షివి.డి.ఎస్.ప్రకాష్
.png)
గీతమాలిక - ఫిలింనగర్ లోని రెండంతస్థుల భవంతి ముఖద్వారం ముందు ముగ్ధమనోహరంగా ఆ అక్షరాలు. వాటిని తమకంగా, తన్మయంగా చూస్తున్నాడు సమీర్. వెండితెరకు లలిత, లలితంగా సాహితీ పరిమళం అద్దడంలోనే కాదు. తన సొంత భవంతికి పేరు పెట్టడంలోనహో విరించికి ఎంత భావుకతో? ఆ ఆలోచనతోనే సమీర్ శరీరం పులకరించింది. ఇక, ఉండబట్టలేక ఇంకాస్త దగ్గరగా వెళ్ళి అక్షరాలను తడిమితడిమి చూశాడు.
ఉదయం పదిగంటలైంది. అంతగా జనసంచారం లేని ఫిలింనగర్, ప్రత్యేకించి ఆ భవంతిలో ప్రశాంతత రాజ్యమేలుతోంది. చీమ చిటుక్కుమన్న విన్పించేంత నిశ్శబ్దం. గేతులోంచి ఆ భవంతిలోకి చూపు సారించాడు సమీర్. ఇంటిముందు భాగంలో చిన్నతోట. అది పాటల పూదోటో మరి. పిల్లగాలి పలకరింపులకే పరవశాన శిరస్సూపుతూ పల్లవిస్తున్నాయి గులాబీలు, మల్లెలు, మరువాలు. పక్కనే ఖాళీ స్థలంలో బుల్లి 'మారుతీ' విశ్రాంతి తీసుకుంటోంది. గేటు తెరిచాడు సమీర్. 'సినీ శారదాపీఠం' అనిపించింది సమీర్ కి. నెమ్మదిగా లోనికి నడిచాడు. కాలింగ్ బజ్జర్ కోసం అటూ ఇటూ చూస్తుండగా
'ఎవరూ!' అంటూ వచ్చాడో వ్యక్తి. అతను
కవిగారి పి.ఏ. కాబోలు. "నా పేరు సమీర్ ... విరించిగారితో కాస్త పనుండి వచ్చాను'' చెప్పాడు సమీర్.
"ఏం పని?'' అని అడిగాడతను.
"కవి గారి సినీగీతాల మీద రీసెర్చ్ చేయబోతున్నాను. నిన్న ఫోన్ చేస్తే ఇవ్వాళ రమ్మన్నారు. అందుకే ...''
"కూర్చోండి ...'' అంటూ ఆ వ్యక్తి లోనికి వెళ్ళిపోయాడు.
సమీర్ అక్కడ సోఫాలో కూర్చున్నాడు. ఆ హాలు ఎంతో చూడముచ్చటగా ఉంది. సినీ గీత రచయితగా విరించి విసిద సందర్భాల్లో అందుకున్న అవార్డులన్నీ నిలువెత్తు బీరువాలో ఓ పక్క కొలువుదీరి ఉన్నాయి. సినీ, రాజకీయ ప్రముఖుల సరసన, శాత దినోత్సవ సంబరాల్లో ఆయన పాల్గొన్న సన్నివేశాలతో కూడిన చిత్రాలు గోడలకు అలంకరించి ఉన్నాయి. వాటిని అలా సమీర్ చూస్తుండగానే విరించి అక్కడికి వచ్చారు.
పరస్పర పరిచయ వాఖ్యాలయ్యాక సమీర్ అన్నాడు "మిమ్మల్ని డిస్టర్బ్ చేయలేడు కదా ...!''
"నో నో ... 'గోధూళి' ప్రొడక్షన్స్ కి 'యుగళం' రాస్తున్నాను. రొటీన్ వర్క్'' చెప్పాడాయన.
"అయితే, ఇది పదివేల, యాభై ఒకటో పాట'' చటుక్కున అందుకుని అన్నాడు సమీర్.
తన కలం నుంచి జారిపడే ప్రతి అక్షరాన్ని లేక్కకడుతూ అమితమైన ప్రమాభిమానాలు ప్రదర్శిస్తున్న అభిమానులను తలుచు కున్నప్పుడల్లా విరించి కళ్ళలో ఆనందం, ఆశ్చర్యం ప్రస్ఫుటమవుతాయి.
"అవునండీ మొన్నే విడుదలైన 'వాహ్యాళి' చిత్రంలో మీరు రాసిన పాటలతో లేక్కవేస్తేనే ఈ సంఖ్య వచ్చింది. మూడు దశాబ్దాల నుంచి విరామం లేకుండా మీ కలం సృష్టిస్తున్న 'సినీ సాహితీ సృజన'ను టి దగ్గరగా గమనిస్తున్న అభిమానిని. మీరు రాసిన ప్రేమ గీతాలు, విషాద గీతాలు, టీజింగ్ సాంగ్స్, జానపద పంథాలోని పాటలు, కాలేజ్ బ్యాక్ డ్రాప్ లోని పాటలు ... ఇలా అన్ని రకాల పాటలను విభాగాలుగా విభజించి మరీ సేకరించాను.
అక్షరాలతో మీరు ఆడుకుంటున్న వైనం, రచనా శైలి, చేస్తున్న ప్రయోగాలు ... ఎన్నో ... ఎన్నింటినో 'టీక తాత్పర్యం'తో సహా విశ్లేషించాను. మీరు అనుమతిస్తే 'పి.హెచ్.డి.' కోసం మీ గీతాలపై థీసీస్ సబ్మిట్ చేయాలని నా చిరకాల వాంఛ''
విరించి నోట మాట రాలేదు. ఏకాగ్రతతో సమీర్ చెప్పిన మాటలు వింటున్నాడు.
"నా దృష్టిలో మీరు 'అల్లసాని' వారికి ఆధునిక రూపం. అలనాటి శ్రీనాథుడికి మరో మారువేషం. అంతటి భాషా ప్రావీణ్యం మీది. ప్రముఖ వాగ్గేయకారులైన త్యాగయ్య, అన్నమయ్యలకు అసలుసిసలు సాహితీ వారసులు మీరు. సమకాలీన పరిస్థితుల దృష్ట్యా సినీ మీడియాకు మీరు రచనలు చేస్తూనే మీ ప్రత్యేకత నిలబెట్టుకోవడంలో మీకు మీరే సాటి అని ఏవేవో చెబుతున్నాడు సమీర్.
విరించికి సిన్మానాలు, పొగడ్తలు కొత్త కానే కావు. చిత్రం హిట్ అయినా, ఆడియో సూపర్ హిట్ అయినా సినీ గేయ రచయితగా ఆయన సత్కారాలు అందుకుంటూనే ఉంటారు. కొత్త సినిమా ఆడియో రిలీజ్ కాగానే విని, వెన్వెంటనే సంతృప్తి కలుగుతుంది. 'పి.హెచ్.డి.' సిద్ధాంతం గ్రంథానీకున్న విలువేమిటో విరించికి తెలుసు. అందుకే ఆయన ఇలా అన్నారు.
"ఈ కాలానికి తగ్గట్లు సినిమాకి సాహిత్యం సృష్టిస్తున్నా, ఈ సృష్టించిన సాహిత్యానికి శాశ్వతత్వం కావాలన్నది ఈ కోరిక నాలో చాలా కాలంగా ఉంది. అందుకే, పాటలతో సంచలనాలు వెలువరించేందుకు పబ్లిషర్ ముందుకు వస్తే రాయల్టీతో సంబంధం లేకుండానే అనుమతిస్తూ వచ్చాను. విరించి పాట కచేరి పేరిట ఇంతవరకు ఆరు సంకలనాలు కూడా వచ్చాయి.
అవునన్నట్లు తలూపాడు సమీర్.
"మీ ప్రయత్నం బహుధా ప్రశంసనీయము. సినీ రచయితలూ ఎంత అద్బుత భావాన్ని ప్రకటించినా ఆ సృష్టికి ఆదరణ అంతంత మాత్రమే. విడివిడిగా కొన్ని కావ్య సంపుటములు వెలువరించి కవిగా నన్ను నేను ఆవిష్కరించుకునే తపన వున్నా ఈ మీడియాలో పని ఒత్తిడివల్ల ఆ పనిచేయలేకపోతున్నాను. ఇన్నాళ్ళ నా సినీ పాటకు కావ్య గౌరవాన్ని ఆపాదిస్తూ ఓ సిద్ధాంత గ్రంథాన్ని వెలువరించేందుకు మీరు ముందుకొచ్చారు. అందుకు చాలా సంతోషం. నావంతు ప్రయత్నంగా సినీ సాహిత్యానికి సంబంధించి నా మొట్టమొదటి రచన నుంచి ఇప్పటి వరకూ నే రాసిన పాటలు ... వాటి నేపథ్యాలు ... అనుభవాలు ... విలువను బట్టి మీకు అందిస్తాను''
ఆయన చెప్పింది విని సమీర్ పొంగిపోయాడు. విరించి పాదాలను తాకి కృతజ్ఞతలు చెప్పాడు.
సినీ వినీలాకాశాన అత్యద్భుత సాహితీమూర్తిగా ప్రకాశిస్తున్న విరించి తన 'థీసిస్' వర్క్ కి ఆమోదం తెలపడంతో తనూ సాహితీ మూర్తుల సరసన కూర్చుండే అపురూప వరం దొరికినట్లనిపించి ఆనందపడిపోయాడు విరించి.
*****
"ఈ సీన్ లో హీరోయిన్ ని తడిపి పిండి ఆరేస్తాం. పల్చటి తెల్ల చీరలోని అందాలకు కెమారా కన్ను కొడుతుంటే థియేటర్లో ప్రతి ప్రేక్షకుడూ థ్రిల్ అవ్వాల్సిందే. అందుకే, ఈ సీన్ లో ఓ పాటకి మీరు రాయాలి ...'' డైరెక్టర్ పరాంకుశం చెబుతున్నాడు.
"అమ్మాయెవరూ?'' విరించి అడిగాడు.
"ముంబాయి ముద్దుగుమ్మ. పేరు తరళ ... స్టన్నింగ్ బ్యూటీ. ఇంతవరకూ రెండు హిందీ పిక్చర్లు చేసింది.''
"అలాగా ...!'' అన్నారు విరించి.
"ఈ పాట మీరు రాస్తేనే సూపర్ హిట్టవుతుందని మా నమ్మకం. రికార్డింగ్ ఎప్పుడు ఫిక్స్ చేసుకోమంటారు?''
"ఇప్పటికే అంగీకరించి నేనివ్వాల్సిన మీ పాటను పూర్తి చేసేసరికి పదిరోజులు పట్టొచ్చు'' అన్నాడాయన.
డైరెక్టర్ ఒక్కసారి ఖంగుతిన్నాడు విరించి మాటలకు. "సార్ అలాగనకండి! మీరు తలచుకుంటే అయిదు నిముషాల్లో మాటని పాటగా మార్చేస్తారు. తెల్లకాగితం మీద నల్ల అక్షరాలతో మీరేది గెలికినా అది పాతవుతుంది. అంతెందుకు పాట మీరు వ్యాసంలా రాసినా మా మ్యూజిక్ డైరెక్టర్ తన తిప్పలోవే తాను పడతాడు. ప్లీజ్, మారు మాటాడకుండా ఓ పాట ఇవ్వండి'' బతిమాలుతున్నాడు డైరెక్టరు.
"అది సరే! పాట రాయాలంటే నాకు మూడంటూ రావాలి కదా!'' అన్నారు విరించి.
"మూడ్ కోసమా సార్, మమ్మల్నింతగా భయపెట్టింది. శ్రీగిరి ఫామ్ హౌస్ లో రూమ్ కేటాయిస్తున్నాం. అక్కడ అన్ని సౌకర్యాలు అందుబాటులోనే ఉంటాయి. మా పరిస్థితి గమనించి వేగంగా పాట ఇస్తే ధన్యులం'' అంటూ డైరెక్టర్ శ్రీగిరి ఫామ్ హౌస్ లో రూమ్ బుక్ చేసే ప్రయత్నాలు ప్రారంభించాడు.
శ్రీగిరి ఫామ్ హౌస్ లోని బాత్ రూమ్ షవర్ కింద సరిగంగ స్నానాలు చేస్తున్నారు విరించి, షర్మిల. పల్చటి తెల్లచీర తడిసి ముద్దయితే షర్మిల ఎంతో ముద్దొస్తుంది విరించికి. వంపు సొంపులతో హంపి శిల్పాన్ని చూస్తున్నారాయన. ఆమెని దగ్గరగా తీసుకుని హృదయానికి హత్తుకుంటుంటే కౌగిట్లో ఖజురహో ఒదిగిన అనుభూతి కలుగుతోంది విరించికి. గాలికూడా చొరబడలేని దగ్గరతనంతో మత్తటయిన, గమ్మత్తైన అనుభవంతో అతడి మెదడు పదునెక్కుతోంది.
తను చిన్నప్పుడు చదివిన ప్రబంధ సాహిత్యంలోని కావ్యనాయికలు ఒక్కక్కరుగా అతడి కళ్ళముందు సాక్షాత్కరించడం మొదలెట్టారు.
అల్లసారివారి అల్లికి జిగిబిగి - వరూధిని.
కాళిదాసు - మాళవిక.
జయదేవుడి అష్టపదిలోకి ఇష్టసఖి - రాధిక.
దేవులపల్లివారి - ఊర్వశి.
నండూరి - ఎంకి.
విశ్వనాథ - కిన్నెరసాని.
ఇలా, ఎందరెందరో అందగత్తెలు ఆ సమయంలో అతడి కళ్ళముందు ప్రత్యక్షమయ్యారు. జూనియర్ ఆర్టిస్ట్ ని మరీ దగ్గరగా తీసుకున్నారు విరించి. అతడి 'కలం'లోకి 'సిరా'లో కదలిక ప్రారంభమైంది. అది కాగితంపై భళ్ళున వాంతి చేసుకుంది. అది ఓ పాటగా పరిణమించింది. మరో వారంరోజుల్లో రికార్డింగ్ పూర్తిచేసుకున్న ఆ పాట ముంబాయి హీరోయిన్ పై దర్శకుడు మారిషస్ లో వాన నేపథ్యంలో చిత్రీకరించారు.
ఆ పాట చిత్రం విడుదలైన తర్వాత ఓ సెన్సేషన్ సృష్టించింది. ఏ ఊరులో, ఏ వాడలో విన్నా కైపెక్కించే ఆ పాటే జనం నాలుకలపై నర్తిస్తోంది. ***** సమీర్ అడిగాడు విజయవంతమైన ఆ పాట పుట్టుక నేపథ్యాన్ని. ఒక్కసారిగా విరించి గొంతుకేదో అడ్డం పడ్డటయింది. "చెప్పండి సార్! ఈ మధ్యకాలంలో ఈ పాట ఆంధ్రదేశాన్ని తుఫానులా ఊపేసింది. ప్రత్యేకించి యువతని. ఈ పాట మెస్మరైజ్ చేసేసింది. కళాత్మక విలువలతో కావ్యనాయికలను స్మరిస్తూనే కమర్షియల్ గా ఓ పాటను థీసీస్ లో చర్చకు ఆసక్తికరమైన అంశమవుతుంది'' అన్నాడు సమీర్.
ఒక్కో శృంగార గీతం పుట్టుక వెనుక మంచులా కరిగిన ఏకాంతరాత్రుల జ్ఞాపకలున్నాయి విరించికి. అందరూ కవులూ అలాగని కాదు కానీ, విరించికి మాత్రం ఆ బలహీనత మెండుగానే ఉంది. పదహారేళ్ళ ప్రాయాన్ని గేయంగా మార్చేసే రచనాశైలి విరించి సొంతం. అతడాలోచిస్తున్నాడు తన సినీ పాట నేపథ్యం గురించి. బతుకుతెరువు కోసం సినీపాటను ఆశ్రయించాడు. ఎన్ని అల్లరి పాటలు రాశాడో? తన పాట ఒకసారి వయసొచ్చిన ఆడపిల్ల పైటలా అల్లరల్లరిగా జారిపోతుంది, మరోసారి పైటచాటు పరువాలను తడిమి తడిమి చూస్తుంది. ఇంకోసారి బొద్దుకిండా చీరని, నడుం దగ్గర మడతని అందముగా మృదువుగా స్పృశిస్తుంది.
అంతేనా! ఆడదాని శరీరంలో అణువణువునీ అక్షరావలోకనం చేసేసింది తన పాట. "రవి కాంచని చోట కవిగాంచునే ...!'' అన్నట్లు ఆడదాని రవిక ఆనిన చోటనే తన కవికాలం గుచ్చి గుచ్చి చూసింది. పైటచాటు అందాలను అర్తచంద్రాకారంతో సరిపోల్చింది తన పాళీ, తను చదివిన ప్ర్రబంధ సాహిత్యాన్నంతా పైత్యంగా మార్చి సినీ గీతాల్లో గుమ్మరించాడు. ప్రాచీన సాహిత్యంలో కావ్య గౌరవాన్నందుకున్న నాయికలను వెండితెర రచ్చకీడ్చి భ్రష్టుపట్టించాడు.
ద్వందార్థ సినీ గీత సృష్టిలో తనకు తానే సాటి అనిపించుకున్నాడు. అలాంటి తనకు థీసీస్ సత్కారమా? అలా ఆలోచిస్తుంటే తనపైన తనకే ఓ విధమైన ఏవగింపు కలిగింది విరించికి.
అందుకే విరించి ఇలా అన్నాడు "మరోలా భావించకండి మీ సిద్ధాంత గ్రంథానికి నా సినీ సాహిత్యం సరైన సబ్జెక్ట్ కాదు. మీరు మరో అంశాన్ని పరిశీలించండి. నా సాహిత్యం ఆకలిపాట, అల్లరిపాట. అంతే! దానికంత కావ్యగౌరవం ఆపాదించాల్సిన అవసరం లేదు. అల్లసాని నుంచి త్యాగయ్య, అన్నమయ్య సాహితీ సృజనతో నా సాహిత్యాన్ని మీరు పోల్చారు. మొదట నేనూ ఆనందిచాను.
సినీ సాహిత్యంతోనే అంతటి సాహితీ మూర్తుల సరసకు చేరానని! అది మూర్ఖత్వమని అర్థమైంది నాకిప్పుడు. ఎంతటి మూర్ఖత్వమంటే అలాంటి సాహితీమూర్తుల విశేష సృష్టిని పనికిరాని నా చెత్త సినిమా పాటల స్థాయికి చేర్చినంత మూర్ఖత్వమని అర్థమైంది నాకు. అన్నమయ్య, త్యాగయ్య కీర్తనలు నా కూతుర్లు పాడుతుంటే తన్మయంగా ఆలకించే నేను ద్వంద్వార్థాల నా సినిమా పాటను అదేనోటితో పాడుతుంటే హర్షించగలనా? విని అభినందించగలనా? అది తలుచుకుంటేనే నా పాట స్థాయి, పరిణతి అర్థమవుతోంది. ప్లీజ్ మరీ నన్ను కించపరచకండి. మీ థీసీస్ ని అవమాన పరచకండి'' చెబుతున్న విరించినే చూస్తున్నాడు సమీర్.
అతడి కళ్ళకు బోయవాడు వాల్మీకిగా మారుతున్న అపూర్వ దృశ్యం కనిపిస్తూందిప్పుడు. ఈయన సాహిత్యం మీదనే థీసీస్ సబ్మిట్ చేసి తీరుతాను. పి.హెచ్.డి. అందుకుంటాను. కానీ ఇప్పుడు కాదు, మరో రెండేళ్ళ తర్వాత. ఎందుకంటే ఈ పుంభావ ... సరస్వతి. మదిలో అంతర్మథనం ప్రారంభమైంది. ఇక అసలు సిసలైన సాహిత్య సృష్టి మొదలవబోతోంది. ఎస్ ...! ప్రబంధ సాహిత్యాన్ని పుక్కటపట్టి ఆధునిక సాహిత్యం లోతులు చూసిన ఈ మనిషి రుషి కాబోతున్నాడు. మహాకావ్య సృష్టికి సిద్ధం కాబోతున్నాడు. నా అంచనా ఎప్పటికీ తప్పుకాదు నా నృషి: కురుతే కావ్యం'' అనుకున్నాడు సమీర్.
|
|


