The content in this feature is rated as "A++". You must be at least 18 years old to view this feature.
Home>>Psycho - 2>>Psycho
సైకో - 94

జయంత్ కేసు హిస్టరీ మొత్తం తీసుకున్న డాక్టర్ అభినయ్ జయంత్ కి సెడేషన్ ఇచ్చాడు. "మీ పరిచయానికి పూర్వం ... అంటే ఇతని బాల్యం, కుటుంబ చరిత్ర, పరిసరాలు, ఎడ్యుకేషన్ వగైరా వగైరా తెలిసి వుంటే డయాగ్నోస్ కి చాలా ఉపయోగపడేది. ఇప్పటికయినా ఫర్వాలేదు. మేదిసంస్ వాడుతూ కరెంట్ షాక్ ఇస్తే మామూలు మనిషి అవుతాడు ...'' తన ఎదురుగా కూర్చుని ఉన్న గాయత్రి, రజితలనుద్దేశించి అన్నాడు డాక్టర్ అభినయ్.

'కరెంట్ షాక్' అన్న పదం వింటూనే అడిరిపడింది గాయత్రి.

"కరెంట్ షాక్ అంటే ఎందుకు అంత భయపడతారు? బ్యాటరీలోకి ప్రసరించే కరెంటు మాత్రం ఇస్తాం ... కొద్దిగా 'జిమ్ ... జిమ్' అంటుంది ఇంకా చెప్పాలంటే రోగికి కరెంట్ షాక్ ఇచ్చినట్లే తెలియదు. ఆ షాక్ కూడా రెప్పపాటు కాలం మాత్రం ఇస్తాం. కరెంటు షాక్ ఇవ్వకుండా మెడిసిన్స్ వాడడం వలన కూడా ట్రీట్ మెంట్ ఇవ్వవచ్చు. కానీ షాక్ ట్రీట్ మెంట్ రికవరీ ఈజ్ ఫాస్ట్, కరెంట్ షాక్ వలన ప్రాణానికి ఏ ముప్పురాదు. డాక్టరుగా హామీ ఇస్తున్నాను ...''

జయంత్ అనగానే ఫుల్ సూటులో, రేబాన్ గ్లాసెస్ తో కారు దిగే ఓ యువకుడ్ని మస్తిష్కంలో ఊహించుకునే గాయత్రి, పిచ్చివాడిగా జయంత్ ని భరించలేక పోతోంది. అలాగని అతనికి కరెంట్ షాక్ ... అంటే తట్టుకోలేకపోతోంది. "డాక్టరుగారూ ... ఆయన నా మీద అనుమానంతో బెల్టుతో తనని తాను బాదుకున్నప్పుడు, ఆయన ఒంటిమీద దెబ్బల్ని చూడలేక పోయాను. నన్ను అనుమానించిన దానికన్నా ఆయన ఒంటిమీది దెబ్బల్ని భరించలేకపోయాను. అటువంటి నేను ఆయనకు కరెంటు షాక్ ఇస్తుంటే చూడలేను, తట్టుకోలేను'' అంటూ ఏడ్చేసింది.

"ప్లీజ్ ... కంట్రోల్ యువర్ సెల్ఫ్ ... కరెంటు షాక్ అంటే మీకు వున్న అపోహ వలన మీరిలా మాట్లాడుతున్నారు. నా మాట మీద గౌరవం వుంచి ఒకసారి కరెంటు షాక్ ఇవ్వనివ్వండి ... ఆ తర్వాత మీ నిర్ణయాన్ని గౌరవిస్తాను''

కాదనలేక పోయింది గాయత్రీ. లీగల్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి .... జయంత్ కి కరెంట్ షాక్ ఇవ్వదాంకి, అదీ గాయత్రి సమక్షంలో రంగం సిద్ధమయింది. 'కరెంటు షాక్ ఇస్తారు ... రియాక్షను ఎలా వుంటుందో .. ఏమో' అని టెన్షన్ తో చూస్తున్న గాయత్రి, డాక్టరు అభినయ్ తన కన్సల్టింగ్ రూముకి వెళ్ళడానికి ఉద్యుక్తుడు కావడం గమనించి "డాక్టరుగారూ! వారికి కరెంటు షాక్ ఇవ్వడం లేదా?'' అని అడిగింది.

"షాక్ ఇచ్చాం ... మీరు చూస్తూనే వున్నారు కదా'' ఈ తఫా ఆశ్చర్యపోవడం గాయత్రి వంతయింది.

"మీరు ఇక్కడే వుండండి ... పదినిముషాలకి జయంత్ గారికి స్పృహ వస్తుంది. అప్పుడు నన్ను పిలవండి. ఈలోపు జయంత్ గారు కదలవచ్చు, క్రింద పడిపోవచ్చు. జాగ్రత్తగా చూస్తూ వుండండి'' అని చెప్పి తన కన్సల్టింగు రూము వైపు నడిచాడు. డాక్టరు అభినయ్

కరెంటు షాక్ ఎప్పుడు ఇచ్చారు? కరెంటు షాక్ అంటే ఇంతేనా? కరెంటు షాక్ ఇస్తానంటే తాను ఎందుకు అంతగా భయపడింది? సవాలక్ష సందేహాలతో, అచేతనంగా పడిఉన్న జయంత్ ప్రక్కనే స్టూలు మీద కూర్చుని వున్నది గాయత్రి.

****