The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Kalagantine Cheli
కలగంటినే చెలి - 73

ఓ రోజు మధ్యాహ్నం భోజనాలై పోయాక తార కాసేపు విశ్రాంతి తీసుకుందామని పడుకుంది. అనుపమ ఎక్కడో తన ఈడు పిల్లలతో ఆడుకోవడానికి బయటికి వెళ్ళింది. అదిగో అప్పుడు స్కూటర్ శబ్దం వినబడింది తారకి. మగత ఆశబ్దానికి పారిపోయినట్టు ఆమె లేచింది అయితే బయటికి వెళ్ళి చూడడానికి శరీరం ఒప్పుకోవటం లేదు. సోమరిగా శరీరం తిరిగి పడుకోమంటోంది.

స్కూటర్ తన ఇంటిముందే ఆగినట్టనిపించింది. ఈసారి శరీరం కూడా ఉత్సాహాన్ని పీల్చుకుంది. ఒక్క ఉదుటున లేచి బయటకి వచ్చింది. అతను తన టీవీఎస్ ఫిఫ్టీని ఆపి స్టాండ్ వేస్తున్నాడు.

ఆమెను చూడగానే "హలో! బావున్నారా?'' అంటూ పలకరించాడు.

బావున్నానంటూ తల వూపింది. అతను తన మోపెడ్ ను లాక్ చేసి క్యాష్ బ్యాగ్ తీసుకుని లోపలికి వచ్చాడు. ఆమె అతన్ని హాల్లోకి ఆహ్వానించి అక్కడున్న కుర్చీని చూపించింది.

అతను అందులో కూర్చొని "నిజానికి ఇన్ని రోజులు మిమ్మల్ని చూడకుండా మహా ఇబ్బంది అయిపొయింది. కానీ మీ ముత్యాల చైన్ పూర్తికానిదే మీకు కనిపించకూడదని నిర్ణయించుకున్నాను'' అన్నాడు

ఈ మాటలు మాట్లాడుతున్నప్పుడు అతను తన మాటల్ని నవ్వుకు గుది గుచ్చినట్టు అలా నవ్వుతూనే వున్నాడు. తనకు చైన్ వచ్చిందనో లేక అతని మాటలో ఏది తనని ఇంత పరవశానికి గురిచేస్తుందో ఆమెకి అర్థం కాలేదు. అతని మాటలకు శరీరమంతా చెవులై పోయినట్టు ఆమెకి అనిపించడం మాత్రం నిజం. తనలోని ఈ సంచలనమంతా అతను గుర్తించడం ఇష్టంలేక "ఉండు .. కాఫీ పట్టుకొస్తాను' అని వంటగదిలోకి పారిపోయింది.

అతను ఎదురుగా లేకపోయినా శరీరమంతా ఏదో మత్తులో మూలుగుతూనే వుంది. మనసైతే ఊహల రెక్కల్ని తగిలించుకుని ఎక్కడెక్కడో తిరుగుతోంది. తన ఎద పొగడం అతను గమనిస్తాడేమోనని పైటంతా పూర్తిగా కప్పుకుని వచ్చింది.

అతను కాఫీ తీసుకుంటూ "థాంక్స్'' అన్నాడు.

"కాఫీ బాగుండా?'' అంది అతను ఓ సిప్ చేశాక.

"మీరెంత అందంగా వున్నారో అంత బాగా వుంది కాఫీ ...'' అన్నాడు సురేష్.,

ఆమె ముఖంలోకి సిగ్గు ఎగబాకి ఎర్రగా మెరిసి ఆ తర్వాత మాయమైంది. అతను కాఫీ తాగాక ఎర్రటి పొట్లాన్ని ఒకదాన్ని బ్యాగ్ లోంచి తీశాడు. ఆ ఎర్రటి కాగితంలో ముత్యాలదండ మందారం పూలమధ్య మల్లెమొగ్గల సరంలా కనిపించింది. "ఇదిగోండి'' అంటూ ఆమె చేతికి అందించాడు.

నిజంగానే చాలా బాగుంది దండ. బంగారం కూడా మచిదే వాడాడు. అందుకే బగారపు దారానికి ముత్యాల్నీ గుదిగుచ్చినట్టు వుంది. మబ్బులమధ్య సాగిన మెరుపులా అనిపించిందామెకి.

"ఇదిగోండి! ఈ దండ మీరు వేసుకోవడం మూలాన ఎంత అందమోచ్చిందో చూస్తాను'' అన్నాడు.

కానీ అతను అలా అనడంతో దాన్ని అక్కడే వేసుకోవడానికి సిగ్గు అడ్డమొచ్చింది. అయినా ఇక తప్పదనిపించి అటు తిరిగి దండ వేసుకుని ఇటు తిరిగింది.

"నేను ఇప్పటికి కొన్ని వేళ ముత్యాలు అమ్మి ఉంటాను. అన్నింట్లోకి ఈ ముత్యాలే ఎంతో పుణ్యం చేసుకున్నాయని అనిపిస్తోంది. మీ అంత అందగత్తెకి ఇంతవరకు నేను ముత్యాలు అమ్మలేదు.''

అతను నిజంగా అంటున్నాడా అన్న అనుమానం కలిగింది. అందుకే అతన్ని నిశితంగా చూసింది. అతను గుండెల్లోంచి మాట్లాడుతున్నాడని అతని ముఖమే చెబుతోంది.

"ఊరికే పొగిడేస్తున్నావ్'' అంది కాసేపయ్యాక.

"మీ మీద ఒట్టు. ఈ పొగడ్తలన్నీ మీ అందం ముందు దిగదుడుపే'' అన్నాడు.

ఆమె ఇక ఏమీ మాట్లాడలేకపోయింది. పరవశంలాంటికి శారీరమంతా పాకుతోంది. అతన్ని మరికొంత సేపు చూడాలంటే అలా ఊరికే వుంటే కుదరదు ఏదో ఒకటి మాట్లాడాలి. "ఇంతకీ ఎంతయిందేమిటి?'' అనడిగింది.

"మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి. నాకయితే మీరు ఒప్పుకుంటే బహుమతిగా ఇచ్చేయ్యాలనుంది.

"ఒద్దొద్దు, వ్యాపారస్థుడివి. నావల్ల ఎందుకు నష్టపోతావ్?'' అంది తార.

అతనికి ఆమెతో మాట్లాడాలని వుందిగానీ మరింత సేపువుంటే బావుండదని లేచాడు. అతనేదో చెప్పబోయేంతలో అనుపమ వచ్చింది తన యింటిలో ఎవరో కొత్త వ్యక్తి వుండడంతో బెరుకుతా తార వెనక్కు వెళ్ళి నిలుచుంది. అతను తిరిగి ఏదో చెప్పబోయాడు. అది గమనించిన తార 'ఇపుడేం చెప్పద్దు. చిన్నపిల్ల వింటుంది' అన్నట్టు సైగచేసింది.