజం అయ్యేటట్టుంది. ఎవరో వస్తున్నారు చూడు. ….” ఎవరో వస్తున్నట్టు మాటలు, శబ్దాలు వినిపించడంతో గంగారత్నం అడిగింది.
చింతామణి ఆ మాటతో పైకిలేచి రెండు అడుగులు ముందుకేసి, చెట్లను తప్పించుకుని చూసింది. ఆమె మనసు ఏదో కీడును శంకించింది. ఊరు వూరంతా కదిలివస్తున్నట్టు జనం దూసుకొస్తున్నారు. ఆమె హడావుడిగా పరిగెత్తి “గంగా… ఊర్లోవాళ్ళంతా ఎందుకో మరి ఇటేవస్తున్నారు” అని చెప్పింది.
“జనమా…..!” గంగారత్నం అన్నివైపులనుంచి ఆలోచిస్తోంది. అంతలో జనం వచ్చి మామిడితోపుమీద పడ్డారు. అది మామిడి కాయల సీజన్ కాదుకాబట్టి కంచె బలంగాలేదు. అక్కడక్కడా వూడిపోయి, జనం దాటేందుకు అనువుగా వుంది. అంతమంది మెయిన్ ఎంట్రన్స్ లో పట్టరుగనుక, దారివున్న దగ్గరంతా జనం దూరిపోయారు. అంతమంది ఏదేదో మాట్లాడుకుంటూ వస్తుండడంతో గందరగోళంగా ఉద్రిక్తతగా వుంది. అంత తమ ఆశ్రమానికే వస్తున్నట్లు పసిగట్టడంతో చింతామణి, గంగారత్నం క్షణంలో సర్దుకున్నారు.
విషయం ఏదయినా ధైర్యంగా ఎదుర్కోవాలనుకున్నారు. ఇప్పుడు ముందువరసలో ఉన్నవారు స్పష్టంగా కనిపిస్తున్నారు. గోపాలరావు, రామచంద్రరాజు, చిన్నారెడ్డి, భాస్కరరెడ్డి, నరసింహులు, గురవయ్యా, దాసు, బాబు ఇంకా చాలామంది వున్నారు. ఆడవాళ్ళలో కాంచనమాల, ఉమ, మానస వున్నారు. వాళ్లు వచ్చిన విషయం ఏమిటో వూహించలేకపోతున్నారు గంగారత్నం, చింతామణి.
“అంతా వచ్చి ఆశ్రమం ముందు నిలబడ్డారు. గేటుబయట జనం, గేటులోపల చింతామణి, గంగారత్నంలు నిలబడ్డారు. వాళ్ళ వెనుక దూరంగా శశిరేఖ వుంది. ” ఏమిటి మీరు చేస్తున్న పని? ఆమెను ఇక్కడ వుంచుకోవడం దారుణం. మొగుడ్ని వదిలిపెట్టేసి వచ్చేసిన ఓ స్త్రీకి మీరు ఆశ్రయం కల్పిస్తారా?” రామచంద్రరాజు మొదటి విషయం ఎత్తాడు.
అప్పటికి అర్దమైంది జనం ఎందుకొచ్చారో.
|
|

