(178).png)
అతను వెళుతుంటే అనుమానంగా చూస్తూ వుండిపోయింది నాగమణి. సరిగ్గా అప్పుడే జగదీష్, విజయ్ కలిసోచ్చారు. ”ఆ తలుపు వేసేయ్ జగదీష్” అంది నాగమణి. జగదీష్ ఆమె చెప్పినట్టే చేశాడు.
”విజయ్, పోలీసు దర్యాప్తులో ఏమన్నా తెలిసిందా?” అడిగింది.
”లేదు. ప్రస్తుతం జగదీష్ చేసి వుంటాడని మాత్రం అనుకొంటున్నారు!” చెప్పాడు.
”ఆ రాత్రి పదకొండు, పన్నెండు మధ్య అతను నాతోనే వున్నాడు ఆ సాక్ష్యం చాలదా!”
”మేం ఆ సమయంలో నరేంద్ర ఫ్లాట్ లో ప్రవేశించి అతన్ని కొట్టిన విషయం అతను అంగీకరిస్తే సాక్ష్యానికి బలం వస్తుంది”
”మనం నరేంద్రని అనుమానించడానికి అవకాశం వుందా?” అడిగింది.
”అతను అక్కడే వున్నాడు కదా! హత్య చేసి పారిపోయి రావడానికి కొంత టైం పడుతుంది. అదీకాక జి.కె.ని హత్య చేస్తే అతనికి కలిగే లాభం లేదు” చెప్పాడు జగదీష్.
”అవును, నిన్ను బ్లాక్ మెయిల్ చేసి పదిలక్షల కోసం గడువుపెట్టాడు. ఆ గడువు లోపలే యీ నేరం ఎందుకు చేస్తాడు?”
”కక్ష సాధింపు కోసం చెయ్యొచ్చుగా!” అంది.
”కానీ అది ఆ సమయంలో చేయడం అతనికే నష్టం!”
”ఎలా?”
”ఒకవేళ మనం డబ్బు ఇవ్వడానికి సిద్ధపడితే – జి.కె. హత్యతో మనం ఆ గొడవలో పడిపోయి అతన్ని విస్మరించే అవకాశం వుంది. అందుకని మధ్యలో అతని పథకాన్ని అతనే పాడుచేసుకోడు” చెప్పాడు విజయ్.
”కరెక్ట్” అంది.
”మరో విషయం…” మెల్లగా అన్నాడు.
”ఒక విధంగా ఆస్తి మొత్తం నీ పేర్న ట్రాన్స్ ఫర్ చేయించడం మంచిదయింది. జి.కె. స్వయంగా అది నీకు రాసినట్లు వుంది. కనుక నీపైన పోలీసులకి అనుమానం లేదు. లేకపోతే మీ భార్యాభర్తల మధ్య అవగాన లేదని, జరిగిన సంఘటనల ఆధారంగా నువ్వు కూడా ఇరుక్కునే దానివి”
”అవును…. ఆ విషయం నేను కూడా ఆలోచించాను. నాకు చిన్న అనుమానం…” మెల్లగా అంది.
”ఏమిటి?”
”నాకెందుకో మల్లన్న మాటల్లో వ్యంగ్యం కనిపిస్తోంది!” అని అతను తనతో ఎలా మాట్లాడిందీ చెప్పింది.
”అతను ఈ హత్య నువ్వు చేశావనుకుంటున్నాడేమో!” అనుమానంగా అడిగాడు విజయ్.
జగదీష్ విజయ్ మాటలకి తల అడ్డంగా ఊపాడు. ”హత్య ఎలా జరిగింది అతనికి తెలుసనిపిస్తోంది నాకు!”
ఆశ్చర్యంగా చూసింది నాగమణి.
”మల్లన్నకి తెలుసంటావా?”
”అది చెప్పలేను. కానీ ఏదో ప్రయోజనం వుంది. ఆస్తి గొడవ కాదు అనుకుంటే జి.కె. పైన ఎవరికో చాలా పగ వుండాలి”
”ఇంతకాలం వూరుకుని ఇప్పుడు హత్య చేస్తారా?” అడిగింది.
”ఒక పథకం ప్రకారం చేయాలనుకొన్నప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తాడు మనిషి. నిజానికి నా జీవితాన్ని నాశనం చేశాడన్న కక్షతో నేనే జి.కె.ని చంపాలనుకొన్నాను. అదే సమయంలో నరేంద్రతో నీ సంభాషణ ఎక్స్ టెన్షన్ ఫోన్లో విన్నాను. నిన్ను ఆ ఉచ్చునించి ముందు తప్పించాలని వెళ్ళిపోయాను. ఏమో! ఆవేశంలో నేనే చంపేవాడ్నేమో!” అన్నాడు జగదీష్.
”సర్లే! నీకిన్ని గొప్ప తెలివితేటలుండబట్టే జి.కె. నిన్ను జైలుకి సులువుగా పంపించాడు. ఇంకెవరి దగ్గరా ఇలా మాట్లాడకు” మందలించింది నాగమణి.
విజయ్ గదిలో పచార్లు చేస్తూ ఆగి ఆమె కేసి చూశాడు. ”మణీ!” గంభీరంగా పిలిచాడు.
ఆమె అతనికేసి చూసింది.
”ఇక్కడ రెండు అంశాలు ఇమిడి వున్నాయి. ఒకటి… పాతపగతో అనుకొంటే ఈ ఘోరం ఇక్కడితో సమాప్తి అయిపోయినట్లే, కానీ ఆస్తితో ముడిపడి వుంటే హంతకుడు నిన్ను హత్య చేయడానికి ప్రయత్నిస్తాడు!”
ఉలిక్కిపడింది నాగమణి.
విజయ్ కళ్ళు ఎర్రగా వున్నాయి.
”ని…జ…మా…” అన్నాడు జగదీష్.
ఆమె భయంగా చూసింది. ”నన్ను హత్య చేస్తారా? ఎవరు?” ఉద్వేగంతో అంది.
”అవును. హంతకుడు గానీ, హంతకురాలు గానీ ఎవరు అన్నదీ తెలుసుకోవాలి!”
”నన్ను చంపాల్సిన అవసరం దేనికుంటుంది?”
”ఈ ముదనష్టపు ఆస్తి డియర్ మణీ!”
”నిజమే ఆంటీ! ఇక్కడే ఏదో లింకు వుందనిపిస్తోంది. జి.కె.కి దాయాదులెవరూలేరు.
”ఆయన చిన్న కూతురు దేవయానీ, నేను, నువ్వు తప్ప ఎవరూ లేరు! నా వెనక ఈ ఆస్తిలో భాగం నాకు చెందాలని కోరుకునే వాళ్ళెవరూ లేరు. పోలీసు కేసులో ఇరుకున్న నాడే నాకెవరూ సాయం చేయలేదు. నీ విషయానికొస్తే – ఇవాళ ఆస్తి మొత్తం నీ పేర్న వుంది. కాబట్టి జి.కె.ని చంపాల్సిన అవసరం నీకుగానీ, నీ వాళ్ళకి గానీ లేదు. ఇకపోతే దేవయాని! తండ్రి ప్రవర్తన కి రోత కలిగించబట్టే ఇంట్లోంచి వెళ్ళిపోయింది. స్వతంత్రభావాలు గల మనిషి తను.
ఈ ఆస్తిపాస్తులపైన ఆమెకి మక్కువ లేదు. కనుక ఆమెకి హత్య చేయాల్సిన అవసరం లేదు. కానీ…. ఆమె వెనక ఎవరున్నారు? ఆమె తల్లి వైపు బంధువులు గానీ, తండ్రివైపు గానీ ఆ అమ్మాయికి ఆస్తి చెందాలనుకున్న ఆశ గల వారున్నారా?” అన్న విషయం తెలుసుకోవాలి?” అన్నాడు జగదీష్.
|
|


