- వసుంధర
.png)
ఆమె పేరు శ్రీ వల్లికుమారి ఎప్పుడు చూసినా అప్పుడే విరసిన తెల్లగులాబీలా ఉంటుందామె.... వయసు సహజంగా ఆడదానికిచ్చే సొగసైన పొగరు కారణంగానో ఏమో ఆమె నడుస్తూంటే తెల్లత్రాచు ఆవేశంతో పాకుతున్నట్లుంటుంది. అలాగని ఆమెను చూస్తే భయం వేయదు. ఆమె కాటు కోసం శరీరాన్నందివ్వాలపిస్తుంది. ఊహలోనే ఆ కాటు ఇచ్చే సుఖం కోసం వాస్తవం ప్రాణంపోయినా ఫరవాలేదనిపిస్తుంది. శ్రీవల్లికుమారిని చూసినప్పుడల్లా యిదీ నా పరిస్థితి.
ఆమె తండ్రి రఘురామయ్య బడిపంతులు. ముగ్గురు పిల్లల తండ్రి ... పెద్ద కొడుకులిద్దరూ మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళు తండ్రిపట్ల వినయ విధేయతలున్నవారు. నెలనెలా తండ్రికి కొంత డబ్బుకూడా పంపుతారు. అది వారి బాధ్యతే తప్ప రఘురామయ్యకు వారి డబ్బుతో నిమిత్తం లేదు.. ఆయనకింకా రెండేళ్ళ సర్వీసుంది. స్వతింట్లో ఉంటున్నాడు. ఊళ్లోనే మరో యింటిమీద నెలకైదు వందల రూపాయల అద్దె వస్తుంది. పల్లెటూరి ఆస్తిపాస్తులమ్ముకోగా వచ్చిన రెండు లక్షల రూపాయలు బ్యాంకులో ఉన్నాయి. రఘురామయ్య ఆదర్శవాది. వివాహ విషయంలో కూతురికాయన స్వేచ్చ ఇవ్వడం వల్లనే కూతురికింకా వివాహం కావడంలేదని ఆయన భార్య రమాదేవి బాధపడుతూ ఉంటుంది.
ఇంకా అనుకునేందుకు శ్రీవల్లికుమారికి వయసేం ముదిరిపోలేదు. సరిగ్గా నాలుగురోజుల క్రితమే ఆమెకు పందొమ్మిది నిండాయి. ఆ రోజు వాళ్ళు నన్ను భోజనానికి పిలిచారు. పిలుపుకు కారణం శ్రీవల్లికుమారి బలవంతమేనని అన్నారు. ఆమెకు నేనంటే యిష్టమనడంలో సందేహం లేదు. ఆ యిష్టంవల్లనే ఏమో అసలు నాకు వాళ్ళింట్లో స్థానం లభించింది.
ఆ ఊళ్ళో పోస్టింగైతే నాన్నగారు నాకు రఘురామయ్యగారి అడ్రసిచ్చి ‘’మంచివాడు నాకు తెలిసినవాడు ... ఈయన సాయం తీసుకో’’ అని చెప్పారు.
నేను ముందుగా ఓ హోటల్లో మకాంపెట్టి వాళ్ళింటికి వెళ్ళాను. మర్నాడు కూతురి సిఫారసు మీద వాళ్ళింటి వీధి గది నాకిచ్చారు. శ్రీవల్లికుమారి ప్రైవేటుగా బియ్యే చదువుతోంది. సాధారణంగా మగాళ్ళతో మాట్లాడ్డానికి బిడియపడే ఆమె తరచుగా నా వద్దకు వచ్చి ఎకానమిక్సులో సందేహాలడిగి తీర్చుకునేది. ఆమె ప్రశ్నల్లోకానీ, అడిగే పద్ధతిలోకానీ వక్రబుద్ధి నాకు కనబడలేదు. కానీ ఆ వక్రబుద్ధి నాలోనే ప్రవేశించింది. ఆమెకు నేనంటే ఆకర్షణ ఉంది. ఆమె కనులలో నా పట్ల ఆరాధనాభావం కూడా స్పష్టంగా తెలుస్తుంది. కావాలని నా సమక్షంలోకి రావాలని ప్రయత్నిసుందామె.
తనకనుభవమైన ప్రతి విశేషాన్ని నాతొ చెప్పాలని తహతహలాడుతుంది. తరచుగా నన్ను వాళ్ళింటికి పిలిచేలా చేయడమేకాక తెలివిగా నా యిష్టాలన్నీ తెలుసుకుని ఆ ప్రకారం వంటలు చేయిస్తుంది. ఆమె నన్ను ప్రేమిస్తోంది సందేహం లేదు... శ్రీవల్లికుమారి వంటి అందగత్తె నన్ను ప్రేమిస్తే అది నాకు గర్వకారణం. నేను ఊ అంతే మా పెళ్ళి జరగడం కూడా కష్టం కాదు. నాకు ఇతరత్రా వస్తున్న సంబంధాలకంటే ఈ సంబంధం మంచిదవుతుంది. రఘురామయ్యగారు కూతురి పెళ్ళికి యాభైవేల దాకా కట్న మిద్దామనుకుంటున్నాడు. అయినప్పటికీ ఆమెను నేను పెళ్ళి చేసుకోలేను. రఘురామయ్యగారికున్న ఆదర్శాలు మా నాన్నగారికి లేవు.
మా యిద్దరి కులాలూ కలవ్వని నాకు తెలుసు. నాకు తెలిసిన విషయం మా వయసుకు తెలియకపోవడం వల్ల నేను శ్రీవల్లికుమారిపట్ల ఆకర్షితున్ని కాక తప్పడంలేదు. నా ఆకర్షణ ప్రోత్సాహాన్ని కాదనకూడడంటే నా మనసు వక్రమార్గాన్నెన్నుకొక తప్పలేదు. శ్రీవల్లికుమారి ఆకర్షణ, ఆరాధనాభావాన్ని నా స్వప్రయోజనానికుపయోగించాలి. అందుకు కావలసిన ధైర్యం నాకు కలగడంలేదు. ఆ సమయంలో నాకు హరనాథ్ టో పరిచయమైంది. ఒక సినిమాహాలు దగ్గర అతడు తనే పలకరించి నా పరిచయం చేసుకున్నాడు.
ఎన్నో విషయాల్లో మా యిద్దరి అభిప్రాయాలూ కలిశాయి. వారం రోజుల్లో ఇద్దరం మంచి స్నేహితులమయ్యాం. అప్పటికే మా వయసుకు తగ్గ రహస్య విశేషాలు మాట్లాడుకునేంత చనువుకూడా వచ్చేసింది మా యిద్దరి మధ్యా! నేనతడికి శ్రీవల్లికుమారి గురించి చెప్పాను.
‘’పెళ్ళి చేసుకో, సుఖపడతావు’’ అన్నాడు హరనాథ్.
మా నాన్నగారి గురించి చెప్పాను. హరనాథ్ క్షణమాలోచించి
‘’పోనీ, పెల్లిచేసుకోకు అయినా నీ కడ్డేముంది?’’ అన్నాడు.
‘’తప్పుకదా!’ అన్నాను.
‘’వయసులో తప్పుచేయకపోతే అదే పెద్ద తప్పు’’ అన్నాడు హరనాథ్.
అతడు నా ఆలోచనల పరిథిని మార్చేశాడు. నా దురూహాల్ని సమర్థించాడు. అతడు చెప్పిన ప్రకారం మేమిద్దరం కొన్నాళ్ళు లైఫ్ ఎంజాయ్ చేసి ఆ తర్వాట్ ఎవరికీ వారు వేరే వివాహాలు చేసుకుని ఈ అనుభవాన్ని మధురస్మృతులుగా మిగిల్చుకోవాలి. అలా చేయకపోతే తర్వాత ఇద్దరూ పశ్చాత్తాపపడతారు.
‘’అయితే ఆమెకు అసలు విషయం ముందే చెప్పేస్తాను’’ అన్నాను ఉత్సాహంగా.
హరనాథ్ నన్ను తిట్టాడు. ‘’నేను నిన్ను పెళ్ళి చేసుకోను నాకు నువ్వు కావాలి అని చెబితే ఏ ఆడపిల్లా సంతోషంగా తన్నుతానై నీకర్పించుకోదు. ఆడదానికి అహం ఉంటుంది. ఆ అహాని దెబ్బతీయకుండా ఉండడం కోసం నీవామెను మంచి మాటలతో, మాయకబుర్లతో వంచించాలి. నీవు వంచిస్తున్నావని తెలిసినా ఆమె నీకు లొంగిపోతుంది. ఆడదాన్ని లోబర్చుకునేందుకు వంచన మినహా మరో మార్గం లేదు ....’’ అన్నాడతను.
‘’కానీ ఆ తర్వాత?’’
‘’ఏమీ భయపడనవసరం లేదు. ఈ దేశపు ఆడది వంచనను క్షమించగలదు’’ అన్నాడు హరనాథ్ నవ్వుతూ.
‘’అయితే వంచన చేయడమెలా?’’
‘’నా అనుభవంతో చెబుతున్నాను విను ...’’అంటూ హరనాథ్ మొదలుపెట్టాడు.
అతడు చెప్పింది వింటూంటే అప్పుడే నాలో ఉద్రేకం ప్రారంభమయింది. అతడి పథకంలో రిస్కు ఉందని నాకు తెలుస్తోంది. కానీ శ్రీవల్లికుమారి కోసం ఆ మాత్రం రిస్కు తీసుకోలేనా?’’
*****
పుట్టింట్లో ఏదో పని తగిలి రమాదేవి ఊరికి వెళ్ళింది. రఘురామయ్య స్కూలికి వెళ్ళాడు. ఆరోజు మంచి అవకాశమని తోచి నేనాఫీసుకు శలవు పెట్టాను. శ్రీవల్లికుమారి నన్ను కారణమడిగింది. తలనొప్పి అని చెప్పాను. ఆమె నాకోసం అమృతాంజనం తెచ్చిచ్చింది. థాంక్స్ చెబుతూ ‘’కాసేపు పడుకుంటే అదే తగ్గిపోతుంది. నాకదేమీ కొత్తకాదు’’ అన్నాను. ఆమె వెళ్ళిపోతూంటే ‘’ఆ గూట్లో ఓ పత్రిక ఉంది అందులో రెండు మంచి కథలున్నాయి నాకు చాలా నచ్చాయి. చదివి నీ అభిప్రాయం చెప్పు’’ అన్నాను.
ఆమె గూట్లోని పత్రిక తీసుకుని వెళ్ళిపోయింది. అది మామూలు పత్రికే! కానీ అందులో నేను మరో పత్రికనుంచి తీసిన రెండు కథల కటింగ్స్ ఉంచాను. ఆ కథలు మామూలు పత్రికలలో ఉండవు. వాటిలోని భాష అలాగా జనం వాడే పచ్చి బూతులు. శ్రీవల్లికుమారి నన్ను తప్పుబడితే పొరపాటు జరిగిందని చెప్పవచ్చు. కానీ హరనాథ్ అభిప్రాయం ప్రకారం వయసు కుతూహలం వల్ల ఆమె ఆ కథలు పూర్తిగా చదువుతుంది. చదివేక ఆమెలో కొన్ని మార్పులు వస్తాయి. ఆ మార్పులామెను నా పథకానికి అనుకూలం చేస్తాయి. నేను కళ్ళు మూసుకున్నాను. కానీ నిద్ర పట్టడం లేదు. నా ఆలోచనలన్నీ శ్రీవల్లికుమారి చుట్టూ తిరుగుతున్నాయి. ఆమె ఇప్పుడేం చేస్తోంది? హరనాథ్ చెప్పిన ప్రకారం ఒక గంట వ్యవధినిచ్చి ఆమె యింటి తలుపు తట్టాను.
‘’ఎవరూ?’’ అన్నదామె గొంతు.
‘’నేను’’ అన్నాను.
ఆమె తలుపు తీసి నా వంక ప్రశ్నార్థకంగా చూసింది.
నేను సూటిగా ఆమె వంక చూడలేక తల వంచుకుని, శ్రమ అనుకోకుండా ‘’కాస్త కాఫీ కలిపిస్తే నా తలనొప్పి పోతుందేమో’’ అన్నాను.
‘’లోపలకు రా’’ అందామె.
‘’నేను వెళ్ళాను. ఆమెనన్నో కుర్చీలో కూర్చోమని అయిదు నిముషాల్లో నాకోసం కాఫీ కలిపి తెచ్చింది. నేను కాఫీ తాగుతూ ఆమె వంక చూస్తున్నాను. ఆమె కళ్ళలో కోపం ఎరుపురంగులో ప్రతిఫలిస్తోంది. ఆ ఎరుపు క్రమంగా చిక్కబడుతోంది. నేను కాఫీ తాగడం ఆపగానే ఆమె ‘’నీతో ఓ విషయం మాట్లాడాలి’’ అంది కోపం గొంతులో కూడా ఎర్రగా ధ్వనిస్తోంది. నేను ధైర్యం తెచ్చుకుని ఆమెవంక చూస్తూ
‘’మాటలు తర్వాత! ఒక్కక్షణం అలాగే నిలబడతావా?’’ అన్నాను.
‘’ఎందుకు?’’ అందామె తెల్లబోయి.
‘’నీ బొమ్మ గీస్తాను’’ అన్నాను.
‘’నీకు బొమ్మలు గీయడం వచ్చా?’’ అందామె ఆశ్చర్యంగా.
‘’ఏమో! నీ రూపం, నీ చూపులు నాలో ఇన్స్ పిరేషన్ నీ బొమ్మ గీయమని నన్ను ప్రోత్సహిస్తోంది. బొమ్మ బాగా వస్తే అది నీ గొప్పతనం’’ అన్నాను.
ఏమనుకుందో ఆమె ఒప్పుకుంది. నేను నా జేబులోంచి ఓ కాగితం తీశాను. ముందుగానే ఉంచుకున్న వీనస్ పెన్సిలు ముక్క కూడా తీశాను. అయిదునిముషాల్లో బొమ్మ వేయడం అయిపొయింది’’ అని కాగితం మడిచి జేబులో పెట్టుకున్నాను.
‘’బొమ్మ నన్ను చూడనీ!’’ అందామె నన్ను సమీపిస్తూ.
‘’వద్దు-‘’ అన్నాను కానీ బలవంతంగా ఆమె నా జేబులోంచి లాక్కుంటే ప్రతిఘటించలేదు. ఆ కాగితంలో ముఖం అస్పష్టంగా ఉన్న ఓ నగ్నసుందరి బొమ్మ ఉంది. అది నేను ఏదో పత్రికలోంచి ట్రేస్ తీసి జేబులో ఉంచుకున్నాను.
‘’ఛీ! ఇదా నా బొమ్మ?’’ అందామె కోపంగా.
‘’నేను నిన్ను గీయలేడు. నీ అందాన్ని గీశాను’’ అన్నాను.
ఆమె కోపంగా ‘’నువ్వు మంచివాడివనుకున్నాను గెటౌట్’’ అంది.
నేను చటుక్కున ఆమె పాదాలపై వ్రాలిపోయి ‘’ప్లీజ్ నన్ను పొమ్మనకు... నువ్వేం చెబితే అది చేస్తాను’’ అన్నాను.
ఆమె అప్రతిభురాలైపోయింది. నేను లేచి నిలబడ్డాను. తెల్లబోయి నావంకే చూస్తున్న ఆమెను కౌగలించుకుని ‘’నేను తప్పు చేస్తే ఆ తప్పు నాదికాదు. నీ అందానికి’’ అన్నాను.
ఆమె నన్ను విడిపించుకోలేదు. నెమ్మదిగా ‘’నీవు తప్పు చేసినా నేను చేయనివ్వను. నీవు తప్పనుకుంటున్నదే ఒప్పు అనిపించుకునే మార్గమొకటి వేరే ఉంది. అది నీకు తెలిసే ఉండాలి’’ అంది.
‘’ఈ క్షణం నుంచి నీవు నా భార్యవు’’ అన్నాను ఆవేశంగా.
ఆ తర్వాత ఆమెను వశపర్చుకోడానికి నేనెన్ని అబద్ధాలు చెప్పానో నాకే తెలియదు. అవి ఆ క్షణంలో నాలోంచి సహజంగా ఆశువుగా పుట్టుకొచ్చాయి. నా కోరిక నెరవేరేదాకా శ్రీవల్లికుమారికంటే హరనాథ్ కే నేనెక్కువ కృతజ్ఞుడిననిపించింది. ఆమె కంటే ఎక్కువగా అతడే నాకు గుర్తుకొస్తున్నాడు. ఇద్దరం ఇంకా ఓకే మంచంమీద ఒకరి పక్కన ఒకరున్నాం. ఆమె ప్రేమగా తన చేతివ్రేళ్ళతో నా జుట్టు నిమురుతోంది. నాకు మంచంమీద లేవాలనిపించలేదు. ఇంకా నేను చెప్పాల్సిన డైలాగులున్నాయి.
అయి ఇప్పుడే చెప్పాలా మరోసారా అని ఆలోచిస్తున్నాను. శ్రీవల్లికుమారితో గడిపిన ఆ క్షణాలు నాలో అలౌకికానందాన్ని కలిగించాయి. ఆమె మనిషి కాదు, దేవత అనిపిస్తోంది. ఆ దేవతకు అప్పుడే నిజం చెప్పేసి దూరం చేసుకోనా? ఇంతకీ నేనేం చెప్పాలి? ‘’నేను మా నాన్న మాట కాదనలేను. అమ్మ మనసునొప్పించలేదు. వాళ్ళిద్దరూనీతో పెళ్ళికి అంగీకరించరు. ఆవేశంలో అవసరం కోసం నీకు మాయమాటలు చెప్పి వంచించాను నేను. నన్ను క్షమించమని అడిగే అర్హతను కూడా కలిగిలేను. శ్రీవల్లికుమారీ! నేను పాపిని నా పాపానికి ప్రాయశ్చిత్తమేమిటో నువ్వే చెప్పు ....’’ ఉలిక్కిపడ్డాను. నేనెప్పుడో అనాలనుకుంటున్న ఆ మాటలు అప్పుడే వినబడ్డాయి.
అదీ శ్రీవల్లికుమారి నోట! అప్పుడామే చటుక్కున లేచి కూర్చుని నా వంక అదోలా చూస్తూ ‘’నువ్వు చెప్పాలనుకుంటున్న ఈ డైలాగులు నాకెలా తెలిశాయని ఆశ్చర్యంగా ఉందా? నీ గురించి, నీ పథకం గురించి నాకు హరనాథ్ చెప్పాడు’’ అందామె.
తెల్లబోయి ‘’హరనాథ్ నీకెలా తెలుసు?’’ అన్నాను.
‘’నేకు ముందరావీధి గదిలో ఉండేవాడు. అతడు నన్ను పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు. కానీ నాకతడు నచ్చలేదు.. ఆ విషయం చెప్పాను. ఆ తర్వాత అతడు నాకోసం ఇప్పుడు నువ్వు వేసిన పతకమే వేశాడు. సాచి లెంపకాయ కొట్టాను. ఇల్లు ఖాళీచేసి పోతూ ‘’నేను తప్పు చేయబోయానని నన్ను నేరస్థుడనుకో కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైనా అలాగే ప్రయత్నించగలరని ఋజువు చేస్తాను’’ అని వెళ్ళిపోయాడు. నాలుగు రోజులక్రితం నాకు కనబడి నీ గురించి హెచ్చరించి వెళ్ళిపోయాడు’’
‘’అయితే ...?’’ అని ఆగిపోయాను. ఎందుకో నాకు గొంతు పెవలలేదు.
‘’పత్రికలో బూతు కథలు పెట్టావనీ, ముందుగానే బూతు బొమ్మ గీసి తెచ్చుకున్నావనీ నాకు తెలుసు. అయినా నీ దవడ పగల్లెదంటే అందుక్కారణం ఒక్కటే ....’’అని ఆగిందామె.
నేనామె ముఖంలోకి చూడాలనుకున్నాను కానీ సాథ్యం కాలేదు.
‘’తను ప్రేమించిన ఆడదాన్ని తాత్కాలికంగా కోరేవాడికి ఆడదేప్పుడూ ఆడదే! ఆ ప్రేమను శాశ్వతం చేసుకోవాలనుకుంటే అతడామెలోని ప్రణయదేవతను గుర్తించగల్గుతాడు. నిన్ను ప్రేమించిన నేను నీ మనసును కనిపెట్టలేక నీ దురూహ తెలిసి కూడా నిన్ను కాదనలేదు’’ అందామె.
నాకార్థమౌతోంది నేనామెను వంచించాననుకుంటే అది నిజంకాదు. ఆమె వంచించబడిందన్నదే నిజం. జీవితంలో నాకు తోడుగా, ఆడది కావాలా, ప్రణయ దేవత కావాలా? సమాదానానికై అన్వేషించే యువకులు నన్నే ఆదర్శంగా తీసుకోవాలనుకుంటే నా అనుభవం గురించి చెప్పకతప్పదు. మా వివాహమై ఇప్పటికి పదిహేనేల్లయ్యింది నా జీవితంలో అప్పటికీ, ఇప్పటికీ బహుశా ఎప్పటికీ నేను చేసిన మంచిపని శ్రీవల్లికుమారిని పెళ్ళి చేసుకోవడం మాత్రమేనేమో అనిపిస్తూంటుంది నాకు.
|
|


