The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Romantic Stories>>Toli Sandhya ...
తొలి సంధ్య

ప్రసాద్

"ఏయ్ ఇంకా ముందుకు వెళ్ళకు చీర తడిసిపోతుంది చూడు ... ఎంత పెద్ద కెరటం వస్తోందో ...?'' చేయి ఆసరాగా ఇస్తూ ఆమెకు హెచ్చరికలు చేస్తూ అతడు నవ్వుతూ. తుళ్ళుతూ అతడిని అల్లరి చేస్తూ ఆట పట్టిస్తూ ఆమె .... అతడూహించినట్లే ఓ పెద్ద కెరటం వచ్చి వారిద్దరినీ అభిషేకించింది. అంతే వేగంగా మళ్ళీ వెనక్కి వెడుతున్న ఆ కెరటం తాకిడికి కాళ్ళకింద ఇసుక జారిపోతుండగా ఒకరిపై ఒకరు ఆనుకుని నిలదొక్కుకుంటూ వాళ్ళిద్దరూ.

వారిద్దరినే చూస్తున్నాడు అభిషేక్ అరగంట నుంచీ. చూడముచ్చటగా ఉందా జంట. ఎంత చూసినా తనివి తీరని దృశ్యంలా కన్రెప్పలు కూడా వాల్చటం మరిచి మరీ చూస్తున్నాడు అభిషేక్ వారిద్దర్నీ. మగాడు ఓ సగం ఆడది ఓ సగం. ఈ రెండు సగాలు కలిస్తేనే సంపూర్ణత్వం, ఆ సంపూర్ణత్వానికి అర్తంలా అచ్చమైన స్వచ్చమైన అద్దంలా ఆ ఇద్దరూ కనిపించారు అభిషేక్ కళ్ళకి. ' ఓ అందమైన సాయంకాలపు క్షణాల్ని ఎంత మధురంగా ఖర్చు చేస్తున్నారో కదా! కొన్నేళ్ళు గడిచాక గుండె తలుపులు తెరచి చూస్తే అప్పటికీ తాజాదనం ఏమాత్రం వీడని ఆ క్షణాలు వారికెంత స్ఫూర్తినిస్తాయో' అనుకున్నాడు అభిషేక్.

'ప్చ్ ... నిట్టూర్చాడతడు. తోడు లేని ఒంటరిజీవితంలోని అలసట తెలుస్తోందతనికి. లేచి నిలుచున్నాడు. నడక ప్రారంభించాడు. వెనక్కి తిరిగి చూస్తే తను విడిచి వెడుతున్న ఒక్కో పాదముద్ర దిగులుగా అల్లంత దూరంలో జాలరుల పిల్లలు కాబోలు గోచీలు మాత్రమే ధరించి అలలతో ఆడుతున్నారు. ఇంకో చోట ఇసుక తిన్నెలపై ఓ వృద్ధ జంట ముచ్చట్లాడుతోంది. చుటూ ఇందరున్నా వేధిస్తున్న ఒంటరితనం అది ఈ రోజు మరీనూ ... అవును ... మునుపెన్నడూ లేని విధంగా ఒంటరితనమనే బాధ అభిషేక్ కి ఈరోజు అధికమైంది. రూమ్ కి వెళ్ళబుద్ధి కావడం లేదు. స్నేహితులతో గడపాలనిపించడం లేదు. ఉదయం నుంచీ అంతే ...!

ఆఫీసుకు సెలవు పెట్టి మరీ ఊరంతా బలాదూర్ గా పిచ్చిపిచ్చిగా తిరిగాడు. ఆఖరుకి ఈ వేళకి ఈ సముద్రపు ఒడ్డుకి చేరుకున్నాడు. గుండెల్లో వేనవేల సుడిగుండాలు అలజడి రేపుతున్నా గంభీరంగా కనిపించే సముద్రుడు తన బాధ కాస్తయినా సేద తీరుస్తాడని వచ్చిన అభిషేక్ కి ఇక్కడ కూడా ఆ బాధ ద్విగుణీకృతమైంది. ముఖ్యంగా ఆ జంటని చూసిన తర్వాత మరీనూ. ఈరోజే నీలిమ పెళ్ళి ... మరో రెండు గంటల్లో మరో వ్యక్తి సొంతం కాబోతుందామె. రూమ్ కెళ్ళే సందు చివర్లో షామియానా ఆ సంగతిని పదిమందికి చెబుతోంది గర్వంగా.

ఆ పరిసరాల్లో కనిపిస్తున్న అతిథుల కొత్త ముఖాలు ఓ ఇద్దర్ని పెళ్ళి సంకెళ్ళతో ఒకటిగా చేస్తున్నామనే సందడితో కళకళ లాడుతున్నాయి. మధ్య మధ్యలో మోగుతున్న బాజాభజంత్రీలు. గడపకు పూసిన పసుపు కుంకుమలు. ఆ ఇంటికి కట్టిన మామిడి తోరణాలు. అవన్నీ హరుగునున్న శుభకార్యానికి సాక్షులుగా ఉన్నాయి. నీలిమ పెళ్ళి అనే భావనే భరించలేకపోతున్నాడు అభిషేక్. నీలిమ ... బాపు గీసిన బొమ్మలా, బాలు పాడిన పాటలా ఎంత జ్రుద్యంగా ఉంటందో కదా! ఉద్యోగామంటూ వచ్చి రూమ్ లో చేరిన వెంటనే మొదట అభిషేక్ చూసింది నీలిమనే. ఓ ఉషోదయాన రూమ్ కిటికీ రెక్కలు తెరచీ తెరవగానే ఆ అందాల బొమ్మ కనిపించింది.

వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేస్తూ ఆమె ఆమనిలా. అప్పటికీ ఆమె పేరు నీలిమని అతడికి తెలియనే తెలియదు. సన్నగా మంచుకురుస్తున్న ఆ చలివేళ చుక్క చుక్కనూ కలుపుతూ అడపాదడపా అలవోకగా కదులుతున్న ముంగురులను సరి చేసుకుంటూ ముగ్ధమనోహరంగా కనిపించిందామె. అదే రూపం అభిషేక్ గుండెల్లో ముద్రితమైంది. ఇక ప్రతిరోజూ ఉదయాన్నే ఆ కిటికీ దగ్గర నిలుచోదం అభిషేక్ కి ఆనవాయితీగా పరిణమించింది. ఉద్యోగం పేరుతొ ఊరికి తల్లిదండ్రులకి దూరంగా వచ్చినా అపరిచితుల నడుమ కొత్త ప్రదేశంలో ఉంటున్నానన్న బాధని కనిపించకుండా చేసింది నీలిమ.

ఆ అమ్మాయితో కొన్ని యుగాల స్నేహమున్నట్లు మధురమైన ఊహ. ఆమెను అలా చూస్తూ ఉండిపోతే చాలనిపించేలా తహతహ. ఆ తరువాత కిటికీ రెక్కలు ఎన్నడూ మూసివేయడం ఎరుగడు అభిషేక్. కిటికీలోంచి గదిలోకి ప్రవహించే కొత్తగాలి నీలిమ కబుర్లు మోసుకొస్తున్న ఫీలింగ్. ఆ అమ్మాయి తండ్రి టెలికమ్యూనికేషన్ లో చిరుద్యోగి ఓ తీరిక వేళ పరిచయం చేసుకున్నాడతడిని అభిషేక్. అప్పుడే మాటల్లో తెలిసింది ఆమె పేరు నీలిమ అని. ఇంటర్ స్టూడెంట్ అని. కాలేజీ కెడుతూ ఆమె పుస్తకాలను గుండెలకు హత్తుకుంటే ఆ పుస్తకాలే తానై పోవాలనే కాంక్ష,

ఘల్ ఘల్ మంటూ గజ్జెల సవ్వడి చేస్తూ ఆమె సుతారంగా నడుస్తుంటే ఆమె అదుగులు కందకుండా అరచేతులుంచాలనే కోర్కె. కాటుకలద్దిన కళ్ళ చివర నుంచీ ఆమె చూపులు పలుకరిస్తుంటే పండుగలన్నీ మూకుమ్మడిగా వచ్చి సందడి చేస్తున్న అనుభూతి. ఒక వయసుకి ఒక్కో ఆశ, లక్ష్యం. చిన్నతనంలో చదువు ఆ తరువాత ఉద్యోగం లక్ష్యాలైతే ఇప్పుడు అభిషేక్ లక్ష్యం ఆమె. ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాలనే ఆశ. ఆ ఆశ తీరేదెలా?ఆమెతో మాట్లాడిన పొడిపొడి మాటలే మాట్లాడి మనసిచ్చి పుచ్చుకోవాలనుకున్నా కాలం కలిసి రావటం లేదతడికి.

కాలేజీకని ఆమె ఇంట్లోంచి బయలుదేరగానే అనుసరించాలనుకున్నా విద్యార్థి దశ వీడిన ఉద్యోగి అడ్డొస్తున్నాడతనికి. ఏమీ పాలుపోని పరిస్థితి. అయినా అనుక్షణం ఆమె ధ్యాసే కళ్ళు తెరచినా మూసినా ఆమె రూపం. గుండె వాకిట్లో బుట్టబొమ్మలా కూర్చుని ముగ్గులేస్తూ ఆమె. ముంగురులు సవరించుకుంటూ ఓసారి చిరుదరహాసాలోలికిస్తూ మరోసారి, లేడీపిల్లలా కాలేజీకి వెళుతూ ఇలా ఎన్నెన్నో భంగిమలు నీలిమవి. "నీలిమా ...! నువ్వు నా జీవితంలోకి రావూ ....'' ఈ ప్రార్థన ఆమెకు చేరేదెలా? ప్రేమలేఖ రాయడమా? పెద్దలతో సంప్రదించడమా? ఆలోచిస్తుండగానే ఆ కబురు తెలిసింది అభిషేక్ కి.

ఓ రోజు ఆమె తండ్రి కలిసి చెప్పేశాడు నీలిమకు పెళ్ళాని. పై సంబంధం కానేకాదని, మేనరికమేనని. అబ్బాయి స్టేట్స్ లో డాక్టర్ అని, నీలిమకు కూడా అతడంటే ఇష్టమని. ఆ మాట చెప్పడమేమిటి. వారం తిరక్కుండానే ఆ సందులో పెళ్ళి వాతావరణం అలుముకుంది. వచ్చిపోయే అతిధులతో ఆ ఇళ్ళు పెళ్ళి ఇల్లుగా మారిపోయింది. మరో రెండు గంటల్లో నీలిమ మరొకరి సొంతం కాబోతోంది. ఇప్పుడు అభిషేక ఎదుట లేదు నీలిసంద్రం. అతడి కళ్ళలోనే కాపురముంది దూరంగా అలలతో మసక మసగ్గా కనిపిస్తుంటే కనీసం కన్నీరైనా తుడుచుకునే ప్రయత్నం చేయలేడు అభిషేక్. పెళ్ళితంతు ముగిసింది. నీలిమ భర్తతో కలిసి స్టేట్స్ కి వెళ్ళిపోయింది.

రూమ్ కిటికీ తెరిస్తే ఎదురుగా శూన్యం, తన ముగ్గులతో ఉషోదయాన్ని స్వాగతించే బాపుబొమ్మ మాయమయ్యేసరికి గువ్వా ఎగిరిపోయాక మిగిలిన గూడులాంటి శూన్యం. అయినా, ఆమె అందెలరవళి అభిషేక్ చెవుల్లో ఇంకా గింగురు మంటూనే ఉంది. ఇక ఆ కిటికీ రెక్కలు తెరవటం మానేశాడతను. ఆఫీసు నుంచి రూమ్ కి రావాలన్నా దిగులే. నీలిమ మెళ్ళో తాళిబంధం పడినా ఇప్పటికీ అభిషేక్ మనసులోని మగువ మాత్రం ఆమె. ఏ తాళి అడ్డగిస్తుంది అతడి ఊహని ఇది తప్పని? అతడాలోచిస్తూనే ఉంటాడు నీలిమ ఇప్పుడేం చేస్తుందోనని. ఓ అర్థరాత్రి వేళ ఆమె ఆ ఆలోచన వస్తే చాలు ఇక ఆ రాత్రి నిద్రకి శెలవ్. ప్రతిరోజూ సూర్యోదయమవుతున్నా అభిషేక్ గుండెల్లో మాత్రం చీకటే.

*****

ఆరోజు ... ఆఫీసుకెళ్ళగానే కొత్తముఖం ఎదురైంది అభిషేక్ కి. 'ఎవరా?' అని నివ్వెరపోయి చూస్తుంటే సహోద్యోగి పరిచయం చేసాడామెని 'మిస్ మీరా రిసెప్షనిస్ట్ గా జాయినయ్యింది' అభిషేక్ గుండె కాన్వాస్ పై బాపు గీసిన మరో బొమ్మ నవ్వినట్లయింది. లిప్ స్టిక్ రాసిన ఎర్రెర్రని పెదాలు ఊరిస్తుంటే మరోలోకం తలుపులు తెరుచుకున్నట్లయింది అభిషేక్ కి. "హలో అభిషేక్ మీ ఫ్రెండ్ కాల్ ప్లీజ్ టాక్'' ఫోను తీగెను వీణ తీగ ఎలా మార్చేసి సుస్వరాన్ని పలికిస్తుంటే అభిషేక్ కి మళ్ళీ తీయని తీయని దిగులు. తేనెలొలికే కంఠం ఆమెది.

ఫోన్ లో మాట్లాడుతుంటే నెమ్మదిగా ఓ ఓ ప్రేయసీ గుస గుసలాడుతున్న ఫీలింగ్. ఇంకా ఇంకా వినాలనిపించే భావన, కానీ ఏం మాట్లాడగలడు? నీలిమ లేని వెలితి మతుమాయమవుతున్న దశ. రూమ్ కన్నా ఆఫీసు పదిలం అనిపించేది అభిషేక్ కి. పనిలేకున్నా ఎక్కువ సమయం ఆఫీసులోనే గడిపేందుకు ఇష్టపడుతున్నాడిప్పుడు. ఆమె ఒకరోజు సెలవు పెడితే చాలు మళ్ళీ విషాదం నేనున్నానంటూ అభిషేక్ ని పలుకరించేది. ఇప్పుడు అతడి ఊహలన్నీ మీరా చుట్టూనే. ఆమె పేరు తలచుకుంటే చాలు మనసు బృందావనమవుతుంది. వేడి ఊపిరి వేణువవుతుంది. ఆరోజు ఆదివారం ... గది తలుపులు చప్పుడైతే తీశాడు అభిషేక్. "మీరా ...!?'' అన్నాడు ఆశ్చర్యంగా.

"ఎంత గడుసువారు మీరు. ప్రశ్ననీ పేరునీ ఒకే వాక్యంలో జోడించారు'' అంటూ ఎంటరైంది మీరా గదిలోకి. ఆమె చేతిలో పసుపు రాసిన శుభలేఖ. "చెప్పటం మరిచాను. వాసు కళ్యాణ మండపంలో ఈనెల 20న నా పెళ్ళి. ఆఫీసులోనే పెళ్ళికార్డులు పంచొచ్చు. కానీ ఇలా ఇంటికి వచ్చి ఆహ్వానిస్తే ప్రత్యేకత వుంటుందని ...'' ఆమె చెబుతోంది.

అర్థంకావడం లేదు అభిషేక కి. మళ్ళీ తోడులేని ఒంటరి నడకలోని అలసట గుర్తొచ్చిందతనికి. అరగంట తరువాత ... మళ్ళీ నడుస్తున్నాడతడు ఇసుకలో ఒక్కో పాద ముద్రను జారవిడుస్తూ. గుర్తు తెచ్చుకుంటున్నాడతడు తన ఊహల్ని అల్లేసిన అల్లరి ప్రియురాళ్ళని. ప్రియు'రాళ్ళు' కాబట్టి కఠినంగా ఉండే జావ'రాళ్ళ'ని. ఇంటర్ చదువుతున్న రోజుల్లో కొత్తగా పైటేసిన పక్కింటి పార్వతి మసక చీకట్లో పంచి ఇచ్చిన దొంగముద్దు ఎంగిలిని గుర్తుతెచ్చుకున్నాడు అభిషేక్. తర్వాత కాలేజీలో పరిచయమైనా వెంటనే మనసు దోచేసిన రెండు జెళ్ళ సీతని గుర్తు తెచ్చుకుంటున్నాడు. మరో అడుగు వేసాడు అభిషేక్. మరో పాదముద్ర ఇసుకలో ...

పక్కనే నీలి సంద్రం హోరు. ఆ పాదముద్ర నీలిమ, మరో అడుగు మీరా మలి సంధ్యవేళ ఆకాశం అరుణిమ దిద్దుకుంటోంది. "సంధ్య ఎంత అందంగా ఉంది'' అనుకున్నాడు అభిషేక్. చటుక్కున గుర్తొచ్చిందతడికి. సంధ్య తన మేనమామ కూతురు ... చిన్నప్పట్నుంచీ తనపైనే ఆశలు పెంచుకున్న మరదలు పిల్ల. ప్రేమించి పెళ్ళి చేసుకోవాలనుకునే తపన, తాపత్రయంతో తాను నిర్లక్ష్యం చేసిన యువతి. ఎప్పటికైనా తన మేడలో బావే తాళికడతాడన్న నమ్మకంతో ఇన్నాళ్ళుగా ఎదురుచూస్తున్న వనితా. సంధ్య గుర్తొచ్చింది అభిషేక్ కి ఈ మలిసంధ్య వేళ. "సంధ్యా ...'' గట్టిగా అరిచాడు అభిషేక్.

అభిషేక్ కేకకి పక్కనే స్నానమాడుతున్న జాలరుల పిల్లలు నిశ్చేష్టులై నిలుచున్నారు క్షణంసేపు ఏమిటో అర్థంకాక. అభిషేక్ మనసులో ఇప్పుడు ఒకటే ఆలోచన. అసలు ప్రేమంటే ఏమిటి? నిజంగా తాను ప్రేమిస్తున్నాడా? ఒకవేళ తన ప్రేమ నిజమైతే తన ఊహల్లోకి ఇంతమంది ఆడపిల్లలు స్వేచ్చగా ఎలా రాకపోకలు సాగిస్తున్నారు? అయినా తన గుండె గది ఇప్పటికీ టూలేట్ గా ఎందుకుండి పోయింది? సమాధానం దొరికిందతడికి. ఏ అమ్మాయినీ తను నిజంగా ప్రేమించలేదు. అవును తానసలు ప్రేమించనేలేదు. అనుకున్నాడు అభిషేక్.

కానీ, తనూ ప్రేమించాడు 'ప్రేమ' అనే మధురోహని. అందుకు ఆలంబనగా ఒక్కో ఆడపిల్లనీ వెతుక్కున్నాడు. నిజంగా జరిగిందదీ. తానే ఆదర్శ అమర ప్రేమికుడైతే కథ మరోలా ఉండేది. తాను విపరీతంగా అభిమానించిన ఏ ఒక్క ఆడపిల్ల దక్కనినాడు తన గుండె బద్దలయి ఉండేది ... అలా జరగలేదు. పార్వతి, సీత, నీలిమ, మీరా ...! ఎందరు మారినా మరో బాపుబొమ్మ కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఎందుకు? ఆ అమ్మాయిని ఆలంబనగా చేసుకుని ఊహల్లో ముందుకు సాగేందుకు అంతే ...

"సంధ్య నిజమైన ప్రేమికురాలు అందుకే తనకోసమే ఇంతకాలం వేచి ఉంది'' అనుకున్నాడు అభిషేక్. రూమ్ కి చేరుకొని గబగబా సూట్ కేస్ సర్దుకుని పరుగుతీశాడు అభిషేక్. అతడికి ఇప్ప్పుడే తెలిసింది తనకోసం తూర్పు వెళ్ళే రైలు కాచుకుని వుందని. ఎక్కవలసిన రైలు జీవితకాలం లేటనే సామెత నిజంకాకూడదనుకుంటూ రైల్వేస్టేషన్ లోకి అడుగుపెట్టాడు అభిషేక్. టికెట్ తీసుకుని అభిషేక్ రైలు ఎక్కగానే గార్డు పచ్చజెండా ఊపాడు. రైలు నెమ్మదిగా కదిలి వేగం పుంజుకుంది.

ఇప్పుడతడు చేరవలసిన గమ్యానికి ఈ రైలు సంధ్య వేళకు చేరుస్తుంది. సూర్యుడు తొలి తొలి కిరణాలతో జగతిని పలకరించే వేళ. అతడు ట్రయిన్ దిగుతాడు. సన్నగా మంచుకురిసే ఆ చలివేళలో వాకిట్లో ముగ్గులేస్తూ ఓ ముద్దుగుమ్మ అతడిని స్వాగతిస్తుంది. ఆ ముద్దుగుమ్మ పేరు సంధ్య ....