.jpg)
ఆకాశంలో చందమామ పుట్టాడు. గాలి చల్లగా తగులుతోంది. చీకటి ఇళ్ళకింద, చెట్లకింద తల దాచుకున్నట్టు నీడలు నల్లగా పరుచుకుంటున్నాయి. లోకంమీద తనకున్న ప్రేమనంతా తెలియజేస్తున్నట్టు చంద్రుడు వెన్నెలను కుమ్మరిస్తున్నాడు. అతను స్నానంచేసి బట్టలు మార్చుకుని గది ద్వారం దగ్గర కూర్చున్నాడు.
నీలవేణి వెన్నెల బొమ్మలాగా అటూ ఇటూ తిరుగుతోంది. ఆమె చీర, లంగా, జాకెట్టు భుజంమీద వేసుకుని బాత్రూమ్ కి వెళ్ళింది. ఆ సమయంలో ఆమె స్నానం చేయడం చాలా అరుదు. మరెందుకు ఈవేళే స్నానంచేస్తూ ఉందోనని ఆలోచించాడు గంగాధరం. తన కోరిక తీర్చడానికి ఆమె తయారౌతూ వుందని ఎందుకో నమ్మకంగా అనిపించింది. ఆ వూహకే అతని మనసు మాధుర్యంతో బరువెక్కిపోయింది. ఆమె లోపలికెళ్ళి తలుపేసుకుంది. అతను తలుపువేపే చూస్తున్నాడు. ఏవేవో వూహలు కళ్ళముందు కదులుతున్నాయి. అంతలో ...
"గంగాధరం ... ఈ అలివేలు ఎక్కడికెవెళ్ళిందో తెలియదు గానీ అదిగో వంటగదిలో సబ్బుంది పట్రా మరిచిపోయాను'' అని అరిచింది.
అతను ఉలిక్కిపడి ఈ లోకంలోకి వచ్చాడు. ఆమె చెప్పినపని చేయటానికి పైకి లేచాడు. కాళ్ళు వణుకుతున్నాయి, కళ్ళు తేలిపోతున్నాయి. ఓ పక్క భయం మరో పక్క ఆనందం రెండూ గుండెల్లోని నాలుగ్గదులను ఆక్రమించేచేసుకుని రక్తాన్ని బయటికి తరుముతున్నట్టుంది. ఎక్కడో నిద్రలో నడుస్తున్నట్టు వంటగదిలోకి నడిచి సబ్బు తీసుకుని బాత్ రూమ్ దగ్గరకొచ్చాడు. "సబ్బు'' అని మెల్లగా అన్నాడు.
చిన్న స్టూలుమీద కూర్చుని నీలవేణి తలుపు తెరిచి ... "ఇటివ్వు'' అంది.
అతను బాత్రూమ్ లోపలికి చూస్తూ ఒకడుగు వేసి చేయి ముందుకు చాచాడు. వెన్నెల ఆమె శరీరంపైపది నిశ్శబ్ధంగా చిట్లుతోంది. లంగాను ఎదమీదనుంచి మోకాళ్ళవరకు కప్పుకున్న ఆమెను గుడ్లప్పగించి చూస్తున్నాడు. దీపపువత్తిని ఎక్కించడానికి చిమ్నీకి వున్నట్టు తిరగలిలాంటిది చంద్రుడికే వుండుంటే, దాన్ని ఎంత బలాన్నయినా వుపయోగించి ఆమె సౌందర్యాన్ని చూడటానికి అతను ప్రయత్నించి వుండేవాడు. కళ్ళు పొడుచుకుంటే మరికాస్త బాగా కనిపిస్తుందని ఎవరయినా అప్పుడు చెప్పుంటే అతను అలా చేసేందుకు క్షణమైనా జానకి వుండేవాడు కాదు.
ఆమె సబ్బు తీసుకుని "ఇంకేం విశేషాలు?'' అంది నవ్వుతూ. ఆమె నవ్విందని అతనికెల తెలిసిందంటే క్షణకాలం వెన్నెలవన్నె తగ్గింది కాబట్టి.
"ఈరోజు నా పుట్టినరోజు'' అన్నాడు కలలో మాట్లాడినట్టు. నిజానికతను ఎప్పుడు పుట్టాడో అతనికే తెలియదు. ఆమె గబుక్కున పైకి లేచింది. వెన్నెల ఒక్కసారి వొళ్ళు విదుల్చుకున్నట్టు అతను ఫీలయ్యాడు.
ఆమె లేచి అతని ముందుకొచ్చింది. అతను ఒకడుగు వేశాడు. అప్పుడు పెట్టిందామె కేక. మరుక్షణంలో అక్కడ జనం గుమికూడి పోయారు. ఆమె వున్న స్థితిని, బాత్రూమ్ లో వున్న అతన్ని చూస్తూనే ఏం జరిగి వుంటుందో, ఆమె ఎందుకు కేక పెట్టిందో అర్థమై పోయింది. అర్థంకానిది ఒక్క గంగాధరానికే. అతన్ని ఎంతమంది కొట్టారో, ఎక్కడెక్కడ కొట్టారో ఎవరికీ తెలియదు.
"రాస్కెల్ - వాడ్ని బయటికి పంపండి'' అని నీలవేణి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది.
"రేయ్ - ఇంకొక్క ఐదు నిముషాలు టైమిస్తున్నాం. వూరి పొలిమేరలు దాటిపోయావో బతికిపోతావు'' అని ఎవరో అరిచారు. ఇంకెవరో అతని ట్రంకుపెట్టెని రోడ్డుమీదకి విసిరారు. అతను నిశ్శబ్ధంగా దాన్ని అందుకున్నాడు. అనుమానం, బాధ, కోపం, నిస్సహాయత అన్నీ గుండెను కుదిపేస్తున్నాయి. ఒళ్ళంతా చీరుకుపోయిన మంట మనసును కోస్తోంది. అతనికి ఠక్కున శ్రీదేవి గుర్తుకొచ్చింది.
ఇంటిలోంచే కాదు - తనపట్ల నిర్ధయంగా ప్రవర్తిస్తున్న మనుషుల నుంచి అడుగడుగునా తమ దారిద్రాన్ని గుర్తుకుతెచ్చి కర్కశంగా వ్యవహరించే ప్రపంచం నుంచి దూరంగా పారిపోవడానికి అద్భుతంగా పనిచేసే మంత్రం శ్రీదేవి అందుకే అతను అప్రయత్నంగా శ్రీదేవిని తలుచుకున్నాడు.
|
|


