The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 111

ఆ ఇద్దరూ కలుసుకున్నారు. అంత చీకట్లో రూప ఎలా ఫీలవుతుందో చూడాలని పించింది. భయం, సిగ్గు, నరకం నుండి వెళ్ళిపోతున్న ఆనందం అన్నీ చీకట్లో రేఖా మాత్రంగా కనిపించాయి. వచ్చినందుకు కృతజ్ఞతతోనూ, ఆనందంతోనూ చూశాడు. "ఎంతసేపైంది వచ్చి?'' అడిగింది చంద్రరేఖ, ముగ్గురూ నడుస్తూ మాటల్లో పడ్డారు.

"ఓ పది నిముషాలయింది ఆంటీ''

"మాకు కొద్దిగా ఆలస్యం అయింది. నువ్వొచ్చి వెళ్లిపోతావనుకుని భయపడ్డాను''

"ఎందుకు వెళ్ళిపోతానాంటీ సంవత్సరాలయినా ఇలానే మీకోసం చూసేవాడ్ని''

ఆ సమాధానానికి చంద్రరేఖ సంతోషించింది. రూప అంటే ఎంత ఇష్టమో ఆమెకి అర్థమైంది. ఇక భయపడవలసింది ఏమీలేదనిపించింది. రూప, గంగాధరం చక్కగా జీవిస్తారనిపించి సగం టెన్షన్ తగ్గింది. ముగ్గురూ బస్టాండ్ చేరుకున్నారు. షెల్టర్ లో వున్న సిమెంట్ చప్టామీద అటువైపు రూపనూ, ఇటువైపు గంగాధరాన్ని కూర్చోపెట్టుకుంది చంద్రరేఖ.

"ఇంతకాలం మీ జీవితాలు ఎలా గడిచాయో మీకు తెలుసు. కొన్ని పొరబాట్లు, మరికొన్ని గ్రహపాట్లు తపప్లేదు. వాటిల్లో మీ తప్పు లేకపోవచ్చు. పరిస్థితులవల్ల కావచ్చు. మీ అజ్ఞానంవల్ల కావచ్చు. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా గతంలోంచి మీ అనుభవాలు దృష్టిలో పెట్టుకుని, అలాంటి పొరపాట్లు జరకకుండా భవిష్యత్తును సుఖమయం చేసుకోవడమే'' చంద్రరేఖ ఆగి ఇద్దరివైపు చూసి తిరిగి ప్రారంభించింది.

"మీరేమీ తప్పు చేయడంలేదు. జరిగిన తప్పుల్ని సరిదిద్దుకుని కొత్త జీవితాన్ని ప్రారంభించబోతున్నారు. అంటే నీతినియమాలుగాని, సంఘం కట్టుబాట్లుగానీ ఇవన్నీ మనం సుఖంగా వుండడానికి ఏర్పాటు చేసుకున్నవే. అవే కట్టుబాట్లువల్ల, నీతినియమాలవల్ల మనకు కష్టం కలిగినప్పుడు వాటిని ఛేదించుకుని బయటపడాలి. ఇందుకోసం ఎవరికీ భయపడనక్కర్లేదు''

వాళ్ళిద్దరూ శ్రద్దగా వింటున్నారు.

"సుఖంగా కాపురం చేసుకుంటున్న ఏ స్త్రీని నేను లేచిపోమ్మని చెప్పడంలేదు. సంసారంలో ఏ అపశృతో వినిపిస్తే దాన్ని సరిచేసుకొమ్మని చెబుతున్నానంతే. మీరు పొరబాటు చేస్తున్నారో, పాపం మూటకట్టుకుంటున్నారో ఫీల్ కాకండి. మీ సుఖమయ జీవితానికి అదే బేస్. ఆ తరువాత మీరిద్దరూ ఎంత హేపీగా వుండచ్చో అది మీ చేతుల్లోనే వుంది. కాబట్టి ఒకరికొకరు అన్నట్లు హాయిగా వుండండి. స్త్రీ పురుషుల మధ్య వుండాల్సింది ప్రేమ ఒక్కటే అని నేను అనను. అయితే అది వున్నప్పుడే సెక్స్ లాంటిది అద్భుతంగా వుంటుంది.

పడకలో శరీరాలకంటే ముందు మనసులు సుఖపడాలి. ఇక కష్టాలూ, కన్నీళ్ళు మామూలే. ఇప్పుడున్న వ్యవస్థలో ఏ ఒక్క వ్యకి సుఖంగా వుండలేడు. ఓ మిషన్ లా ఒక చిన్న పొరబాటు వుందనుకోండి. ధైర్యం, మంచితనం అవి రెండే మిమ్మల్ని ఎప్పుడూ రక్షిస్తూ వుంటాయి. అప్రయత్నంగా గంగాధరం, రూపలిద్దరూ చంద్రరేఖ చేతులు చేరోపక్క పట్టుకున్నారు వారికి ఆమెమీదున్న అభిమానం చాటుకోవడానికి.

వాళ్ళిద్దరివైపు చూసి "ఇదిగోండి అయిదువేల రూపాయలు, ఇక్కణ్నుంచి ఒంగోలు వెళ్ళండి. అక్కణ్నుంచి పొదిలికి చేరుకోండి.ఆ ఊర్లో నాకు తెలిసిన ఓ లాయర్ వున్నారు. ఆయన పేరు కృష్ణ. తాను చదివిన 'లా'పీడుతుల కోసమే అని నమ్మిన వ్యక్తీ. ఆయనకీ ఓ ఉత్తరం రాశాను. ఇదీ ఆయనకివ్వండి. బేసిక్ గా మీకు కావాల్సిన వాటిని ఆయన అరేంజ్ చేస్తారు. ఏమైనా ఇబ్బందులు వచ్చినా చూసుకుంటాడు'' అని డబ్బూ, లెటర్ నూ గంగాధరం కిచ్చింది చంద్రరేఖ.

వాళ్ళిద్దరూ ఆమె చూపిస్త్గున్న అభిమానానని తట్టుకోలేకపోయారు. కళ్ళలోంచి నీళ్ళు వాళ్లకి తెలియకుండానే జలజలా కారిపోతున్నాయి.

"రండి అటువైపు వెళ్ళి నిలుచుందాం'' ముగ్గురూ లేచి రోడ్డు కావలకి వచ్చారు.

అప్పుడే ఏదో వెహికల్ వస్తున్నట్టు లైట్ల ఫోకస్ వాళ్ళని ముంచేస్తోంది. చంద్రరేఖ చేయి అడ్డంపెట్టింది. అది పేపర్ వ్యాన్. మద్రాసు నుంచి వస్తోంది.

"ఇద్దరు ఒంగోలు''

"ఒంగోలు వరకు వెళ్ళదు. కావలివరకే, కావాలంటే రండి ...'' చెప్పాడు వ్యాన్ లోని వ్యక్తీ.

"కావలికి వెళ్ళి అక్కణ్నుంచి ఒంగోలు వెళ్లడం సులభం. కాబట్టి ఎక్కేయండి. ఇక్కడ మనం చాలాసేపు వుండడం ప్రమాదం'' చంద్రరేఖ చెప్పడంతో, రూప, గంగాధరం వ్యాన్ లో ఎక్కేశారు. వాళ్ళిద్దరి కళ్ళు అప్పటికీ వర్షిస్తూనే వున్నాయి. చంద్రరేఖ అలా మౌనంగా చేయి ఊపుతోంది. ముగ్గురికీ మాటలు అనవసరమనిపించింది. కళ్ళు చాలు, అవి మనసును అద్దంలా చూపిస్తాయి. వ్యాన్ మెల్లగా కదిలి ఆ తరువాత వేగం పుంజుకుంది.