.jpg)
బాండీలో వేగుతున్న ఎండుచేపలు మాడిమసి అయిపోయాయి. ఆ వాసన ఇల్లంతా కమ్మేసింది. రామదాసు అంత్యక్రియలకు వెళ్ళివచ్చాడు. రెండుమూడు రోజులకి అందరూ సర్దుకున్నారుగానీ పద్మ ఒక్కతే సర్దుకోలేకపోయింది. ఆమెకి అప్పటినుంచీ ఇరవై నాలుగుగంతలూ ఎందుచేపలు మాడిపోయిన వాసన వేస్తున్నట్టు చెప్పేది. "అబ్బ! భరించలేను ఈ కంపు ఎందుచేపలు మాడిపోయాయి'' అని అరవడం ప్రారంభించింది.
పదేపదే ముక్కుని వేళ్ళతో మూసుకునేది. లోపలికి వేళ్ళను పోనిచ్చి కెలుక్కునేది దాంతో ముక్కంతా వాచిపోయి, ఊపిరి పీల్చడం కష్టమైపోయేది. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఆ ఇంట్లో ఎవరికీ అర్థంకాలేదు! పద్మకు ఏదో అయ్యిందని తెలుస్తోందిగానీ అదేమిటో తెలియడంలేదు. ఆ దామాచారికి చూపించగా, అతను ఆమెకి కామినీ పిశాచి పట్టుకుందని మంత్రాలువేసి, వేపమండల్తో బాదేవాడు. ఆ దెబ్బలకు తాళలేక ఆమె అరిచేది ఆ అరుపులు వింటుంటే పేగులను బయటికిలాగి విసిరేసినట్టు వుండేది అందరికీ. కానీ అంతకుమించి మరో మార్గంలేక అలా లోలోపలే రోదిస్తూ వుండేది.
ఈ బాధలు చూళ్లేక గంగాధరం మొదటిసారి తను దాచుకున్న డబ్బు తీసుకుని ఓ రోజు ఇంట్లో ఎవరికీ చెప్పకుండా టౌన్ కి వెళ్ళాడు. టౌన్ కి వెళ్ళగానే టికెట్టు కొనుక్కుని ఓ సినిమా థియేటర్ లోకి దూరాడు. అందులో ఏం సినిమా ఆడుతూ వుందో కూడా చూడలేదు అతను. కాలక్షేపానికి సినిమా చూడాలన్నదే అతని ఆకాంక్ష. అలాంటప్పుడు ఆ సినిమా ఏది అయితే ఏం? అతను కూర్చోగానే లైట్లు ఆరిపోయి సినిమా మొదలైంది అది శ్రీదేవి సినిమా. ఆ సినిమాలో పెద్ద పెద్ద ఇళ్ళు, సమస్యలు లేని మనుషులు, అందంగా, ఆకాశంనుంచి దిగిన దేవకన్యలా ప్రతి సన్నివేశానికి డ్రెస్ మార్చుకున్న శ్రీదేవి. ఆమె వయ్యారం, ఆమె నవ్వులు, ఆమె హొయలు అన్నీ అతన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాయి. ఆ కాసేపూ అతను కలల్లో విహరించాడు.
తన ఇంట్లో వికృతంగా కనిపించే దరిద్రం. తన అన్న అవిటితనం, ఎప్పుడూ ఎందుచేపలు వాసన వస్తుందని అరిచే అక్క, చిరిగిపోయిన బట్టలతో దీనంగా కనిపించే రెండో అక్క, ఎముకలు తప్ప కండలేకుండా కట్టెలాగా వుందో మూడో అక్క, సంసారాన్నంతా వీపుమీద మోస్తున్నట్టు నడుం వంగిపోయిన తల్లీతండ్రీనుంచి దూరంగా చుక్కల లోకంలోకి అతన్ని లాక్కుపోయింది. ఇంటి పరిస్థితులు గుర్తురాకుండా తనని ఊహాలోకంలోకి తన చిటికెనవేలు పట్టుకుని శ్రీదేవి తీసుకెళుతున్నట్టే తోచేది. అలా అతను ఇంటినుంచి పారిపోవడానికి, తన కుటుంబాన్నంతా కాసేపు మరచిపోవడానికి శ్రీదేవి సినిమాలకు వెళ్ళడం అలవాటు చేస్తుకున్నాడు.
ఇంట్లో వున్నప్పుడు కూడా మరో ఆలోచన రాకుండా శ్రీదేవిని మనసులోకి తెచ్చుకునేవాడు. ఆమే ప్రపంచంగా బ్రతకడం నేర్చుకున్నాడు అలా అతను శ్రీదేవికి భక్తుడైపోయాడు. శ్రీదేవి సినిమావస్తే చాలు ఫస్ట్ మార్నింగ్ షోకి హాజరైపోయేవాడు. ఆమెను మళ్ళీ మళ్ళీ చూడాలనిపించేది. అందుకే వరసగా మ్యాట్నీ, ఫస్టుషో, సెకెండ్ షో చూసి ఇంటికి వచ్చేవాడు. అతనికి శ్రీదేవంటే వున్న పిచ్చిఅభిమానం అందరికీ తెలిసి అతన్ని ఆటపట్టించడం ప్రారంభించారు.
"ఏరా శ్రీదేవి వీరాభిమాని, మీ శ్రీదేవి సినిమా ఎప్పుడు విడుదలవుతుంది?''
"మీ అభిమాన అందాలనటి శ్రీదేవి ఇప్పుడొచ్చిన కొత్త సినిమాలో వండర్ ఫుల్ గా వుంది''
"ఇంతకీ శ్రీదేవి ఓ సినిమాలో నటించినందుకు ఎంతడబ్బు తీసుకుంటుందిరా?'' ఇలా కొందరు సీరియస్ గా, మరికొందరు ఎగతాళిగా అతనితో శ్రీదేవి గురించి మాట్లాడడం ప్రారంభించారు. అతను మాత్రం వీటన్నిటినీ సీరియస్ గా తీసుకునేవాడు. తనకు ఇన్ని రోజులూ లేని గుర్తింపు ఒకటి వచ్చిందని అతనికి అర్థంకావడం ప్రారంభించింది. ఇంతకుముందైతే అతను నుగురిలోకి వచ్చినా ఎవరూ పెద్దగా పట్టించుకునేవాళ్ళు కారు. సరిగా మాట్లాడేవాళ్ళు కాదు, ఇప్పుడు పరిస్థితి మారింది.
"రావయ్యా రా, శ్రీదేవి ఫుల్ సైజు బొమ్మపడింది పత్రికల్లో, చూశావా? ఆ బొమ్మ నీకు తెచ్చిస్టాలే''
"శ్రీదేవి కొత్తగా ఒప్పుకున్నా సినిమాలు ఏవో వాటిగురించి చెప్పవయ్యా''
"శ్రీదేవికి తెల్లడ్రెస్ లంటే చాలా ఇస్తామాట. నువ్వు కూడా తెల్లడ్రెస్ లు కొనుక్కోకూడదూ''
"తనకి గోళ్ళు పెంచుకున్న మగాళ్ళంటే అసలు ఇష్టం వుండదట, మొన్నీ మధ్య ఏదో పుస్తకంలో ఇంటర్వ్యూ సందర్భంగా చెప్పింది'' ఇలా అతను ఎక్కడ కనబడినా చెప్పవాళ్ళు, ఆ విధంగా శ్రీదేవి వల్ల అతనికి ఓ ఐడెంటిటీ వచ్చింది.
|
|


