The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Atanibharya Priyudu
అతనిభార్య ప్రియుడు - 100

 

జి.కె. ని దెబ్బతీయటానికి నాగమణికి నమ్మకంగా వుంటూ వచ్చాను. జి.కె. ప్రవర్తనతో విసిగెత్తిపోతున్న ఆమెకి అతను చేస్తున్న పనులన్నీ చెప్పాను. ఆస్తి గురించి ఆమెని రెచ్చగొట్టాను. ఉద్రేకంలో నాగమణి జి.కె.ని చంపుతుందేమోనని ఆశపడ్డాను. కానీ తెలివిగా నా చిన్న మనమరాలికి చెందాల్సిన ఆస్తిని నీ అండతో వకీలుతో రాయించుకొంది.

ఈలోగా జగదీష్ విడుదల అయ్యాడు. ఆ అవకాశాన్ని తీసుకొని నేనే నిద్రపోతున్న జి.కె.ని కత్తితో పొడిచి చంపేశాను. ఆ నేరం జగదీష్ చేశాడని పోలీసులు అనుమానించి అతన్ని పట్టుకుంటారని అనుకున్నాను. ఇప్పుడు నాగమణిని కూడా చంపేస్తే నా మనుమరాలు సుఖపడుతుందని ఈ హత్యచేశాను” చెప్పాడు.

పోలీసులు వచ్చి మల్లన్న ని అరెస్ట్ చేసి తీసుకు వెళ్ళిపోయారు.

నాగమణిని హాస్పిటల్లో చేర్పించారు.

ఇంటి దొంగని ఈశ్వరుడు కూడా పట్టుకోలేరంటారు. ఇదేనా అనుకున్నాడు గణపతి.

*****

వారం రోజుల్లో నాగమణి కోలుకొంది. ఇంటికి తీసుకొచ్చేశారు.

వెంకటపతిరాజు గారు వచ్చి అధికారపార్టీ టికెట్ కోసం ఆమె చేత సంతకాలు చేయించుకెళ్ళారు.

విజయ్ మెల్లగా గదిలోకి వచ్చి ఆమె మంచం పైన కూర్చున్నాడు. ఆమె ఆరాధనతో అతడి కేసి చూసింది. ”విజయ్?” పిలిచింది.

”ఊ”

”నేనంటే నీకు…”

”పిచ్చి ప్రేమ!” చెప్పాడు.

ఆమె కళ్ళు మెరిశాయి. ”ఎప్పుడూ నువ్వే చెప్పావు ఆ మాట!”

”అవును… నీకు దయలేదు కదా!”

”విజయ్ ఐ లవ్ యూ !” అంది నాగమణి.

విజయ్ చిలిపిగా చూశాడు. ”గెస్ట్ హౌస్ కి పోదామా?” అడిగాడు.

”షటప్” అంది.

”నేను చాలా స్వార్థపరుడిని” అంటూ ఆమె చెంపల్ని సవరదీస్తూ మొహం మీదకి వంగుతున్నాడు.

ఆమె పెదవులు మంచు పువ్వుల్లా విచ్చుకొంటున్నాయి. అప్పుడే గుమ్మంలోకి వచ్చిన దేవయాని, జగదీష్ చప్పున ఆగిపోయారు.

జగదీష్ అది చూపిస్తూ కన్ను గీటాడు. ”ఛీ… పొ” అంది.

ఆమెని ఎత్తుకొని పక్క గదిలోకి నడుస్తున్నాడు జగదీష్.

”ఎక్కడికి?” అడిగింది.

”ఇక ముందు కథకి ఓ కొత్త టచ్ ఇవ్వడానికి” చెప్పాడు జగదీష్ గదిలో ఆమెని కిందకి దింపుతూ. ఆమె అతని మెడచుట్టూ చేతులు వేసి పెదవుల్ని అందుకొంది.

”కథకి ప్రారంభం బాగుంది”

ఆ మాటలకి ఉలిక్కిపడి గుమ్మం కేసి చూశారు. విజయ్, నాగమణి నించుని నవ్వుతున్నారు.

”సారీ! అత్తా! తలుపేసుకోవడం మర్చిపోయాను” జగదీష్ నవ్వుతూ అన్నాడు.

….. అయిపొయింది…..