.jpg)
నిజానికి ఇలాంటి సమస్యలు అతనికి కొత్తేంకాదు, చాలామంది ఆడపిల్లలతో అతను స్నేహం చేశాడు. కానీ ఏ ఆడపిల్ల దగ్గరా ఇలా తగులుకుపోలేదు. ఊరి దగ్గరికోచ్చే టప్పటికి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. ఆకాశమంతా నల్లటిమబ్బులు కమ్ముకున్నాయి. గాలి చల్లగా తగుల్తోంది. ఇంటికొచ్చాడో లేదో వర్షం ప్రారంభమైంది. ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే వుంది. వర్షంవల్ల మరో వారంవరకు వేరుశనగ విత్తనం కుదరదు. అటు జయ సమస్య, ఇటు వర్షం సమస్య అతన్ని నిద్రకు దూరం చెశాయి. ఉదయానికి వర్షం తగ్గింది. ఇక ఎలానూ వారం పనులులేవు గనుక జయను టౌన్ కు పిలుచుకువెళితే మంచిదనుకున్నాడు. కానీ ధైర్యం చాలడం లేదు.
వ్యవసాయం అయితే బాగా చేయగలడుగానీ డాక్టర్ దగ్గరికి ధైర్యంగా వెళ్ళి నా గర్ల్ ఫ్రెండ్ కి అబార్షన్ చేయి అని అడగలేడు. అద్నుకే ఈరోజు రేపు అంటూ వాయిదా వేసుకుంటూ వచ్చాడు. పొలం దగ్గరిక్కూడా వెళ్ళడం మానుకున్నాడు. అక్కడికి వెళితే జయ కనిపిస్తుందని భయం. ఇలా రోజుకొక యుగంలా గడుపుతున్నాడు. ఆ రోజు శనివారం. మరో రెండు రోజులకు వేరుశెనగ విత్తనం వేయాలి, విత్తనం వేయాలంటే రేపటినుంచి పొలం వెళ్ళాలి. ఓసారి మొత్తం దున్నించాలి. కానే పొలం వెళ్ళాలంటే జయ కనిపిస్తుందేమోనని భయంగా వుంది. ఏం చేయాలో పాలుపోక నిద్రరావడం లేదు. అటూ ఇటూ పడకమీద దోర్లాడుగానీ కళ్ళు మూతలు పడడం లేదు. ఇక లాభం లేదు - ఒంటరిగా ఇలావుంటే పిచ్చి పడుతుందని చెప్పి టౌన్ కి సెకెండ్ షో కి వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు టైం రాత్రి తొమ్మిది గంటలయింది.
ఆకాశం తన ఒంటికంతా చీకటి పూసుకున్నట్టు కళ్ళు పొడుచుకున్నా ఏమీ కనిపించడం లేదు. లుంగీమీద షర్ట్ వేసుకుని సినిమాకు బయల్దేరాడు. థియేటర్ చేరుకునేటప్పటికి పదయింది. టికెట్లు ఇస్తున్నారు. సినిమా ఏమిటో తెలియజేసే వాల్ పోస్టర్ కూడా చూడలేదు. లోపలికెళ్ళి కూర్చున్నాడు. సినిమా మొదలయింది. అది కన్నడం సినిమా డబ్బింగ్. మాయలు, మంత్రాలూ, దయ్యాలు పరమ భయంకరంగా వుంది సినిమా. చలికాలం అందునా వర్షంవల్ల జనం పలచగా వున్నారు. థియేటర్ లో కూర్చుని ఆ సినిమా చూడడం నరకంగా వుంది. మొదటిసారి అతను భయంభయంగా సినిమా చూస్తున్నాడు.
ఇంటర్వెల్ లో థియేటర్ లోనే షోడా తాగాడు. చలికాలంలో కూడా దాహం వేసిందంటే తను ఎంత భయపడ్డాడో తెలిసింది. మధ్యలో వెళ్ళిపోదాం అనుకున్నాడుగానీ అప్పుడయితే ఊరికి ఒంటరిగా వెళ్ళాలి, సినిమా వదిలాక ఎవరయినా తోడు వుండే అవకాశం వుంది. అందుకే ఇంటర్వెల్ తర్వాత ఊరికివెళ్ళే ప్రయత్నం మానుకుని లోపలికి వెళ్ళి కూర్చున్నాడు. ఇంటర్వెల్ తర్వాత సినిమా మరింత భయానకంగా వుంది. ఓ ఆడపిల్ల దెయ్యంగామారి తనను రేప్ చేసిన నలుగురు కుర్రాళ్ళని రకరకాలుగా చంపడం సినిమా ఇతివృత్తం. ఎందుకనే ప్రకాష్ కి జయ గుర్తొచ్చింది.
తన సమస్య చెప్పినా వారం రోజులుగా కనపడడం మానేశాడు. ఏమనుకుంటుందో? కొంపదీసి ఆత్మహత్య చేసుకుంటుందా? ఆ ప్రమాదం లేకపోలేదు. ఒకవేళ ఆత్మహత్య చేసుకు చచ్చిపోతే తనతో చెప్పినట్టు పోలీసులకు చీట రాసి పెడుతుందా? అలా చేస్తే తనపై పోలీసులు కేసు - కోర్టు -శిక్ష అలా కాకుంటే ఈ సినిమాలోలాగా దెయ్యమై తనను పీక్కుతింటుందా ఏం చేస్తుంది? ఈ ఊహలతో అతనికి నుదుటంతా చెమటలు పట్టేసింది. లుంగీతో తడుచుకున్నాడు. కానీ చెమట ఆగడం లేదు. ఒంట్లో నీరంతా ఆవిరైపోతున్నట్లు నాలుక రబ్బరు ముక్కలా అయిపోతోంది. పెదవులయితే ఎండుటాకుల్లా తగులుతున్నాయి.
ఆ సినిమా చూళ్ళేక మాధ్య మధ్యలో కళ్ళు మూసుకున్నాడు, మొత్తానికి సినిమా అయిపొయింది. గేటు దగ్గరికి వచ్చి తమ ఊరివాళ్ళు ఎవరయినా వున్నారేమో చూశాడు. కానీ విధి వక్రించింది. ఎవరూ కనిపించలేదు. ఏదో తెలియని భయం గుండెల్లో దూరి పిట్టలా చిన్నా అరుస్తున్నట్టు ఫీలయ్యాడు. ఇక అక్కడే వుంది చేసేదేమీ లేదు. చెక్ పోస్టుకు వచ్చి టీ తాగాడు. సిగరెట్లు అలవాటు లేకపోయినా ఓ సిగరెట తీసుకుని వెలిగించాడు.
రెండు కిలోమీటర్లు చలిగాలిలో అంత రాత్రిపూట ఊరికి నడవడానికి భయమేసింది. జ్వరం వచ్చేసిన ఫీలింగ్. లారీలు ఆపి ఊరి వరకు ఎక్కించుకోమని బ్రతిమిలాడాడు. ఏ ద్రయివరూ కనికరించలేదు. మరికాసేపు వెయిట్ చేద్దామంటే చలి మనిషినంతా చుట్టేస్తోంది. అందుకే మొండిధైర్యంతో బయలుదేరాడు.
|
|


