.png)
మందిరం ముందే బలి వేదికలు ఏర్పాటు చేశారు. చందనం చెక్కలు అక్కడ పేర్చబడి వున్నాయి. మరో ప్రక్క వన మూలికలతో నిండిన రాశి ఎత్తుగా కనిపిస్తోంది. పూజా సామాగ్రి అంటా సిద్ధం చేశారు. అలంకరించిన మట్టి కుండలు, నెయ్యి దీపాలు, సురా పాత్రలు కూడా వున్నాయి. వెండి పళ్లెరాల్లో అక్షింతలు, మరో పాత్రలో పసుపు-కుంకుమలు, రకరకాల రంగుల కుసుమాలు, అక్కడక్కడ రంగుల పతాకాలు అలంకరించబడివున్నాయి.
సమయంకాగానే మళ్ళీ నగారాలు మ్రోగాయి. తాంత్రికుడు మహారాజు దగ్గరికి వెళ్లి - "మహారాజా మీరు లేచి మందిర ప్రారంభోత్సవం చేసి శిలా ప్రతిమలకు ప్రాణ ప్రతిష్ట చేయండి!''
మహారాజు, మహారాణి ఇద్దరూ లేచి నిల్చున్నారు. మందిర సింహద్వారం దగ్గరికి చేరుకున్నారు. మందిరానికి క్రింది భాగంలో అరుణ పట్టు వస్త్రాన్ని ద్వారం దగ్గర కట్టివుంచారు. మహారాజు దాని ఒక భాగాన్ని లాగి తేరా చాటును తొలగించారు. బాజా-భజంత్రీలు మ్రోగాయి. జన సముదాయమ్లో కరతాళ ద్వనులు మిన్నుముట్టాయి. మందిరోద్ఘాటన జరిగిపోయింది. మహారాజు, మహారాణితో మందిర ప్రవేశం గావించాడు. "ఓం నమశ్శివాయ'' అన్న తాంత్రికుడి ఉద్ఘోష మందిరమంతా ప్రతిధ్వనించింది. మందిరంలోనే ఎక్కడో పలుకుదు బండల్ని ప్రతిష్టించారా అన్న భ్రమకలిగింది కొందరికి. ఎందుకంటే తాంత్రికుడు పలికిన పంచాక్షరీ మంత్రం లోపల రెండు మూడుసార్లు ప్రతిధ్వనించింది.
భైరవ-భారవీ మూర్తిల్ని జ్యోతిర్లింగాన్ని గర్భగుడిలో వేదమంత్రాల మధ్య ప్రతిష్టింపచేశారు. ప్రాణ ప్రతిష్ట సంరంభం పూర్తయింది. లోపల తతంగం పూర్తికాగానే అందరూ మరలా మందిర ప్రాంగణంలో కొచ్చి తమ తమ స్థానాల్లో ఆసీనులయ్యారు. కీలక సన్నివేశం ప్రారంభమైంది.
అందరి ముందు నిల్చున్న తాంత్రికుడు ప్రజల్ని, ప్రముఖుల్ని ఉద్దేశించి మాట్లాడసాగాడు. "మహా ప్రజలు, మహామహులు, నగర ప్రముఖులకు, మహారాజు గండదేవుడికి, మహారాణిగారికి, అందరికీ స్వాగతం, సుస్వాగతం! మందిరోద్ఘాటన జరిగిపోయింది. భైరవీం భైరవులు మందిర ప్రవేశం చేశారు. వారికి ప్రాణ ప్రతిష్ట జరిగింది. వారికి నరబలి ద్వారా ప్రాణ-పుష్పాంజలి, సమర్పణ కార్యక్రమం జరుగవలసివుంది. ప్రాణ త్యాగం చేయగల భాగ్యం బహు కొద్దిమందికే లభిస్తుంది. ఆ పుణ్యకార్యానికి మన మహామంత్రి అయిన ఆదిత్యను ఎన్నుకున్నాము'' అని అనగానే అందరూ ముక్కు మీద వ్రేలు వేసుకున్నారు. పిడుగు పడ్డట్టయింది. మహారాణి గుండె వేగంగా కొట్టుకుంది.
"మహామాత్యుడు ఆదిత్యను ప్రవేశ పెట్టండి!'' అంటూ తాంత్రికుడు సింహగర్జన చేశాడు.
తాంత్రికుడి అనుచరులు ఆదిత్యను తీసుకుని వచ్చారు. వారి చేతుల్లో పదునైన కరవాలున్నాయి.
ఉద్విగ్నురాలైన మహారాణి - "మహారాజా! ఇది కుట్ర. ఈ నరబలిని నేను చూడలేను'' అంటూ అక్కడి నుండి లేచి అంతఃపురం వెళ్ళిపోయింది, మహారాజు వారించలేదు.
బలివేదికపై పూజ ప్రారంభమైంది. బలిదానం కోసం తేబడిన ఆదిత్యను శీలభద్రుడు రెప్పార్పకుండా చూడసాగాడు. అతని కళ్ళల్లో క్రోధాగ్ని తాలూకు విస్ఫులింగాలు ప్రస్ఫుటంగా కనిపించసాగాయి. బలివేదిక దగ్గరికి వణికిపోతూ కదిలివెళ్తున్న శీలభద్రుడిని చూసి భవానీ ఉద్విగ్నతతో లేచి నిలుచుంది. బలివేదిక ముందు ఉన్నత ఆసనంలో కూర్చున్న తాంత్రికుడి ముందు శీలభద్రుడు వీరభద్రుడై నిల్చోవటం అందరినీ సంభ్రమాశ్చర్యంలో ముంచేసింది. తర్వాత శీల యిలా అన్నాడు -
"తాంత్రికాచార్యా! మీరు నాకు ఇచ్చిన మాటను గుర్తుచేయటానికే మీ ముందు నిల్చున్నాను. నేనే వరం కోరినా ఎక్కడైనా, ఎప్పుడైనా యిస్తానని వాగ్థానం చేశారు. మీకు గుర్తుందా?''
"గుర్తుంది! ఏం కావాలి నీకు?'' గంభీరంగా ప్రశ్నించాడు భైరవానంద.
"నా ప్రాణ స్నేహితుడు ఆదిత్యను వదిలివేయండి. అతనికి బదులుగా ప్రాణత్యాగం చేయటానికి నీను సిద్ధంగా వున్నాను. భైరవ-భైరవీ చరణాలకు నన్ను బలివ్వండి. నా సాధన, నా గమ్యం పూర్తయింది. ఇహ నాకీ దేహం అవసరం లేదు. నా సృష్టిలోనే నేను విలీనమై పోతున్నందుకు సంతోషపడుతున్నాను. నన్నీ దేహబంధం నుండి త్వరగా విముక్తి గావించండి. ఆదిత్యకు స్వేచ్చను ప్రసాదించండి'' అన్నాడు శీల.
|
|


