తీపి కాకరకాయ పచ్చడి

 

 

పచ్చడుల సీజన్లో రకరకాల పచ్చడులు పెట్టుకోకపోతే ఎలా చెప్పండి. కాకరకాయతో పచ్చడేంటా అనుకుంటే పొరపాటే.  కొంచెం చేదుగా, కొంచెం పుల్లగా, కొంచెం తియ్యగా ఉండే ఈ పచ్చడిలో మధ్యమధ్యన వెల్లుల్లి రుచి. ఆహా చదువుతుంటేనే నోరు ఊరుతుంటే ఇంక వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే ఇంకెంత బాగుంటుందో కదా.

 

కావాల్సిన పదార్థాలు:

కాకరకాయలు - 1 కేజీ

చింతపండు గుజ్జు - 1 కప్పు

బెల్లం - 1 కప్పు

మెంతి పొడి - 1 టీ స్పూన్

ఆవపొడి - 1 టీ స్పూన్

కారం 1/4 కప్పు

పసుపు - చిటికెడు

ఉప్పు - రుచికి తగినంత

వెల్లుల్లి రెబ్బలు - 10,12

పోపు దినుసులు - కొన్ని

నువ్వుల నూనె - అర లీటరు

 

తయారి విధానం:

ముందుగా చింతపండుని వేడినీళ్ళల్లో నానబెట్టి గుజ్జులా తీసి ఉంచుకోవాలి.

 

అలాగే కాకరకాయలని కడిగి, తుడిచి పొడుగ్గా గాని, లేదా చిన్న ముక్కలుగా గాని తరుగుకుని ఉంచుకోవాలి.

 

వాటిని ఒక కడాయిలో నూనె వేసి కాస్త ఎరుపు రంగు వచ్చేలాగా వేయించుకోవాలి.

 

అలా వేగినవి కాస్త చల్లారాకా ఒక బౌల్ లో వేసి అందులో మెంతిపొడి, ఆవపొడి, చింతపండు గుజ్జు, బెల్లం తురుము, కారం, ఉప్పు కలపాలి.

 

అందులో పావులీటరు నూనె కలిపి ఉంచాలి. మరో కడాయిలో మిగిలిన నూనె  వేసి కాగాకా సెనగపప్పు, మినపప్పు, ఆవాలు, మెంతులు, ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పోపు పెట్టుకోవాలి.

 

ఆ పోపుని ముందుగా చేసిపెట్టుకున్న కాకరకాయ మిశ్రమంలో వేసి బాగా కలపి ఒక ఎయిర్ టైట్ డబ్బాలో పెట్టి ఉంచుకోవటమే. అంతే కాస్త వెరైటీగా ఉండే కాకరకాయ పచ్చడి రెడీ.

..కళ్యాణి