వెనీలా కప్ కేక్స్(క్రిస్మస్ స్పెషల్)

 

 

 

కావాల్సిన పదార్థాలు :

1. ఒక గుడ్డు

2. ఒక టేబుల్ టీ స్పూన్ వెనిగర్

3. 60గ్రాముల నూనె

4. 1.3గ్రాముల ఉప్పు

5. 1గ్రాము బేకింగ్ సోడా

6. 95గ్రాముల పిండి

7. 60గ్రాముల పాలు

8. 80గ్రాముల పంచదార

9. వనీలా ఎసెన్స్

 

తయారు చేయు విధానం :
గుంటలు గుంటలుగా వుండే మఫెన్ లైనర్ తీసుకోవాలి. ఆ గుంటల్లో షాపుల్లో దొరికే మఫెన్ కప్స్ ఏర్పాటు చేసుకోవాలి. ఇలా ఏర్పాటు చేసుకున్న మఫెన్ మౌల్డ్ ని పక్కన పెట్టుకోవాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న పాలని తీసుకుని వాటిలో కొంచెం వెనిగర్ వేయాలి. ఈ మిశ్రమం కేక్ సాఫ్ట్ గా వుండేలా చూస్తుంది. 3, 4నిమిషాలు పాలు, వెనీల మిశ్రమం పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో గుడ్డు పగల కొట్టి లోపల వుండే సొన అందులో వేసుకోవాలి. పంచదార వేయాలి. కావాలనుకుంటే కొంచెం వెనీలా యాడ్ చేసుకోవచ్చు. దీని వల్ల గుడ్డు కారణంగా వచ్చే వాసన, రుచి తగ్గుతాయి. ఇక ఈ మొత్తం మిశ్రమాన్ని బాగా కలపాలి. లేదంటే మెసీన్ తో విప్ చేయవచ్చు. బాగా కలిసిన తరువాత పాలు, వెనిగర్ కలిపిన బటర్ మిల్క్ ని యాడ్ చేయాలి. మరోసారి కలపటం కానీ, విప్ చేయటం కాని చేయాలి.


ముందే సిద్ధంగా వుంచుకున్న పిండిలో ఉప్పు, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కలపాలి. ఈ మిక్చర్ ని గుడ్డు, పంచాదర, వెనీలాతో చేసుకున్న మిశ్రమానికి కలపాలి. చివరగా, నూనె కూడా వేసి బాగా కలపాలి. నూనె కలపటం వల్ల కూడా కేక్స్ సాఫ్ట్ గా తయారవుతాయి. అన్ని పదార్థాలు కలిపి చేసిన మిశ్రమాన్ని కప్ కేక్స్ మౌల్డ్ లో రెడీగా వుంచిన మఫెన్ కప్స్ లో నింపుకోవాలి. కప్ నిండుగా కాకుండా సగం వరకూ మాత్రమే మిశ్రమం నింపాలి.


కప్స్ అన్నీ వున్న మౌల్డ్ తీసి అంతకు ముందే 15 నిమిషాల పాటూ 180డిగ్రీల టెంపరేచర్ తో వేడి చేసి వుంచిన ఓవెన్ లో పెట్టాలి. మరో 15నిమిషాల పాటూ కప్ కేక్స్ వేడి చేయాలి. తరువాత బయటకు తీసిన కప్ కేక్స్ పై గనాష్ అప్లై చేయాలి. గనాష్ అంటే వేడి చేసిన క్రీమ్ లో చాక్లెట్ కలిపి తయారు చేసిన ద్రవం. ఈ ద్రవాన్ని కప్ కేక్స్ పై నింపాలి. చివరగా, కప్ కేక్ ని తల కిందులుగా చేసి ముందే సిద్దంగా వుంచుకున్న స్ప్రింక్లర్స్ లో అద్దాలి. రంగు రంగుల స్ప్రింక్లర్స్ అందంగా, ఆకర్షణీయంగా కప్ కేక్ కి అంటుకుంటాయి.