.jpg)
ఆయన భూపతిరెడ్డి అంతరంగికుడు. ఆయన భూపతిరెడ్డి ఇంతకుముందు ట్రైనింగ్ ఇచ్చినట్లే చెప్పాడు. ఆ మాటలు విన్న జనం ముఖాల్లో భయం ఆ మసక చీకట్లో కూడా తెలుస్తోంది. "మొన్న తెల్లవారుజామున మా దొడ్లో రెండు నిమ్మకాయలు కనిపించాయి. అవి మంత్రించిన నిమ్మకాయలు. కుంకుమబొట్టు కూడా పోలేదు. ఎవరో మా ఇంటిమీద చేతబడి చేసినట్టున్నారు'' రాఘవరావు అన్నాడు.
ఆ పనిచేసింది దామాచారే. భూపతిరెడ్డి ఏమీ తెలియనివాడిలా "అలాగా'' అని ఆశ్చర్యం ప్రకటించాడు. ఇది వింటూనే జనం మరింత భయపడ్డారు. బిడ్డలా తల్లులైతే తమ చంకనున్న పిల్లల్ని మరింత గట్టిగా తమ గుండెలకేసి అడుముకున్నారు.
"ఎవరు చేస్తున్నారీ పని? ఎవరికీ ఈ ఊరు జనంమీద ఇంతకోపం? ఈ మంత్రాలు, మహిమలు ఏమిటి? అమాయకులమీద మంత్రాల ప్రయోగం ఏమిటి?'' భూపతిరెడ్డి తనలో తాను అనుకుంటున్నట్లుగా గట్టిగానే అన్నాడు.
"మొన్నోరోజు ఏమైందో తెలుసా? నది వీథిలో పిల్లా జెల్లా, ముసలీ ముతకా నడిచే బాటలో అక్షింతలు కన్పిస్తున్నాయి. అప్పుడు నాకేమీ అనిపించలేదుగానీ ఇప్పుడనిపిస్తోంది అవి మంత్రించిన అక్షింతలని'' నాదముని అనే వృద్ధుడు చెప్పాడు.
అతను చెప్పింది నిజమే. దామాచారి అవి చల్లాడు. భూపతిరెడ్డి దామాచారి కలిసి ఆలోచించుకుని ఒక పథకం ప్రకారం ఇందంతా చేశారు. జనం ఉలిక్కిపడ్డారు. అంటే తామంతా మంత్రించిన అక్షింతలను తక కాళ్ళతో తోక్కామని తెలియగానే ఏదో భయం వెన్నుపూసలో కదిలిస్తోంది.
"ఊరినంతా నాశనం చేయడానికి మంత్రప్రయోగం చేస్తున్నారన్న మాట'' అన్నాడు భూపతిరెడ్డి.
"అవును ... అవును'' కొన్ని గొంతులు అది నిజమన్నట్టు అరిచాయి.
"మంత్ర ప్రయోగమైతే ఎవరు చేశారు?'' భూపతిరెడ్డి జనాన్ని అడుగుతున్నట్టు ప్రశ్నించాడు.
గతంలో భూపతిరెడ్డి ఏర్పాటుచేసిన సమావేశానికి హాజరయినవాళ్ళకి మాత్రం చంద్రరేఖ మనసులో మెదిలింది. మిగిలినవాళ్ళకి దామాచారి, చంద్రరేఖ ఇద్దరూ కళ్ళముందు కనిపించారు. జనం చలనం లేకుండా వూపిరి బిగాబట్టారు. వాల్లిద్దర్లో ఇప్పుడు మంత్రాలు ప్రయోగిస్తున్నది ఎవరు? అదే ప్రశ్న వాళ్ళకి కళ్ళముందు ఉరితాడులా భయంకరంగా వేలాడుతోంది.
దామాచారి మనవాడు. ఊరికంతా మేలు చేస్తున్నవాడు. ఎవరింట్లో ఏ దెయ్యం వాలినా వెళ్ళగోడుతున్నాడు. మన మధ్యే తిరుగుతున్నాడు. ఈ క్షణంలో కూడా వున్నాడు. మరి చంద్రరేఖ ఎక్కడ? ఎక్కడ - ఎక్కడ - అని జనం కూడా చుట్టూ చూశారు. "
ఇక్కడెందుకుంటుంది? ఇంట్లోనో, శ్మశానంలోనో వుంటుంది'' దామాచారి నమ్మకంగా అన్నాడు.
"శ్మశానంలోనా?'' కొందరు ఆశ్చర్యాన్ని మనసులో అదిమిపెట్టలేక బయటికే అన్నారు.
"ఆ'' దామాచారి మరింత దీర్ఘం తీశాడు.
"అయితే పదండి ఇప్పుడే వెళ్ళి చూద్దాం'' జనంలోంచి ఎవరో అరిచారు. అందరూ కదిలారు ప్రవాహంలాగా. మొదట చంద్రరేఖ ఇంటికి వెళ్ళారు.
"చంద్రరేఖా ... చంద్రరేఖా ...'' గుమ్మం దగ్గర నిలబడి కోపంగా పిలిచాడు రాఘవరావు.
చిట్టి ఆ అరుపులకి మేల్కొని బయటికి వచ్చాడు.
"ఏంరా ... ఎక్కడ మీ చంద్రరేఖ?'' దామాచారి కాస్త కరుకుగా ప్రశ్నించాడు.
"ఇంట్లో లేదు'' భయం భయంగా చెప్పడు చిట్టి. ఊర్లోని అంతమంది జనం తమ ఇంటికి ఎందుకొచ్చారో, అంత ఆత్రిపూట ఎందుకు అడుగుతున్నారో అతని ఊహకు అందడం లేదు.
"మరెక్కడికి వెళ్ళింది?''
"ఎక్కడికంటే ...'' ఆపైన భూపతిరెడ్డి అక్కడ వుండడంవల్ల చెప్పలేకపోయడు. వాసూ దగ్గరికి వెళ్ళిందంటే అంతమందిలో ఒక్కొక్కరు ఒక్కో విధంగా అనుకోగలరు అని మౌనం వహించాడు.
"శ్మశానంలోనే వుంటుంది. అక్కడికే వెళ్ళి చూద్దాం పదండి'' రాఘవరావు భూపతిరెడ్డితో అన్నాడు.
అందరూ శ్మశానంకేసి కదిలారు.
సరిగ్గా ఆ సమయానికి వాసూతో అన్నీ చెప్పాక చంద్రరేఖ ఇంటికి బయల్దేరింది.
|
|


