.png)
గాయత్రీ - జయంత్ వివాహం ఓ ఫైవ్ స్టార్ హోటల్ లో అత్యంత ఆడంబరంగా జరిగింది. ఈ పెళ్ళికి హాజరయిన గాయత్రి తరపు బంధువులందరికీ పేరు పేరున జయంత్ నూతన వస్త్రాలు బహుకరించడం పెద్ద చర్చనీయాంశమయింది. వర్ణసంకరానికి ఒడిగాట్టాడని ఏ ఒక్కరూ గాయత్రి తండ్రిని చాటుగా కూడా పెదవి విరచలేదు. జయంత్ వంటి గొప్ప ఉద్యోగస్తుడు, ఐశ్వర్యవంతుడు, అందగాడు పైసా కట్నం లేకుండా లభించినందుకు ఒకలాంటి ఈర్ష్య భావం వారిలో తొంగిచూసింది. ఆ ఈర్ష్యతోనయినా వారు చాటుమాటుగా వ్యాఖ్యానం చేయవలసిందే. కానీ అలా ఏ ఒక్కరూ చేయకపోవడానికి కారణం జయ్హంట్ ఉద్యోగరీత్యా గొప్ప హోదాలో వున్నాడు. ఏ రోజున అతనితో ఏ పని పడుతుందో అందుకే జయంత్ తో పరిచయం చేసుకోవాలని ఎవరికీ వారే ఉబలాటపడ్డారు.
అంతటితో సరిపెట్టుకోక గాయత్రిని, ఆమె తండ్రిని కూడా మర్యాద చేయడం మొదలెట్టారు. తమ అతిథులుగా వచ్చినవారు తమకే మర్యాద చేయడం చూసి గాయత్రి తండ్రి మొదట ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత విషయం అర్థమయి గుంభనంగా నవ్వుకున్నాడు. "నా తల్లి అదృష్టవంతురాలు'' అని గాయత్రిని చూసి అనుకున్నాడు. కాని మనసులో ముప్పిరిగొన్న ఆదరం, అనురాగాలని మాటల్లో బయటపెట్టలేదు.
గాయత్రి బామ్మగారి పరిస్థితి అయితే సరేసరి ... ఆమె ద్వారానే దగ్గర బంధువులు జయంత్ ను పరిచయం చేసుకుంటున్నారు. మనవడికి తనతరపు చుట్టాలు అందర్నీ పరిచయం చేసే అవకాశం రావడంతో పెళ్ళి పందిట్లో బామ్మ పరపతి కూడా పెరిగింది. ఇదంతా గాయత్రి గమనిస్తూనే వుంది. తన తండ్రి, బామ్మ, అమ్మ జయంత్ సంబంధం పట్ల ఎంత ఆనందిస్తున్నారో ఆమెకీ అర్థమయింది. అక్కడ జరుగుతున్న ప్రతి విషయాన్నీ వారి నోటి వెంబడి వెలువడుతున్న ప్రతి మాటని అందులో ప్రతి అక్షరాన్ని మననం చేసుకుని, జీర్ణించుకోవటానికి ప్రయత్నించసాగింది.
పెళ్ళయింది మూడు నిద్రాలూ ముగిశాయి. హనీమూన్ కి ఎక్కడికయినా తీసుకెడతాడేమో అనుకున్నది గాయత్రి. కాని జయంత్ వేరేలా ఆలోచించాడు. తమ పెళ్ళికి హాజరయి, తమని ఒ పర్యాయం రమ్మని ఆహ్వానించిన వారి ఇళ్ళకు బయల్దేరాడు. తమ ఇంటికి వచ్చి పెళ్ళి భోజనం చేశారు. తాము ఇచ్చిన కొత్త దుస్తులు తీసికెళ్ళారు గనక అవి వసూలు చేసుకోవడానికి వచ్చారని బంధువులు ఎక్కడ అపోహ పడతారోనని భయపడింది గాయత్రి.
కాని ఆమె అంచనాల్ని తలక్రిందులు చేస్తూ ఎవరింటికి వెడితే వారికి వారి అవసరాల కనుగుణంగా బహుమతులు తీసుకెళ్ళాడు జయంత్. దానితో గాయత్రి బంధువర్గంలో జయంత్ కి రెడ్ కార్పెట్ వెల్ కమ్ లభించింది. బంధువులంతా తన భర్తని చూసి మెచ్చుకోవడం. తన అదృష్టాన్ని పొగడడం గమనించిన గాయత్రికి కాళ్ళు నేలమీద నిలవలేదు. అప్పుడు గమనించింది గాయత్రి ఓ ముఖ్యమయిన విషయం.
|
|


