వెర్మిసెల్లి - సూజీ ఇడ్లీ

 


రోజూ ఉదయాన్నే టిఫిన్ చెయ్యాలంటే ఉప్మా, దోస, చపాతి, ఇడ్లీ ఇవన్ని కామన్ టిఫిన్స్ లా కనిపిస్తాయి. అదే ఏదైనా కాస్త వెరైటీగా కనిపిస్తే తినాలన్న ఇంట్రెస్ట్ పెరిగిపోతుంది. మాములు ఇడ్లీల కన్నా సేమియా ఇడ్లీలయితే చూడటానికి కలర్ ఫుల్ గా భలే ఉంటాయి కదూ. మరి అవి ఎలా చెయ్యాలో చూద్దాం.

కావాల్సిన పదార్థాలు:

వెర్మిసెల్లి - 200 గ్రా
బొంబాయి రవ్వ - 100 గ్రా
పెరుగు - 1 1/2 కప్పు
కేరట్ - 1
బఠాణి - 3 స్పూన్స్
పచ్చి మిర్చి - 3  
పోపు దినుసులు - కొద్దిగా
అల్లం - 1/4 స్పూన్
కరివేపాకు - కాస్తంత
వంట సోడా - కొద్దిగా
ఉప్పు -   రుచికి సరిపడా

తయారి విధానం:

ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి కాస్త నెయ్యి వేసి సేమియాని వేయించాలి. అవి బంగారు రంగుకి వచ్చాకా తీసి పక్కన పెట్టుకుని అదే కడాయిలో బొంబాయి రవ్వని కూడా వేయించి పెట్టుకోవాలి. ఈ రెండిటిని ఒక గిన్నెలో వేసి దానిలో పెరుగు, ఉప్పు, వంట సోడా కలపాలి. ఇప్పుడు కడాయిలో పోపుకి సరిపడా నూనే వేసి మినపప్పు, సెనగపప్పు, ఆవాలు, ఎండుమిర్చి వేసి అన్ని వేగాకా అందులో సన్నగా తరిగిపెట్టుకున్న కేరట్, ఉడికించిన బఠాణి, పచ్చి మిర్చి, అల్లం, కరివేపాకు వేసి అన్నివేసి 3 నిమిషాలు మగ్గనిచ్చి దానిని ముందుగా సిద్దం చేసి పెట్టుకున్న సేమియా, రవ్వ మిశ్రమంలో కలపాలి. కావల్సిన వాళ్ళు పోపులో జీడిపప్పు, స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు. అలా కలిపిన పిండిని ఒక గంట పాటు నాననివ్వాలి. తరువాత మాములు ఇడ్లీల లాగానే ఇడ్లీస్టాండ్లో పెట్టి 10 నిమిషాల తర్వాత దించి కొబ్బరి చెట్నీతో గాని, పల్లి చెట్నీతో గాని తింటే ఆహా ఏమి రుచి అనిపిస్తుంది.

...కళ్యాణి