.png)
"శిల్పాలు ఆగిపోయేవేమో, కానీ మీరు నాకు దక్కేవారు ...'' అంటూ పిచ్చిదానిలా గలగలా నవ్వేసింది భవానీ.
"చూడు భవానీ! ఖజురాహోలో అడుగుపెట్టిన ఏ ప్రయాణీకుడైనా నిన్నే అనేక బింబాల్లో చూస్తాడు. మాయను కప్పుకున్నా, బ్రహ్మ-శక్తినిఅర్థం చేసుకున్నా రాగి యోగిగా లేదా విరాగిలా మారినా నీవల్లే ఇలా జరుగగలదు. శిల్పుల తపస్సు, తాంత్రికుడి మంత్రపుష్పాల ప్రభావంతో ఆ శిల్పాలు ఎప్పుడుగానీ జీవన వేదాన్ని వల్లిస్తూనే వుంటాయి.''
"మనిద్దరి శిల్పాల్ని తయారు చేశావు. కానీ వాటిని ఎక్కడ ప్రతిష్టించాలనుకున్నావు?'' అడిగింది భవానీ.
"వాటికింకా స్థల సేకరణ జరుగలేదింకా? వాస్తు అనుమతించి వుంటే నీ ప్రతిమను అక్కడ ప్రతిష్టించే వాడినో తెలుసా?''
"ఎక్కడ?''
"అత్యున్నతమైన గర్భగుడి గోపుర శిఖరం మీద!''
"అదే నాకిష్టం లేదు. మందిరంలో ఆ స్థానం కంటే, మీ హృదయంలో శాశ్వతంగా వుండిపోతే చాలు శీలా! అంతకు మించి నేను కోరేదేమీ వుండడు''
"నా గుండెల్లో దాచుకున్న ఆ రసమయ ప్రమమూర్తిని బయటి ప్రపంచానికి పంచిపెట్టాలని నీవు భ్రమపడుతున్నావు భవానీ! అపోహ, అపార్థాల నుండి కొద్దిగా ప్రక్కకు తొలిగి నన్నుచూడ. మనిషి, మోహపు క్షణాన్ని జయించాలన్నదే నా అభిమతం! దానికోసమే ఈ శిల్పారామమంతా!''
"మీ శిల్పాల్ని చూసి, పునరపిమోహంలో మనిషి పడిపోతే, మోహపు క్షణమే మనిషిని ప్రాజితుడిని చేస్తుందేమోనని నా అనుమానం! ప్రేమ ఏ తరగతిలో పెట్టాలనుకున్నావు?''
"నీ ప్రశ్న చాలా కతినమైంది భవానీ! చెట్టు ముందా, విత్తుముందా అన్నట్టుగా వుంది. నీ బాధేమిటో ఇప్పటికీ నాకర్థం కావటం లేదు''
"ఈ అనేక శిల్పాల-రంగుల హరివిల్లులో, నన్నొక శిల్పానిగా చేయకు శీలా! బలహీనుల కోసం సృష్టించిన మీ కళాఖండాలు వారిని ఎంతవరకు ఉద్దరిస్తాయో కాలమే నిర్ణయించాలి. పంచభూత మాయమైన ఈ శరీరపు వుచ్చులోంచి బయటపడటం బలహీనులకు చేతకాదు''
"మనసుంటే మార్గముంటుంది. మనిషి బలహీనుడైనా ఎప్పటికైనా యీ ఖజురాహో శిల్పాలు అతడిని బలవంతుడిగా చేస్తాయనే నా నమ్మకం ...''
"అయితే నీకో పరీక్ష''
"ఏమిటా పరీక్ష?''
"ఆ సమ్మెటను తీసుకో!''
"తీసుకుని ఏం చేయమంటావు?''
"నా ప్రతికృతిగా చెక్కిన స్వప్నసుందరిని ఈ సమ్మెటతొ పగలగొట్టు''
"ఎందుకు?''
"నేను దగ్గరుండగా ఆ ప్రతిమ ఎందుకూ? ఆ ప్రతిమ పట్ల నీకెందుకంత మొహం?''
"అది నా సృజన కాబట్టి, నీవు చెప్పినట్టుగా నా చేతుల్లో ఆ పని చేయలేను ... భవానీ!'' "అయితే నా జీవితాన్ని సమాప్తం చేయి''
"ఏమిటి భవానీ! నీకేమైనా మతి భ్రమించిందా?''
"అది జరుగక ముందే నా స్థానాన్ని అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. నేనూ, నా ప్రతిబింబం రెండూ రెండు కరవాలాల్లా నిన్ను ఎప్పుడూ కలవర పరుస్తూనే వుంటాయి శీలా! ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవు. ఆ సమ్మెట ఇలా యివ్వు నా ప్రతిమను నేనే ధ్వంసం చేస్తాను''
"ఆ రోజు మీ నాన్న! ఈ రోజు నీవు - ఈ ప్రతిమను ముక్కలు చేయాలనుకోవటం చిత్రంగా వుంది. ఆ పని చేయకు భవానీ. నేకు పుణ్యముంటుంది. చేతులు జోడిస్తున్నాను''
"నన్ను నిజంగా నీవు ప్రేమిస్తూవుంటే, నేను సజీవంగా నీముందున్నప్పుడు, ఆ ప్రాణం లేని ప్రతిమ పట్ల నీ వ్యామోహం ఎందుకు? అంత మహాశిల్పివైన నీవే-నీవే ఆ మోహపు క్షణాన్ని జయించలేకపోతున్నావే ... మామూలు మనిషి ఆ పని ఎలా చేయగలడనుకుంటున్నావూ? ఆ మోహపు క్షణాన్ని నీవు యిప్పుడే జయించాలి. నీ నుండే అది ప్రారంభం కావాలి. శిల్పీ! లే అడ్డు తొలుగు''
"వద్దు! ఆ పని చేయకు ...''
"అయితే నన్ను కడతేర్చు''
"అది కూడా చేయలేను''
"అంటే - నా స్థానాన్ని ఆక్రమించుకున్న ఆ పాషాణం మీద నీకెందుకింత మోహమో, నాకు చెప్పి తీరాలి!'' ఆవేశంగా అడిగింది భవానీ.
"అది మొహం కాదు భవానీ!...'' "మరేమిటి?'' "ప్రేమ దాన్ని నేను ప్రేమిస్తున్నాను భవానీ! ప్రేమిస్తున్నాను ...'' జీరబోయిన కంఠంతొ అన్నాడు శీల.
|
|


