మాధవ్ మంచి మగసిరిగల మగవాడు. అతని భార్యే మంజు. వారి వివాహము దాదాపు రెండుసంవత్సరాలైంది. మాధవ్ కి మంజు మీద అనురాగం ఉన్నా నెలలో ఎక్కువ రోజులు ఇంటికి దూరంగా ఉండటమే జరుగుతూ ఉంటుంది. ఊళ్ళమీద తిరిగి పనిచేయడమే అతని ఉద్యోగం మరి. భర్త ఇంటికివచ్చిన రోజున మంజుకి మహాపండుగ. భర్త సాన్నిధ్యంలో తననితానే మరచిపోయి పరవశించి పోతుంది. ఆ సమయంలో మంజు మనస్సులో ఎన్నో తీయని ఊహలు మెదులుతూ వుంటాయి.
కనీసం భర్త రోజూ ఇంటి దగ్గర ఉండలేక పోయినా, అతని ప్రతిరూపంగా బిడ్డ కలిగి తన కళ్ళ ఎదుట మెదులుతూ ఉంటే అదేచాలు అని ఉవ్విళ్ళూరుతూ ఉంటుంది. కాని ఆమె కోరిక ఇంతవరకు నెరవేరలేదు. చివరికి డాక్టరు దగ్గరికి వెళ్ళి ఇంకా తనకి సంతానం కలగక పోవడానికి కారణం ఏమిటని అడిగింది. డాక్టరు ఆమె చెప్పినదంతా విని ఇంతవరకు గర్భం రాకపోవడానికి కారణం సరైన కామశిల్పం అవలంభించక పోవడం, గర్భధారణ కాలాన్ని గమనించక పోవడమేనని తేల్చివేసింది. మంజు ఒక్కర్తే కాదు ఎందరో వివాహిత స్త్రీలు అన్ని సక్రమంగా ఉన్నా గర్భధారణ కాలాన్ని సక్రమంగా గుర్తించి సంయోగం జరపకపోవడం వల్ల తల్లులు కాలేకపోతున్నారు. అదేవిధంగా సరైన కామశిల్పం అవలంభించక పోవడం వల్ల గర్భవతులు కాలేకపోతున్నారు.
నెలకొకసారి మాత్రమే ప్రతి యువతి అండాన్ని విడుదల చేస్తుంది. ఆమెనుంచి విడుదలైన అండం పురుష బీజకణాలతో కలయిక పొందకపోయినట్లయితే ఆ అండం విడుదల వ్యర్థమయినట్లే. స్త్రీలో విడుదలయిన అండంతో వీర్యకణాల కలయికపొంది పిండంగా తయారవ్వాలంటే వీర్యకణాల యోని మార్గంలో ఉంటే సరిపోదు. ఆ వీర్యకణలు గర్భాశయ కంఠంగుండా గర్భాశయంలోకి ప్రవేశించి అక్కడనుంచి అండవాహికల్లోకి ప్రయాణించాలి. అప్పుడు అండవాహికల్లో అండంతో వీర్యకణాల కలయిక జరుగుతుంది. మరి ఇంత తతంగం జరగాలంటే వీర్యకణాలు తగినంత ఎక్కువగానూ, బలంగానూ ఉండాలి. ఇన్ని వీర్యకణాల్లోనూ ఏదో ఒక వీర్యకణం మాత్రమే అండంతో కలయిక పొందగలుగుతుంది.
తగినంత వీర్యరాశి ఉన్నప్పుడే అండంతో కలయిక సంతృప్తికరంగా జరుగుతుంది. ఒకసారి విడుదలయిన వీర్యకణాలు అయిదురోజుల వరకు సజీవంగా ఉండగలుగుతాయి. కాని రతి జరిగిన రెండు రోజులు తరువాత ఆ వీర్యకణాలకి అండాన్ని కలయిక పొందే సామర్థ్యం ఉండదు. రెండు రోజులకి ఒకసారి సంయోగం జరిపినట్లయితే తగినంత వీర్యరాశి ఉంటుంది. దీనికి తోడు అందులోని వీర్యకణాలు తగినంత పరిపక్వత పొంది బలంగానూ వుంటాయి. రోజూ రతిలో పాల్గొన్నప్పుడు వీర్యరాశి తక్కువగాను ఉంటుంది.
వీర్యకణాలు పూర్తిగా పరిపక్వత పొందివుండక పోవచ్చు. అందువల్ల రెండురోజులకు ఒకసారి రతిలో పాల్గొంటే అండం విడుదలనాటికి రెండు రోజులనాడు విడుదలయిన వీర్యకణాలు అండంతో కలయిక పొందే శక్తితో లేకపోయినా అప్పటి సంయోగం వలన విడుదలయిన వీర్యకణాలు వెంటనే అండంతో కలయిక పొందే సామర్థ్యం కలిగి వుంటాయి. దీనివలన అండం విడుదల అవడంతోనే మంచి వీర్యకణాలతో గర్భధారణకు ఆస్కారం కలుగుతుంది. ఇందువల్ల గర్భోత్పత్తి గురించి తహతహలాడే దంపతులు నలభై ఎనిమిది గంటల విరామంతో రతిలో పాల్గొనడం ఉత్తమం.
|
|


