విషయజ్ఞానం కలిగి ఉండి, స్వేచ్చాయుత వాతావరణంలో పెరిగిన స్త్రీ భగ్న ప్రేమికురాలు అయినప్పుడు విజ్ఞతతో వ్యవహరించి ధైర్యంగా తన సమస్యని పరిష్కరించడానికి కృషి చేస్తుంది. ఈ రకంగా ప్రతి స్త్రీ ధైర్యంగా నిలబడి, మానసికంగా కృంగిపోకుండా ఉండాలంటే, మనస్సుని దిట్టం చేసుకోగల స్థితి రావాలంటే సమాజంలో స్త్రీకి ఒక నీతి, పురుషునికి ఒక నీతి అనేది పోవాలి. అప్పుడుగాని స్త్రీలలో దాంపత్యజీవిత సమస్యల విషయంలో హిస్టీరియా ఫిట్స్ తెచ్చిపెట్టుకోవడం పోదు.
ఫిట్స్ వస్తున్నంత మాత్రాన, గుండెపోటు, నరాల బలహీనత వంటి లక్షణాలు కనబడుతున్నంత మాత్రాన హిస్టీరియా శారీరక అనారోగ్యం కాదు. ఇది కేవలం మానసిక వ్యాధి. దీనికి కావలసినదల్లా మానసిక ఉల్లాసం, మానసిక ధైర్యం. విషయం గురించి సరైన అవగాహన కలిగించి మానసికంగా తృప్తిని కలిగించినట్లయితే చాలావరకు హిస్టీరియా తగ్గిపోతుంది. ఎప్పుడూ కూడా హిస్టీరియాకి ఏదో ఒక మూలకారణం ఉంటుంది. కొన్ని సందర్భాలలో హిస్టీరియా ఫిట్స్ వచ్చే వాళ్ళకే అవి ఎందుకు వస్తున్నాయో, దానికి కారణం ఏమిటో తెలియకుండా అయిపోతుంది.
వారి మనస్సులో ఉన్న అస్పష్టమైన ఆకాంక్షలు, ఆందోళనలు హిస్టీరియాకి కారణం అవుతాయి. సరైన మానసిక విశ్లేషణ ద్వారా వాటిని గుర్తించవచ్చు. హిస్టీరియాకి చికిత్స విషయంలో చాలా సందర్భాలలో ఆ స్త్రీని తాను ఉన్న వాతావరణం నుంచి వేరు చేయవలసి ఉంటుంది. వాతావరణ మార్పుతో మనస్సుకూడా మారుతుంది. వీటన్నింటితోపాటు కొన్ని ట్రాన్క్విలైజర్స్ వాడటంతో మనస్సు శాంతించి, మానసిక అల్లకల్లోలం నుంచి బయటపడి హాయిగా బ్రతకగలుగుతుంది.
|
|


