The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 113

ఇక ఏం చేయాలో ఆయన చకచకా ఆలోచిస్తున్నాడు. ఇనుము బాగా కాళింది. ఆలస్యం చేయకుండా సాగ్గోట్టాలి. అందుకు ఆయన ఎప్పుడో ప్రిపేర్ అయిపోయాడు. ఇక కార్యంలోకి దిగడమే

. "ఎందుకు వూరుకోవాలి? గ్రామంకోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధమే. ప్రాణాలు తీయదానికైనా సిద్ధమే'' ఆయన స్థిరంగా అన్నాడు.

"మరి ఎందుకూరుకుంటారు? పిలిచి పంచాయితీ పెట్టించండి. రూపని, గంగాధరాన్ని ఎక్కడికి పంపిందో కనుక్కోండి'' రాఘవరాజు అన్నాడు.

"పంచాయితీలకు లొంగే రకంగాదు అది. దాన్ని బుజ్జగించో, బతిమిలాడితేనో లాభం వుండదు. దెబ్బకు దెయ్యం దిగేది'' అన్నాడు భూపతిరెడ్డి.

"మరి ఏం చేయాలంటారు?'' అన్నారెవరో.

"సమయం రానివ్వండి'' అని భూపతిరెడ్డి లేచాడు. ఆయన లేవటంతో మిగిలినవాళ్ళు కూడా లేచారు. అందరూ తమతమ ఇళ్లకు బయల్దేరారు. భూపతిరెడ్డి, దామాచారి మాత్రం సెపరేట్ గా నడవడం మొదలుపెట్టారు.

"ఇక ఆలస్యం చేయడం అనవసరం'' భూపతిరెడ్డి ఆలోచనల్లోంచి మాట్లాడుతున్నట్టే అన్నాడు.

"అదే నాకూ అనిపిస్తోంది'' అన్నాడు దామాచారి.

"మరి ఈ రాత్రికే మిగిలిన పని పూర్తీ చేసేయ్''

"అలాగే'' దామాచారి ఒప్పుకున్నాడు.

భూపతిరెడ్డి ఆయన ఇంటిదగ్గర దింపి దామాచారి తన ఇంటికి వెళ్లాడు. భోజనం చేసి బయట మంచం వేసుకుని పడుకున్నాడు. నిద్రోస్తున్నా బలవంతంగా అణచుకున్నాడు. చేయాల్సిన ముఖ్యమైన పని ఒకటుంది మరి. అర్థరాత్రి దాటిందనిపించాక అతను బయల్దేరాడు. వీథిలో కాక పొలాల్లోంచి నడుస్తున్నాడు. ఆకాశంలో చంద్రవంక మనిషి శవాన్ని తీసుకెళ్ళడానికి పూలతో అలంకరించిన రథంలా వుంది.

శవం వెనుక నాణేలను చల్లినట్టు నక్షత్రాలు మసగ్గా వెలుగుతున్నాయి. శ్మశానంలొ కాలుతున్న చితుల్లోంచి లేస్తున్న పొగలాగా మబ్బులు గుబురుగా వున్నాయి. శవాదహనం తరువాత చన్నీటి స్నానం చేసివచ్చినట్టు గాలి చల్లగా తగుల్తోంది. దొడ్డిదారిగుండా ఓ ఇంటి ఆవరణలోకి ప్రవేశించాడు దామాచారి. పశువుల దొడ్డిలో దాదాపు పది గేదెలదాకా వున్నాయి. రెండు ఎద్దులు వాటికి కాస్తంత దూరంలో వున్నా కొట్టాంలొ వున్నాయి. పశువులు నీళ్ళు తాగడానికి కట్టిన కుడితితొట్టె దగ్గరికి వెళ్లాడు. అటూ ఇటూ చూశాడు.

తనను ఎవరూ గమనించడంలేదన్న నిర్థారణకొచ్చాక బొడ్లో దోపుకుని వచ్చిన పెద్ద మాత్రల సీసా నొకదాన్ని బయటికిలాగి, కొన్ని మాత్రల్ని చేతుల్లోకి ఒంపుకుని కుడితినీళ్ళలో కలిపాడు. మాత్రల్ని అందులో వేశాక అక్కణ్నుంచి కదిలాడు. దొడ్డిదారిగుండా మరో ఇంటి పశువుల పాకలొకి వెళ్లాడు. అక్కడ కుడితినీళ్ళల్లో మాత్రలు వేశాక ఇంకో ఇంటికి వెళ్లాడు. అలా రెండు వీథుల్లోనూ పశువులు ఎక్కువగా వుండే ఇళ్ళల్లోకి ప్రవేశించి నెలల్లో మాత్రలు కలిపాడు. పనంతా పూర్తయ్యాక భూపతిరెడ్డి ఇంటికి వెళ్లాడు.

ఆయన పడక గది దగ్గరికి వెళ్ళి కిటికీ తలపులమీద మెల్లగా కొట్టాడు. అతని కోసమే చూస్తున్న భూపతిరెడ్డి కిటికీ దగ్గరికి వచ్చాడు. "పని అయిపోయిందా?'' అంటూ చిన్నగా అడిగాడు ఆయన.

అయిపోయినట్టే దామాచారి తలాడించాడు.

"అంటే రేపటినుంచి ఆ కుడితినీళ్ళు తాగిన పశువులు చచ్చిపోవడం మొదలవుతుంది ఇక అప్పటినుంచి చంద్రరేఖకు తుడిఘడియలు ప్రారంభమవుతాయి'' ఆయన గుబురు మీదాల్లో ఓ భయంకరమైన నవ్వు మొరిసి మాయమైంది.

"అంతే ... అంతే ...''

"ఇక నువ్వు వెళ్ళు''

దామాచారి అక్కణ్నుంచి ఇంటికి బయల్దేరాడు. అయితే వాళ్ళు ఊహించినట్టుగా రెండో రోజు నుండి కాదు గానీ మూడోరోజు నుంచి ఆ ఊర్లో పశువుల చావులు మొదలయ్యాయి. చేలల్లో కసుపు మేస్తున్న ఓ ఆవు తుపాకిగుండు తగిలినట్టు కిందపడి గిలగిలా కొట్టుకుని చనిపోయింది. మరొకటి ఎట్లో నీళ్ళు తాగుతూ నీళ్ళలోంచి బయటపడ్డ చేపపిల్లలా గింజుజుకుని ప్రాణం వదిలేసింది. ఇలా ఆవులు, గేదెలు చచ్చిపోతుంటే జనం తమ స్వంత బిడ్డలు మరనిస్తున్నట్లు విలవిల్లాడారు. ఏవో మంత్రాలు వేయించారు. దిష్టులు తీశారు. వెటర్నరీ డాక్టర్లను పిలుచుకువచ్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. పశువులు చచ్చిపోతూనే వున్నాయి.

ఎవరికీ ఏం చేయాలో తోచడం లేదు. ప్రతి ఒక్కర్లోనూ పశువులను పోగొట్టుకున్నామనం బాధ వికృతంగా కనిపిస్తోంది. ఇక ఈ సమస్యని ఎలా పరిష్కరించాలో తెలియక వూర్లోని రైతులంతా తమ పెద్ద దిక్కైన భూపతిరెడ్డి శరణుజొచ్చారు. "మీరేం చేస్తారో ఏమిటో మాకు తెలియదు. మాకింత బువ్వపెడుతున్న పశువుల్ని మాత్రం రక్షించండి'' అని చేతులెత్తి వేడుకున్నారు.